జార్జ్ ఫ్లాయిడ్ మరణం విచారకరం: పోప్ ఫ్రాన్సిస్

ABN , First Publish Date - 2020-06-03T23:34:21+05:30 IST

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణం విషాదకరమని పోప్

జార్జ్ ఫ్లాయిడ్ మరణం విచారకరం: పోప్ ఫ్రాన్సిస్

వాటికన్ సిటి: అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణం విషాదకరమని పోప్ ఫ్రాన్సిస్ విచారం వ్యక్తం చేశారు. జార్జ్ ఫ్లాయిడ్‌తో పాటు జాత్యహంకారం కారణంగా మరణించిన ప్రతి ఒక్కరి కోసం తాను ప్రార్థనలు చేస్తున్నానని అన్నారు. అమెరికాలో నెలకొన్న పరిస్థితులు తనను ఎంతో బాధకు గురిచేశాయన్నారు. అమెరికాలో జాతీయ సయోధ్యకు ఆయన పిలుపునిచ్చారు. జాత్యహంకారం భరించలేనిది అయితే.. అమెరికాలో చెలరేగిన వీధి విధ్వంసం స్వీయ ఓటమి, స్వీయ విధ్వంసమని అన్నారు. హింస ద్వారా ఏం సాధించలేదని పైగా ఎంతో పోగొట్టుకున్నామని గుర్తుపెట్టుకోవాలన్నారు. జాతీయ సయోధ్య, శాంతి కోసం దేవుణ్ణి ప్రార్థించాలని అమెరికన్లను కోరారు. కాగా.. శ్వేత పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మే 25న మరణించాడు. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత అమెరికాలో పరిస్థితులు అదుపు తప్పాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కొన్ని చోట్ల ఈ నిరసనలు విధ్వంసకరంగా మారాయి. నిరసనకారుల సెగకు దేశాధ్యక్షుడు ట్రంప్ బంకర్‌లో తలదాచుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Updated Date - 2020-06-03T23:34:21+05:30 IST