ఆందోళన చేస్తున్నవారిపై దాష్టీకం
స్పృహ తప్పి పడిపోయిన నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జి
అరవిందబాబును అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా వైసీపీ దాడి
ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స
జొన్నలగడ్డలో తీవ్ర ఉద్రిక్తత
దాడికి నిరసనగా టీడీపీ శ్రేణుల ర్యాలీ
నరసరావుపేట, జనవరి 16: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు, పార్టీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పోలీసులకు, ఆ పార్టీ శ్రేణులకు మధ్య జరిగిన తోపులాటలో అరవిందబాబు స్పృహ తప్పి పడిపోయారు. ఆయన్ను టీడీపీ నేతలు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడిచేశాయి. అంబులెన్స్ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరవిందబాబుకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. శనివారం జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే.. జొన్నలగడ్డలోని సొసైటీ భవనం వద్ద ఉన్న వైఎస్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి తీసుకెళ్లారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు 14 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం ఇద్దరిని అరెస్టు చేశారు. దీనిని నిరసిస్తూ.. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని జొన్నలగడ్డలో అరవిందబాబు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, శ్రేణులు ఆందోళనకు దిగారు. మరోవైపు... ఆయనపై దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని.. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో అరవిందబాబును పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై నిరసన తెలియజేస్తే పోలీసులతో దాడి చేయిస్తారా అని నిలదీశారు. దాడికి కారణమైన పోలీసులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవిందబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కాలర్ బోన్ విరిగిందని.. లో బీపీ ఉందని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, జవహర్, ఆనందబాబు, ఆలపాటి రాజా, మాజీ ఎంపీ రాయపాటి, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని, తెనాలి శ్రావణ్‌కుమార్, జీవీ ఆంజనేయులు తదితర నేతలు ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. జరిగిన దాడిని ఖండిస్తూ టీడీపీ శ్రేణులు నరసరావుపేటలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించాయి.