Abn logo
Jul 3 2020 @ 04:59AM

నిక్కమైన రాజనీతిజ్ఞుడు

పీవీ నరసింహారావు 1991లో భారతదేశపు అత్యున్నత రాజకీయ పదవికి ఎన్నిక కావటం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురి చేసిన అంశం. ఉత్తరాదికి చెందిన రాజకీయ హేమాహేమీల మీదే వారి దృష్టి ఉందనేది స్పష్టం. దక్షిణాది నాయకులు అనుయాయులే తప్ప అధినేతలు కాదన్నది వారి చెక్కు చెదరని విశ్వాసం. దక్షిణాదివాడైన కామరాజ్‌ నాడార్‌, మొరార్జీ నిజలింగప్పలను ఎదిరించి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేయటంలో ‘కింగ్‌ మేకర్‌’ పాత్రను నిర్వహించిన విషయాన్ని వాళ్ళు కావాలని మరిచిపోతుంటారు.


ఒక గ్రూపంటూ లేని వాడు రాజకీయ వత్తిడులను తట్టుకుంటూ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏం నడిపిస్తాడన్న శంకలూ వ్యక్తమయ్యాయి. సొంత ఇల్లంటూ లేనివాడు అన్ని ఇండ్లూ తనవేనని భావిస్తాడట. గ్రూపు లేకపోవటమే పీవీకి కలిసి వచ్చిందన్నది వారికి ఆలస్యంగా తెలిసివచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూపరిమితి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయటంతో ఏకుమేకవుతాడేమోనన్న భయంతో భూస్వామ్య నేపథ్యంవున్న తెలుగు కాంగ్రెస్‌ నాయకులే ఆయన రాజీనామా చేసేదాకా పట్టువదలలేదు. సొంత రాష్ట్రంలోనే పూర్తికాలం ముఖ్యమంత్రిగా వుండలేనివాడు ప్రధాని పదవిలో ఐదేండ్లపాటు ఎలా వుంటాడన్న ఊహాగానాలు కొందరు చేస్తూ వచ్చారు. ఎన్నో పరిమితుల మధ్య భూసంస్కరణల రంగంలో పీవీ సాధించిన ఘనవిజయాన్ని గ్రహించలేకపోయారు. 1940 దశకంలో తెలంగాణలో మార్మోగిన ‘దున్నేవాడిదే భూమి’ అన్న నినాదానికి పీవీ తన హృదయాన్ని అంకితం చేశారన్న నగ్నసత్యం వారు గుర్తించలేదు. ‘నీరుకొలది తామర’ (పింగళి సూరన) అన్నట్టుగా సందర్భానికి ఎంత ప్రతిభ అవసరమో అంతే ప్రదర్శించే పీవీని తక్కువ అంచనా వేయటం ఎవరికైనా సులువే. ప్రధానమంత్రి అయిన తొలినాళ్ళలో ఇందిరాగాంధీని కూడా ఇట్లాగే తక్కువ అంచనా వేశారు. 


పీవీ సింగ్‌, చంద్రశేఖర్‌ల సంకీర్ణ ప్రభుత్వాలు దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించిన సన్నివేశంలో, రాజకీయాలతో సంబంధంలేని ఆర్థశాస్త్రవేత్త మన్మోహన్‌ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా ఎంపిక చేయటం పీవీ చాణక్యానికి తొలి నిదర్శనం. అప్పటికే సంస్కరణ వాదిగా పేరు తెచ్చుకున్న పీవీ చకచకా చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఇదే ఆర్థిక సరళీకరణ రూపం తీసుకున్నది. దీన్ని హద్దుమీరని పద్ధతిలోనే తెచ్చారు. వారు ప్రధాని పదవి నుండి వైదొలగిన తర్వాత బిజెపి ప్రభుత్వ ఆర్థిక నీతి ఎట్లా ఉందని విలేకరులు అడిగితే, ‘మేము కిటికీలు మాత్రమే తెరిచాం కానీ వీళ్ళు తలుపులే తెరిచారు’ అని వ్యాఖ్యానించారు పీవీ!


ఢిల్లీ రాజకీయాల్లో పీవీ రక్షణాత్మక వైఖరిని అవలంబించలేదు. ప్రారంభంలో దూకుడునే ప్రదర్శించారు. పీవీ ఆత్మస్థైర్యం సాటి మంత్రివర్గ సభ్యులను, రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. తాను నడుపుతున్నది మైనారిటీ ప్రభుత్వమన్న స్పృహ లేశమాత్రమైనా లేకుండా సాగిపోయారు. దీని వెనుక వున్న కీలకం ఏమిటన్న ప్రశ్న తలెత్తింది. కాంగ్రెస్‌లోని వ్యతిరేక వర్గం విపక్షాలతో చేతులు కలిపి పీవీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు పూనుకుంటే, ఆ ఎత్తు వికటించి ఎన్నికలకు దారితీయవచ్చు. అట్లాంటి పరిస్థితి రాకూడదని ఎంపీలు, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనవారు సహజంగా కోరుకుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని దూకుడుతో కూడిన రాజకీయాలు చేయటానికే పీవీ పూనుకున్నారు. ఇట్లాంటి పరిణామాలు పీవీ రాజకీయ నాయకుని స్థాయి నుండి రాజనీతిజ్ఞుని స్థాయిని అందుకోవటానికి కారణమయ్యాయి. 


అప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోను, కేంద్ర ప్రభుత్వంలోను అనేక కీలకమైన శాఖలను చేసిన అపార అనుభవం దైనందిన అధికార రాజకీయాలను తట్టుకునే శక్తిని పీవీకి ఇచ్చింది. ఇందిరా గాంధీ అనే ఉక్కు మనిషి అధిష్ఠానం రూపంలో వున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణల రంగంలో పీవీ తాను చేయదలచుకున్నది చేయగలిగారు. ప్రధానమంత్రి పదవీకాలంలో సోనియాగాంధీ రూపంలో ఉన్న అధిష్ఠానాన్ని పీవీ ఖాతరు చేయదలచుకోలేదు. ఆమె నుండి ఆజ్ఞులు పొందుతూ పనిచేయటమంటే మంత్రివర్గ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుటమని భావించారు. స్వేచ్ఛను కోల్పోకుండా వుంటే యోగ్యమైన నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చో వారు ఖలిస్థాన్‌ ఉగ్రవాదాన్ని అణచివేసిన తీరులోను, పాకిస్థాన్ ఉగ్రరూపాన్ని అంతర్జాతీయ వేదికల మీద ఎండగట్టిన వైఖరిలోను గమనించవచ్చు. 


పీవీలో మనకు కనిపించే విశిష్ట లక్షణం ఒకటుంది. వారు ముందుగా శాస్త్రాలను అధ్యయనం చేసిన మేధావి. ఆ తర్వాత తమ మేధా సంపదకు సామాజిక కోణంలో రూపం ఇచ్చిన ఆచరణ వాది. వారిలోని ఆధునిక జీవలక్షణం ఈ రెండింటినీ సమతులనం చేసింది. ఉదాహరణగా వారు ప్రవేశపెట్టిన గురుకుల విద్యావిధానాన్ని చూడవచ్చు. వేదాల కాలం నుండి గురుకుల వ్యవస్ధ మనదేశంలోని విద్యావిధానానికి పట్టుకొమ్మగా వుంటూ వచ్చింది. ఆంగ్లేయ విద్యావిధానం ఈ పద్ధతిని దెబ్బతీసింది. ఉద్యోగ కల్పనకు, ఉపాధి అవకాశాలకు దోహదం చేసే ఆంగ్ల విద్యావిధానంలో జోక్యం చేసుకోకుండానే దానికి సమాంతరంగా గురుకుల విద్యను ప్రవేశపెట్టిన వారు పీవీ. ‘కొత్తపాతల మేలుకలయిక’తో శాంతినికేతనం స్థాపించిన ‘గురుదేవ్‌’ రవీంద్రనాథ్‌ టాగోర్‌ తర్వాత, ప్రభుత్వరంగంలోనే కావచ్చు, సాహసంతో  విద్యాసంస్కరణలు చేపట్టిన ఘనత నరసింహారావుకే దక్కుతుంది. ప్రభుత్వాలు విద్యా వైద్యరంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన కాలంలో పీవీ ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. అందుకే ఆయన దార్శనికుడైన రాజకీయ నాయకుడు కాగలిగారు. 1970 ముందు పాఠశాల విద్యలో పదకొండు తరగతులుండేవి. ఆ తర్వాత ఒక సంవత్సరం పి.యు.సి కోర్సు ఉండేది. పాఠశాల విద్యకు డిగ్రీ చదువుకు సంధిదశలో రెండు సంవత్సరాల కోర్సు వుండటం న్యాయమని భావించిన పీవీ ‘ఇంటర్మీడియేట్‌’ విద్యకు రూపకల్పన చేశారు. దీని ఫలితంగానే జూనియర్‌ కళాశాలలు ఆవిర్భవించాయి. అంతేకాదు ‘మాతృభాషలో విద్యాబోధన’ అనే మరో విలువైన కోణం జతగూడింది. ఈ అనుసంధానాన్ని బలోపేతం చేయటానికి తెలుగు అకాడమీ (1968) అనే ప్రత్యేక సంస్థకు ప్రాణప్రతిష్ఠ చేసిందీ, దానికి ఆరేండ్లపాటు అధ్యక్షులుగా వుంటూ మార్గదర్శనం చేసిందీ పీవీ నరసింహారావే. దీంతో మాతృభాషలో విద్యాబోధన అనే లక్ష్యం నెరవేరింది. అంతకు ముందు ఆంగ్ల మాధ్యమంలో ఉన్నత విద్య వుండటం వల్ల చదువుకు దూరమైన బీద బడుగు గ్రామీణ వర్గాల పిల్లలు విద్యాధికులైనారు.


సామాజిక రాజకీయ ఆదర్శాలను అలవరచుకొని, ఆచరణలో రాటు దేలడానికి పీవీకి ఇద్దరు స్పూర్తిదాతలున్నారు. బాల్య కౌమారాలలో కాళోజీ, 1940 తర్వాత రాజకీయ పర్వంలో రామానంద తీర్థ స్ఫూర్తి దాతలు. స్వాతంత్రోద్యమకాలంలో అఫెంసివ్‌ రాజకీయాలు చేసిన వారు రామానంద తీర్థ. బ్రిటిష్‌ వాళ్ళతో జరుగుతున్నది కావటం వల్ల స్వాతంత్రోద్యమం నైజాం ప్రాంతంలో ఉధృతంగా వుండేది కాదు. కాంగ్రెస్‌ పార్టీ మీద నిషేధం కూడా వుండేది. అందువల్ల నిజాం రాజ్యపు సరిహద్దులు దాటిన తర్వాత నిజాంకు వ్యతిరేకంగా ఈటెల వంటి మాటలతో విమర్శలు గుప్పించేవారు రామానంద తీర్థ. ఇవి సంస్థాన ప్రజలను ఉత్తేజపరిచేవి. ఉద్యమజ్వాల ఆరకుండా చేసేవి. నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ను హతమార్చటానికి బాంబుదాడి చేసి విఫలమైన నారాయణ రావు పవార్‌కు ఉరిశిక్ష పడితే, తన పలుకుబడితో దాన్ని రద్దు చేయించిన ఘనుడు రామానంద తీర్థ. అందుకే పీవీ వారిని తమ రాజకీయ గురువుగా సంభావించారు. రామానంద తీర్థ ట్రస్ట్‌ను స్థాపించి గురువుగారి ఆదర్శాలను ఆచరణలో పెట్టారు. ప్రస్తుతం వారి కుమార్తె వాణి ఆ ట్రస్టును ముందుకు తీసుకుపోతున్నారు.


పీవీకి కాళోజీ పట్ల ఎనలేని ప్రేమాభిమానాలున్నాయి.ఎప్పుడు ఎక్కడ తారసపడ్డా, ‘కాళన్నా’ అంటూ హత్తుకునేవారు. వరంగల్‌లో కాళోజీ నాయకత్వంలో గణపతి ఉత్సవాలు (1930 ప్రాంతం) జరిగినప్పుడు పీవీ చురుకుగా పాల్గొన్నారు. తెలుగు సమాజం ఏకకాలంలో మతతత్వవాదులతో, నిజాం ప్రభుత్వంతో చురుకుగా పోరాటం చేసిన ఘట్టానికి పీవీ సాక్షి, కార్యకర్త కూడా. అప్పటి నుండి వారు కాళోజీని అతి సన్నిహితంగా గమనిస్తూ వచ్చారు. కాళోజీ వ్యక్తిత్వంలోని త్రికరణ శుద్ధి పీవీని బాగా ఆకర్షించింది. కాళోజీ షష్ఠిపూర్తి (1974) ఉత్సవంలో పాల్గొన్న సందర్భంలో పీవీ మాట్లాడుతూ ‘‘కాళోజీ నాకంటే వయసులో ఆరు ఏండ్లు పెద్ద. చదువుల మాత్రం మూడేండ్లే పెద్ద. చదువు కుంటున్నప్పుడు సీనియర్స్‌కు, జూనియర్స్‌కు కూడా ఆయన నడవడి ఉత్సాహం ఉత్తేజం కలిగించేది’’ అన్నారు. అంతేకాదు ‘‘కాళోజీ ఖతర్నాక్‌ మనిషి. ఆయన సోపతి పట్టకుండ్రి’’ అని తమ పెద్దలు చెప్పినా పీవీ మాత్రం కాళన్న సోపతి మానలేదు. తొలిదశలో పీవీ మీద కాళోజీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ విశ్వాసాలలో విభేదాలున్నా అవి వారి స్నేహానికి అడ్డంకి కాలేదు. ప్రధానమంత్రిగా పీవీ ప్రతిపాదించిన ‘పద్మవిభూషణ్‌’’ పురస్కారాన్ని (1992) వద్దనకుండా కాళోజీ స్వీకరించటానికి ఆ సజీవ అనుబంధమే కారణమైంది. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో రష్యా అధినేతగా గోర్చచేవ్‌ ఉన్నాడు. ఈయన హయాంలోనే రాజకీయంగా రష్యా విచ్ఛిన్నమైంది. ఈ రాజకీయ పరిణామం మీద అన్ని దేశాల పత్రికలు, చానళ్ళు చర్చోపచర్చలు చేశాయి. అమెరికా అధ్యక్షుడు సహా పెద్ద దేశాల అధినేతలు వ్యాఖ్యానించారు. కానీ, పీవీ మౌనంగా వున్నారు. అప్పుడు కాళోజీ పీవీకి ఫోన్‌ చేసి ‘ఈ అంశం మీద అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్తున్నారు. నువ్వేమీ మాట్లాడలేదు’ అని కాస్త అసహనంతో అడిగారట. ఇందుకు జవాబుగా, ‘కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా’ అని ఆన్నారట పీవీ!


అవును, పీవీ మన బంగారం మన ఆత్మగౌరవం. సంస్కరణలతో దేశాన్ని కాపాడిన సాహసి. అరుదైన సాహితీ పిపాసి. స్వయం ప్రకాశమున్న చంద్రుడు. అందుకే వారి కీర్తిచంద్రికలు చొక్కమైనవి, నిక్కమైనవి.

- అమ్మంగి వేణుగోపాల్‌

Advertisement
Advertisement
Advertisement