ప్రమాదపు అంచున పోలీసులు

ABN , First Publish Date - 2020-04-09T12:23:03+05:30 IST

ప్రమాదపు అంచున పోలీసులు

ప్రమాదపు అంచున పోలీసులు

రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా ఆందోళన 

ఉల్లంఘనులను నిలువరిస్తూ... వాహనాలను సీజ్‌ చేస్తుంటే జరభద్రం   

పీపీఈ కిట్స్‌ ధరించడం ఉత్తమం   

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేదు. కుల, మత, ప్రాంతీయ భేదం లేదు. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. కరోనా మహమ్మారి ఎవరికి.. ఎప్పుడు సోకుతుందో అర్థం కాని పరిస్థితి. దేశహితం కోసం పాటుపడుతున్న వైద్యులు, పోలీసులకు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే. రాత్రి, పగలు లాక్‌డౌన్‌ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న గస్తీ పోలీసులు ప్రమాదపుటంచున విధులు నిర్వహిస్తున్నారు.


కరోనా హైరానా.. 

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వేలాది మంది వాహనదారులను పోలీసులు నిలువరిస్తున్నారు. ఈ క్రమంలో వారితో మాట్లాడటం, నిబంధనలను ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్‌ చేస్తుంటారు. ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ ప్రాంతానికి  చెందిన వారు? వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా? లేవా అనే విషయం తెలియదు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు సైతం నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్న సందర్భాలున్నాయి. వారిలో విదేశీయులతో.. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో సంబంధం, బంధుత్వం ఉందా.. లేదా అనేది తెలియదు.  అలాంటి పరిస్థితుల్లో ఉల్లంఘనులతో మాట్లాడుతున్నప్పుడు, వాహనాలను సీజ్‌ చేస్తున్నప్పుడు, వారితోపాటు మరికొంతమంది ఉల్లంఘనులు పోలీసుల చుట్టూ చేరి వాహనం కోసం బ్రతిమాలుతున్నప్పుడు భౌతిక దూరం పాటించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్‌ సోకే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఆ మహమ్మారి బారినపడే అవకాశం ఉంది. పోలీసులు ప్రమాదపుటంచున విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్స్‌ ధరించి విధులు నిర్వహిస్తే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. ప్రస్తుతం నగరంలో చాలాచోట్ల పోలీసులు పీపీఈ కిట్స్‌ లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధుల్లో వేలాది వాహనాలను సీజ్‌ చేశారు. వందలమందితో ముఖాముఖి మాట్లాడారు. ఇప్పటికైనా అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటే కొవిడ్‌ బారిన పడకుండా ఉండవచ్చు.

Updated Date - 2020-04-09T12:23:03+05:30 IST