Shocking Incident: భార్యాభర్తలు విడిపోతే ఇద్దరూ మరీ ఇలా తయారవ్వాలా.. ఇలాంటి స్టోరీ ఎప్పుడూ చూసుండరు..

ABN , First Publish Date - 2022-04-30T21:57:16+05:30 IST

చెన్నైలోని శ్రీపెరంబదూరు పోలీసులకు శ్రీపెరంబదూరు సమీపంలోని తీరసపురం గ్రామ శివార్లలో గుర్తుతెలియని యువతి శవం కనిపించిందని ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని..

Shocking Incident: భార్యాభర్తలు విడిపోతే ఇద్దరూ మరీ ఇలా తయారవ్వాలా.. ఇలాంటి స్టోరీ ఎప్పుడూ చూసుండరు..

కాంచీపురం: చెన్నైలోని శ్రీపెరంబదూరు పోలీసులకు శ్రీపెరంబదూరు సమీపంలోని తీరసపురం గ్రామ శివార్లలో గుర్తుతెలియని యువతి శవం కనిపించిందని ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని డెడ్‌బాడీని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం శ్రీపెరంబదూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈలోపు పోస్ట్‌మార్టం రిపోర్ట్ రానే వచ్చింది. చనిపోయిన యువతి వయసు 23 సంవత్సరాలు ఉండొచ్చని, ఆ యువతిని దారుణంగా హత్య చేశారని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. హత్యగా తేలడంతో పోలీసులు ఈ కేసు విచారణలో మరింత వేగం పెంచారు. ఎట్టకేలకు ఆ యువతి ఎవరో గుర్తించారు. హత్యకు గురైన ఆ యువతి పేరు ప్రియ(23) అని, ఆమె రాణిపేట జిల్లా కావేరిపక్కం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును లోతుగా విచారించిన పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి. ఈ కేసు గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియ అనే సదరు యువతి నవీన్ అనే యువకుడిని ప్రేమించింది. ప్రియ కంటే నవీన్ మూడు సంవత్సరాలు వయసులో చిన్న. ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక పాప పుట్టింది. దురదృష్టవశాత్తూ ఆ పాప కొన్ని నెలల క్రితం చనిపోయింది.



ఈ పరిణామం తర్వాత భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో నవీన్, ప్రియ విడిపోయారు. అప్పటినుంచి ప్రియ భర్తకు దూరంగా ఉంటోంది. నవీన్ మాత్రం కల్పన (32) అనే ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాంచీపురంలోని పల్లవర్‌మేడు ప్రాంతానికి చెందిన ఈ కల్పన ఒక గంజాయి డీలర్. భర్తకు దూరంగా ఉన్న ప్రియ కూడా పెడతోవ పట్టింది. తిరువళ్లూరు జిల్లాకు చెందిన జ్యోతి అనే ఒక ఫిమేల్ బ్రోకర్ పరిచయం కావడంతో ప్రియ వ్యభిచారంలోకి దిగింది. గంజాయికి కూడా బానిస అయింది. ప్రియ తన భర్త నవీన్ ఎక్కడైనా రోడ్డు మీద తారసపడితే అవమానించి పరువు తీసేది. ఇటీవల.. ప్రియ తన భర్త నవీన్ కల్పన అనే మహిళతో, స్వలింగ సంపర్కానికి ఆకర్షితుడై ఆమె సోదరుడు కాళిదాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్పన, కాళిదాస్ కాంచీపురంలో గంజాయి అమ్ముతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో కల్పన, కాళిదాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.



కొన్ని నెలల జైలు శిక్ష అనంతరం కల్పన జైలు నుంచి విడుదలైంది. తమను జైలుకు పంపిన ప్రియపై కక్ష పెంచుకుని నవీన్‌తో కలిసి ఆమె హత్యకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే.. నవీన్‌తో ఫోన్ చేయించి నమ్మబలికే మాటలు చెప్పి ప్రియను కాంచీపురంలోని ఒక ప్రైవేట్ హోటల్‌కు పిలిచారు. ప్రియ, కల్పన, నవీన్ ముగ్గురూ మద్యం తాగి, గంజాయి పీల్చారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రియను చిత్రహింసలకు గురిచేసి ఆమె చున్నీతోనే ఉరి బిగించి చంపారు. ఆ తర్వాత ప్రియ మృతదేహాన్ని దొరకకుండా చేయాలన్న ఉద్దేశంతో నవీన్, కల్పన కలిసి ఓ ప్లాన్ చేశారు. ప్రియ మృతదేహాన్ని మధ్యలో కూర్చోబెట్టి బైక్‌పై ఎవరికీ తెలియకుండా రాత్రి సమయంలో మృతదేహాన్ని దాదాపు 40 కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లారు. కాంచీపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ శివార్లలో ప్రియ మృతదేహాన్ని పడేశారు. పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును ఛేదించి ప్రియ హత్య కేసులో నవీన్, కల్పనను అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-04-30T21:57:16+05:30 IST