Abn logo
Jan 13 2021 @ 01:06AM

కొత్త బడ్జెట్ కు విధాన బాటలు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో మూడు వారాల్లో కొత్త వార్షికబడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఒక మహా వైపరీత్య కాలం కనుక గత ఆర్థిక సంవత్సర (2019–20) పద్దులు, అంచనాల ఆధారంగా రాబోయే బడ్జెట్ ఎలా ఉండాలనే విషయమై నా సూచనలు నివేదించదలిచాను.


తొలుత ఆదాయం విషయం చూద్దాం. కార్పొరేట్ పన్నులు పెంచాలనేది నా మొదటి సూచన. 2019–20లో ఈ పన్ను వసూళ్ళలో కేంద్రప్రభుత్వ వాటా రూ. 3.2లక్షల కోట్లు. దీనిని రూ.4లక్షల కోట్లకు పెంచవచ్చు. మనదేశంలో పన్నులు భారీస్థాయిలో ఉంటున్నందున వాటి చెల్లింపును తప్పించుకోవడానికి మన కార్పొరేట్ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను విదేశాలకు తరలించే ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. ద్వంద్వ పన్నుల చెల్లింపు నివారణ ఒప్పందాలను సవరించడం ద్వారా ఈ పరిస్థితిని సరిదిద్దాలి.


ఆదాయపుపన్ను రేట్లను పెంచి తీరాలి. ఇది నా రెండో సూచన. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పన్ను వసూళ్ళలో కేంద్రప్రభుత్వ వాటా రూ.2.8లక్షల కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను రూ.4 లక్షల కోట్లకు పెంచి తీరాలి. దీనివల్ల మెరుగైన ఆదాయవర్గాల వారి నుంచి వినియోగ డిమాండ్ తగ్గిపోయే మాట నిజమే. అయితే హెలికాప్టర్ మనీ (మాంద్యం బారిన పడిన ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధి ఉద్దీపన కలిగించడం కోసం భారీ పరిమాణంలో ముద్రించి, ప్రజలకు పంపిణీ చేసే డబ్బును ఈ విధంగా వ్యవహరిస్తారు) నుంచి మరింత భారీ డిమాండ్‌ను సృష్టించవచ్చు (ఇదెలాగో తరువాత పేర్కొంటాను). 


మూడో సూచన- వస్తుసేవల పన్ను రేట్లను తగ్గించాలి. 2019–20లో జిఎస్టీ వసూళ్ళలో కేంద్రప్రభుత్వ వాటా రూ.6.1లక్షల కోట్లు. దీనిని కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.4లక్షల కోట్లకు తగ్గించాలి. ఈ చర్య వల్ల మార్కెట్‌లో సరుకుల ధరలు తగ్గి, తత్ఫలితంగా డిమాండ్ పెరుగుతుంది. కస్టమ్స్ సుంకాల (దిగుమతులపై విధించే పన్ను)ను మూడురెట్లు పెంచాలి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సుంకాల వసూళ్ళలో కేంద్రప్రభుత్వ వాటా రూ.0.6లక్షల కోట్లు. ఈ మొత్తాన్ని రూ.2 లక్షల కోట్లకు పెంచి తీరాలి.


పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను పెంచి తీరాలనేది నా ఐదో సూచన. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ సుంకాల వసూళ్ళలో కేంద్రప్రభుత్వ వాటా రూ.2.5లక్షల కోట్లు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను రూ.4లక్షల కోట్లకు పెంచాలి. పెట్రోలియం ఉత్పత్తుల ధర పెరుగుదల వల్ల సామాన్యునిపై మరింత ఆర్థికభారం పడుతుంది. అయితే ఈ నష్టానికి హెలికాప్టర్ మనీ ద్వారా పరిహారం సమకూర్చవచ్చు. ఇక ఆరవ సూచన- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పైగా ఉన్న ఆర్థికలోటును 2019– 20 ఆర్థిక సంవత్సరంలో వలే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.8 శాతానికి పరిమితం చేయాలి. దీనివల్ల అప్పుల నుంచి రూ.7.6 కోట్లు సమకూరుతాయి. 2019–20లో కేంద్రప్రభుత్వ బడ్జెట్ విలువ రూ.27లక్షల కోట్లు. పైన సూచించిన విధంగా పెరిగే పన్ను వసూళ్ళతో రాబోయే కేంద్రప్రభుత్వ బడ్జెట్ మొత్తం విలువ రూ.30 లక్షల కోట్లుగా ఉంటుంది. 


వ్యయాల విషయానికి వస్తే రక్షణరంగానికి కేటాయింపులను పెంచాలి. గత ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి కేంద్రం మొత్తం రూ.4.4లక్షల కోట్లు వెచ్చించింది. చైనా నుంచి ముప్పు ముమ్మరమైనందున ఈ వ్యయాన్ని 2021–22లో రూ.7లక్షల కోట్లకు పెంచి తీరాలి. అలాగే టెక్నాలజీ, కమ్యూనికేషన్ల రంగాలకూ కేటాయింపులు పెంచాలి. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఈ రెండు రంగాలకు రూ.0.3లక్షల కోట్లు చొప్పున ఖర్చు పెట్టింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయాలను ఐదు రెట్లు పెంచాలి. సాంకేతికతల అభివృద్ధిలో దేశం అగ్రగామిగా విలసిల్లేందుకు ఈ వ్యయాలు విశేషంగా తోడ్పడతాయి. మూడో సూచన- హోం మంత్రిత్వ శాఖకు వెచ్చిస్తున్న రూ.1.4 లక్షల కోట్లను యథాతథంగా కొనసాగించాలి. నాలుగో సూచన- ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేటాయిస్తున్న రూ.0.6లక్షల కోట్లను యథాతథంగా కొనసాగించాలి. ఐదో సూచన- మౌలిక సదుపాయాల అభివృద్ధి వ్యయాలను తాత్కాలికంగా తగ్గించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యారంగ వ్యయాలను పూర్తిగా రద్దు చేయాలి. 2019–20లో ఈ పథకాలు, కార్యక్రమాలకు కేంద్రం రూ.20లక్షల కోట్లు వెచ్చించింది. 2021–22లో ఈ మొత్తాన్ని రూ.10 లక్షల కోట్లకు తగ్గించాలి. 


ప్రస్తావిత వ్యయాలకు రూ.22లక్షల కోట్లు అవసరమవుతాయి. ఈ మొత్తం పోను మొత్తం ఆదాయం రూ.30 లక్షల కోట్లలో రూ.8 లక్షల కోట్లు మిగులుతాయి. ఈ మిగులు డబ్బును 140 కోట్ల భారత పౌరుల బ్యాంక్ ఖాతాలకు ‘హెలికాప్టర్ మనీ’గా జమచేయాలి. ఒక్కో వ్యక్తికి నెలకు రూ.500 చొప్పున సమకూరుతుంది. సంక్షేమ పథకాల రద్దు, పెట్రోలియం ఉత్పత్తుల పెరుగుదల వల్ల వాటిల్లే నష్టాన్ని ఈ నగదు బదిలీ భర్తీ చేస్తుంది. మార్కెట్‌లో డిమాండ్‌ను ఇతోధికం చేసేందుకు ఇది తోడ్పడుతుంది. దీనితో పాటు దిగుమతి సుంకాల పెంపుదల ఫలితంగా మార్కెట్‌లో సరుకులకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరుగుదల కొత్త ఉద్యోగాల సృష్టికి దారితీస్తుంది. భద్రమైన ఆదాయాలు మరింత డిమాండ్‌కు ఉద్దీపన అవుతాయి. ఆర్థికవ్యవస్థ మెరుగుపడిన తరువాత ఒకటి రెండు సంవత్సరాలలో హైవేలు మొదలైన మౌలిక సదుపాయాలపై వ్యయాలను పునరుద్ధరించవచ్చు. 


మనం ప్రస్తుతం ఒక సంక్షోభంలో ఉన్నాం. పెద్దఎత్తున రుణాలు తీసుకోవడం ద్వారా పెట్టుబడి సాంద్ర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణానికి భారీవ్యయాలు చేయడం శ్రేయస్కరం కాదు. ఆ అప్పులు వడ్డీరేట్లను పెంచుతాయి. ఆర్థికవ్యవస్థను కుంగదీస్తాయి. పన్నుల పెంపుదల, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా దేశీయ మార్కెట్‌లో డిమాండ్ అధికమయ్యేందుకు అవకాశమున్నది. మరి ఈ లక్ష్యసాధనకు రుణాలు తీసుకుని అప్పుల ఊబిలోకి దిగజారడమెందుకు? 

భరత్ ఝన్ ఝన్ వాలా

Advertisement
Advertisement
Advertisement