ఎన్నారైకి రూ. 65 ల‌క్ష‌లు కుచ్చుటోపీ పెట్టిన తల్లి, కొడుకు అరెస్ట్ !

ABN , First Publish Date - 2020-05-29T19:06:26+05:30 IST

పెళ్లి పేరిట‌ ఎన్నారైకి రూ. 65 ల‌క్ష‌లు కుచ్చుటోపీ పెట్టిన జూబ్లీహిల్స్‌కు చెందిన‌ త‌ల్లి, కొడుకును హైద‌రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎన్నారైకి రూ. 65 ల‌క్ష‌లు కుచ్చుటోపీ పెట్టిన తల్లి, కొడుకు అరెస్ట్ !

హైద‌రాబాద్: పెళ్లి పేరిట‌ ఎన్నారైకి రూ. 65 ల‌క్ష‌లు కుచ్చుటోపీ పెట్టిన జూబ్లీహిల్స్‌కు చెందిన‌ త‌ల్లి, కొడుకును హైద‌రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌ల్లి మాళ‌విక దేవ‌తి(44), కుమారుడు వెంక‌టేశ్వ‌ర ప్ర‌ణ‌వ్ ల‌లిత్ గోపాల్‌ దేవ‌తి(22) మ్యారేజ్ పోర్ట‌ల్‌లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి కాలిఫోర్నియాలో ఉండే ఎన్నారైని ఏకంగా రూ. 65 ల‌క్ష‌లు బురిడీ కొట్టించారు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్‌ పోలీసులు గురువారం త‌ల్లి, కొడుకును అరెస్ట్ చేశారు. 


పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... ల‌లిత్ గోపాల్ త‌న త‌ల్లి పేరు మీదా ఓ మ్యారేజ్ పోర్ట‌ల్‌లో న‌కిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. కిర్తీ మాధ‌వ‌నేని పేరుపై ప్రొఫైల్ క్రియేట్ చేసిన అత‌ను... అక్క‌డ ఒక ఫేక్ స్టోరీ కూడా అల్లాడు. "జూబ్లీహిల్స్‌లోని నంద‌గిరి హిల్స్‌లో ఉండే కిర్తీ ధ‌న‌వంతురాలైన వైద్యురాలు. కిర్తీ తండ్రి చ‌నిపోవ‌డంతో ఆమె త‌ల్లి మ‌హాల‌క్ష్మీ మాధ‌వ‌నేని.. ఆస్తుల‌న్నీ త‌న పేరిట రాయాల‌ని కిర్తీని టార్చ‌ర్ చేస్తుంది. ఒక‌వేళ కిర్తీకి పెళ్లైతే ఆస్తుల‌న్నీ ఆమె పేరు మీద ఉంటాయి. క‌నుక ఆమె ఆస్తులు ఆమెనే చూసుకోగ‌ల‌దు." అని స్టోరీ రాశాడు. 


మ్యారెజ్ పోర్ట‌ల్‌లో కిర్తీ ప్రొఫైల్ చూసిన కాలిఫోర్నియాలో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ వ‌రుణ్ స్పందించాడు. ప్రొఫైల్‌లో పేర్కొన్న మొబైల్ నెం.కు ఫోన్ చేసిన వరుణ్‌తో మాళ‌విక దేవ‌తి... కిర్తీ పేరుతో మాట క‌లిపింది. దీంతో వ‌రుణ్ త‌ర‌చూ ఆమెకు ఫోన్ చేసే వాడు. ఈ క్రమంలో అత‌ని వ‌ద్ద మాళ‌విక కొంత న‌గ‌దు కావాల‌ని అడిగింది. త‌న ఆస్తుల విష‌య‌మై కోర్టులో పోరాడుతాన‌ని, దీనికోసం త‌న‌కు ఆర్థిక స‌హాయం కావాల‌ని కోరింది. ఆస్తులు త‌న పేరు మీద వ‌స్తే... పెళ్లైన త‌ర్వాత అవి నీకే ద‌క్కుతాయ‌ని న‌మ్మ‌బ‌లికింది. అది నిజ‌మ‌ని న‌మ్మిన వ‌రుణ్ ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాకు ప‌లు ద‌ఫాల‌లో రూ. 65 ల‌క్ష‌లు ట్రాన్స్‌ఫ‌ర్ చేశాడు. కొన్ని రోజుల త‌ర్వాత త‌ల్లి, కొడుకు ఫోన్ నెంబ‌ర్ మార్చేశారు. మ్యారెజ్ పోర్ట‌ల్‌లో ప్రొఫైల్ కూడా మాయమైంది. దీంతో వ‌రుణ్ తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అత‌ని ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్‌ పోలీసులు తల్లి, కొడుకును అరెస్ట్ చేశారు. 

Updated Date - 2020-05-29T19:06:26+05:30 IST