సర్కారు వారి ‘రేవు’ పార్టీ!

ABN , First Publish Date - 2021-03-04T08:36:57+05:30 IST

ఒక ఓడరేవు నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.10వేల కోట్లు! ఆ మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి, అన్ని రకాల అనుమతులు తెచ్చుకుని... పోర్టును నిర్మించి... చివరికి దాని నిర్వహణను ఓ ప్రైవేటు

సర్కారు వారి ‘రేవు’ పార్టీ!

వేల కోట్ల ప్రజాధనంతో పోర్టులు కడతారట!

వాటి నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తారట!

సర్కారుకు రిస్క్‌... ప్రైవేటుకు ‘రిస్క్‌ ఫ్రీ’

పీపీపీ, బీవోటీ కాకుండా... ఇదేం పద్ధతి!?

జగన్‌ వినూత్న విధానంపై సర్వత్రా విస్మయం

అస్మదీయులకు కట్టబెట్టడమే వ్యూహమా?

రామాయపట్నం తమదే అంటున్న అరబిందో!

బందరు, భావనపాడుకూ ‘టెండర్లు’ పడ్డాయా!?


ఒక ఓడరేవు నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.10వేల కోట్లు! ఆ మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి, అన్ని రకాల అనుమతులు తెచ్చుకుని... పోర్టును నిర్మించి... చివరికి దాని నిర్వహణను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే దానిని ఏమంటారు? ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి భాషలో చెప్పాలంటే... ‘వినూత్న విధానం’ అంటారు. ఆర్థిక నిపుణుల భాషలో చెప్పాలంటే... ‘ప్రజల సొమ్ముతో పోర్టు కట్టి... అస్మదీయ కంపెనీలకు అప్పగించడం’ అంటారు! మంగళవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన ‘మారిటైమ్‌ సదస్సు’లో ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ప్రకటనలోని ఆంతర్యం ఏమిటి!?


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘రిస్కు ప్రభుత్వానిది. లాభం ప్రైవేటుది’... ఇదీ జగన్‌ సర్కారు కనిపెట్టిన వినూత్న విధానం! ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం... మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం ఓడరేవుల నిర్మాణంలో ‘రిస్క్‌’ను తగ్గిస్తూ వాటి నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడుతుంది. అదే సమయంలో... ‘రిస్క్‌లేని నిర్వహణ’ కోసం వాటిని ప్రైవేటుకు అప్పగిస్తుంది. ఇదే విషయాన్ని మరోరకంగా చెప్పాలంటే... పెట్టుబడి, అనుమతుల సాధనతో సహా నిర్మాణంలో రిస్కులను ప్రభుత్వం భరిస్తుంది. లాభాలను మాత్రం ప్రైవేటుకు అప్పగిస్తుంది. ఇందులో ప్రభుత్వానికి అధిక ఆదాయమిచ్చే ప్రైవేటు సంస్థను కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా ఎంపిక చేస్తామని జగన్‌ పేర్కొన్నారు. దీని వెనుక... ప్రజల సొమ్ముతో కట్టే పోర్టులను అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టే భారీ వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


‘కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌లో ఎంపిక చేస్తాం’ అని సీఎం అంటుండగానే... ‘రామాయపట్నం రేవు మాదే’ అనేలా అరబిందో సంస్థ చెప్పుకొంటోంది. ఇదే తరహాలో బందరు పోర్టు, భావనపాడు పోర్టు ‘పంపకాలు’ కూడా ముందే జరిగిపోయి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు...  రామాయపట్నం పోర్టు కోసమంటూ ఇప్పటికే అభివృద్ధి చేసిన కృష్ణపట్నం పోర్టు పరిధిని తగ్గించారు. పోర్టులను అస్మదీయ సంస్థలకు అప్పగించడమే ‘వినూత్న విధానం’లో ఆంతర్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూమి సమీకరించి, వనరులు సమకూర్చుకుని, అనుమతులు సాధించి, నిర్మాణ వ్యయం భరించి సిద్ధంచేసే రేవును ప్రైవేటుకు అప్పగించాల్సిన అవసరమేమిటన్నదే ఇక్కడ ప్రశ్న? పారిశ్రామికాభివృద్ధి విషయంలో జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి... పోర్టులపై చేసిన ‘వినూత్న’ ప్రకటనకూ మధ్య భారీ వ్యత్యాసం ఉంది.


కొన్ని నెలల క్రితం ప్రకటించిన పారిశ్రామిక విధానం 2020-23లో... ‘మూడేళ్ల తర్వాతే పరిశ్రమలకు ప్రోత్సాహకాలిస్తాం’ అని ప్రకటించారు. అంటే పరిశ్రమను నెలకొల్పి మూడేళ్లపాటు నడిపిన తర్వాతే ప్రోత్సాహకాలు ఇస్తారన్న మాట! కానీ రామాయపట్నం, భావనపాడు, బందరు నౌకాశ్రయాలకు వచ్చేసరికి మాత్రం... ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకుని, ఆ తర్వాత ప్రైవేటుకు అప్పగిస్తుందట! ఇదేమి వినూత్నమో అర్థం కావట్లేదని పారిశ్రామిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 


డబ్బులెక్కడివి సారూ...: జీతాలు, పెన్షన్ల చెల్లింపులకే సర్కారు ఎప్పటికప్పుడు డబ్బులు వెతుక్కుంటోంది. రికార్డు స్థాయిలో అప్పులుచేసి మరీ పథకాలు అమలు చేస్తోంది. మౌలిక సదుపాయాలను అటకెక్కించింది. కొత్త రోడ్ల సంగతి పక్కనపెడితే... ధ్వంసమైన పాత రోడ్లపైన ఇంత తారు-సిమెంటు వేసే దిక్కూ లేదు. మరోవైపు... సర్కారుకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో... వేలకోట్ల విలువైన ప్రైవేటు పోర్టులను సొంత ఖర్చుతో ఎలా కడతారో! పోనీ ఎలాగోలా రేవులు కట్టారే అనుకుందాం! వాటిని ప్రైవేటుకు అప్పగించడం ఏమిటో! 


ఇదీ పద్ధతి... 

ప్రాజెక్టులు పలు రకాలు! 

1) అచ్చంగా ప్రభుత్వం చేపట్టేవి. వీటి  ఖర్చు, నిర్వహణ అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ పద్ధతి ప్రకారం... మూడు రేవులను ప్రభుత్వమే నిర్మించి, ప్రభుత్వమే నిర్వహించి, ప్రభుత్వమే లాభాలు సొంతం చేసుకోవాలి.

2) ప్రైవేటు ప్రాజెక్టులు! ఇవి అచ్చంగా ప్రైవేటు వ్యక్తులు/సంస్థలు ఏర్పాటు చేసేవి. వీటికి పారిశ్రామిక విధానాల ప్రకారం ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తుంది. అంటే... రేవులను ప్రైవేటు సంస్థలే నిర్మించుకుంటాయి, నిర్వహించుకుంటాయి. అంటే... లాభమొచ్చినా, నష్టమొచ్చినా వారికే!

3) ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో(పీపీపీ) ఏర్పాటు చేసేవి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు వాటాలు ముందే నిర్ణయిస్తారు. ‘బిల్ట్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌’ పద్ధతిలో కూడా ప్రాజెక్టులు చేపడతారు. ప్రభుత్వం భూమిఇస్తే ప్రైవేటు వ్యక్తులు నౌకాశ్రయం నిర్మించి, నిర్వహించి కొంత ఆదాయం ప్రభుత్వానికి ఇచ్చి, తర్వాత కొన్నేళ్లకు ప్రభుత్వానికే బదిలీ చేయ డం. లేదా సదరు పోర్టులో ప్రభుత్వం వాటా తీసుకోవడం!


పై పద్ధతుల్లో ఏదీ కాకుండా... ‘ప్రభుత్వ ఖర్చుతో పోర్టులు నిర్మించి... ప్రైవేటు నిర్వహణకు ఇవ్వడం’ అనే వినూత్న విధానానికి జగన్‌ శ్రీకారం చుట్టడం గమనార్హం.

Updated Date - 2021-03-04T08:36:57+05:30 IST