Abn logo
Aug 2 2020 @ 02:44AM

పోలీస్‌ ఫస్ట్‌

  • విశాఖ తరలి వెళ్లేందుకు కసరత్తులు.. 
  • పోలీసింగ్‌, ట్రాఫిక్‌, వీఐపీ భద్రత

(అమరావతి - ఆంధ్రజ్యోతి) : పరిపాలనా రాజధాని విశాఖకు పయనమయ్యేందుకు పోలీసు శాఖ ముందు వరుసలో నిల్చుంది. మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్‌ ఆమోద ముద్ర పడిన 24 గంటల్లోనే ఈ అంశంపై దృష్టి సారించింది. ‘కాబోయే రాజధాని విశాఖలో భద్రత’పై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సీనియర్‌ ఐపీఎ్‌సలతో కమిటీ వేశారు. విశాఖ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీనా (అడిషనల్‌ డీజీ) చైర్మన్‌గా నలుగురు ఐజీలు, ఇద్దరు డీఐజీలతో కూడిన కమిటీకి ప్లానింగ్‌ విభాగం ఓఎ్‌సడీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అతి త్వరలో పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో పోలీసు ప్రధాన కార్యాలయం ఏర్పాటు, అనుకూలతలపై నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించి ప్రతికూలతలపైనా అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాలన్నారు. ఇతర శాఖలన్నింటికన్నా ముందుగా పోలీసు శాఖ మార్చ్‌ ఫాస్ట్‌కు రెడీ అవడంతో... మిగిలిన శాఖలు కూడా సర్దుకోవాలన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కడ ఏవి జరిగినా మొదట ఉండేది పోలీసులే.


విశాఖపట్నానికి సీఎం కార్యాలయం మొదలుకొని ఏ ఇతర శాఖలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు రావాలన్నా ముందుగా ఉండాల్సింది పోలీసులే. అందుకోసం విశాఖ నగరం, ట్రాఫిక్‌ పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వీఐపీల రక్షణ, పోలీ సు సిబ్బంది పెంపు తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈనెల 14లోపు నివేదిక ఇస్తుంది.


వీఐపీల భదత్ర కీలకం...

విశాఖ మన్యంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. ఒడిసా నుంచి మావోయిస్టులు విశాఖ మన్యంలోకి వచ్చి వెళుతుంటారని పోలీసులకూ తెలుసు. నక్సల్స్‌ రెండేళ్ల క్రితం ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని హత్య చేసి పోలీసులకు సవాల్‌ విసిరారు. విశాఖపట్నం పాలనా రాజధానిగా మారడంతో అక్కడ వీఐపీల కదలికలు పెరుగుతాయి. వారికి రక్షణ ఎలా కల్పించాలి.? ఎంతమంది పోలీసులను అదనంగా విశాఖలో అందుబాటులో ఉంచాలి? తదితర అంశాలపై ఎస్‌ఐబీ చీఫ్‌తోపాటు విశాఖ డీఐజీ సూచించే అవకాశముంది. అలాగే,  ఏపీఎస్పీ బెటాలియన్‌ ఎక్కడ ఉండాలి? భవిష్యత్తులో ఆందోళనలు జరిగితే ఎలా కట్టడి చేయాలి? సిటీలో ట్రాఫిక్‌ ఎలా క్రమబద్ధీకరించాలి? తదితర అంశాలపై కమిటీలోని సభ్యులైన సీపీ మీనా, మాజీ సీపీ లడ్డా, జాయుంట్‌ సీపీ నాగేంద్ర సూచనలతో నివేదిక ఇస్తారు. స్థానిక పరిస్థితులు, పోలీసులకు శిక్షణ, రాజధానికి తగిన పోలీసింగ్‌ తదితర అంశాలపై ఐజీ సంజయ్‌తో పాటు ఇతర సభ్యులు చర్చించి.. ఎంతమంది డీసీపీలు అవసరం, జాయింట్‌ సీపీల సంఖ్య పెంపు, అడిషనల్‌ సీపీ అవసరం, సిబ్బంది పెంపు, పోలీసు స్టేషన్లు పెంచాలా, పోలీసింగ్‌లో మార్పులు ఎలా చేయాలి, వీఐ పీ కదలికలకు అనుగుణంగా ఎలా పోలీసింగ్‌ చేపట్టా లి, రాజధానికి ఉండాల్సిన హంగులు, కొత్తగా వింగ్‌లు తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నారు.


ఐటీ హిల్స్‌పై డీజీపీ ఆఫీస్‌..

మధురవాడ ఐటీ హిల్స్‌పై డీజీపీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. ఐటీ కంపెనీల కోసం గత ప్రభుత్వం కేటాయించిన భవనాల్లో అనుకూలమైన వాటిని కమిటీ ఎంపిక చేయనుంది. అందులో ఒకదాన్ని డీజీపీ ఆఫీసుకు ఇవ్వాలని పోలీసు శాఖ కోరనుంది. అందులోనే సీఐడీ విభాగం, టెక్నికల్‌ సర్వీసెస్‌ ఏర్పాటు చేస్తారు. లేదంటే వాటికి సమీపంలోని ఇతర భవనాలను ఎంపిక చేస్తారు. ఏసీబీ, విజిలెన్స్‌, ఇంటెలిజెన్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగాలకు అనుకూలమైన భవనాలను ఎంపిక చేసి శాశ్వతంగా ఎక్కడ నిర్మిస్తే అనుకూలంగా ఉంటుందో స్థలాలను కూడా చూడనున్నట్లు సమాచారం. ప్రభుత్వం స్థలాలు కేటాయించాక వాటిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపడతారని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement