పోలవరానికి షాక్‌!

ABN , First Publish Date - 2020-10-22T08:21:48+05:30 IST

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై విపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ పదేపదే చేసిన విమర్శలే ఇప్పుడు శాపంగా మారాయి. ‘మీ మాటకే కట్టుబడదాం’ అన్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని

పోలవరానికి షాక్‌!

20 వేల కోట్లే ఫైనల్‌.. అంచనా వ్యయానికి కేంద్రం భారీ కోత

2013 నాటి అంచనాలకే పరిమితం..

సవరించిన అంచనా 55 వేల కోట్లకు ‘నో’

భారీగా కుదించేసిన కేంద్ర ఆర్థిక శాఖ

రీఇంబర్స్‌ చేయాల్సింది 2234 కోట్లు

అదిపోగా ఇచ్చేది 4819 కోట్లే

అందుకు ఒప్పుకోవాలని స్పష్టీకరణ

భూసేకరణ, పునరావాస వ్యయం 

పెరిగినా పరిగణనలోకి తీసుకోని కేంద్రం

పోరాడి, ప్రశ్నించలేని స్థితిలో రాష్ట్రం!


పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై విపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ పదేపదే చేసిన విమర్శలే ఇప్పుడు శాపంగా మారాయి. ‘మీ మాటకే కట్టుబడదాం’ అన్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని ‘అతి భారీ’గా కుదించింది. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస వ్యయం అంతా కలిపి రూ.20,398.61 కోట్లు మాత్రమే అని తేల్చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆ మొత్తం మాత్రమే ఇస్తామని... ఇప్పటికే పలు విడతల్లో విడుదల చేసిన నిధులను, రీఇంబర్స్‌ చేయాల్సిన మొత్తాన్ని మినహాయిస్తే, ఇక రూ.4819.474 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వస్తాయని కుండబద్దలు కొట్టింది. ‘మేం ఇచ్చేది ఇంతే. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ను ఒప్పించండి’ అని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి (పీపీఏ) కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా స్పష్టం చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆంధ్రుల జలజీవ నాడిగా తెరపైకి వచ్చిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం షాక్‌ ఇచ్చింది. జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న పోలవరం అంచనా వ్యయాన్ని... 2013-14లో పేర్కొన్నట్లుగా రూ.20,398.61 కోట్లకే పరిమితం చేసింది. 2013లో వచ్చిన కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం పరిహారం ఖర్చు భారీగా పెరగడంతో... ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు చేరుకుంది. ఇదంతా కేంద్రమే భరించాలంటూ చంద్రబాబు సర్కారు గతంలో గట్టిగా పోరాడింది. 2019 ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ కూడా ఇందుకు అంగీకరించింది. ఎన్నికల తర్వాత సీన్‌ మారిపోయింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ఫైలును పరిశీలించిన కేంద్ర ఆర్థిక శాఖ రూ.47,725.24 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపింది. భూసేకరణ వ్యయాన్ని కుదిస్తూ గత ఏడాది జూలైలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు... అది కూడా కుదరదు తూచ్‌ అంటూ ‘రివర్స్‌’ మంత్రం పఠించింది.


రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ  మంత్రివర్గం ఆమోదించిన అంచనా వ్యయానికి మాత్రమే కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పింది. దీనిపై ఈనెల 12వ తేదీన పీపీఏకు లేఖ రాసినట్లు తెలిసింది. 2013-14 లెక్కల ప్రకారం పోలవరం అంచనా వ్యయం 20,398.61 కోట్లు. ఇందులో అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏఐబీపీ కింద కేంద్రం ఇచ్చిన నిధులను కలుపుకొని రూ.4730.71 కోట్లను  వ్యయం చేసింది. అంటే, మిగిలింది 15,667.90 కోట్లు! 2014 నుంచి ఇప్పటి వరకూ నాబార్డు నుంచి కేంద్రం రూ.8614.16 కోట్లు చెల్లించింది. ఆ మొత్తాన్ని మినహాయిస్తే మిగిలేది రూ.7053.74 కోట్లు! ప్రస్తుతం ప్రాజెక్టుపై రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2234.66 కోట్లను కేంద్రం రీఇంబర్స్‌ చేయాల్సి ఉంది. ఆ మొత్తాన్ని కూడా చెల్లించేస్తే... కేంద్రం నుంచి రావాల్సింది రూ.4819.474 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. దీనిపై ఏపీని ఒప్పించాలని బుధవారం పీపీఏకు లేఖ రాసినట్లు తెలిసింది.


నాడు విమర్శలు... నేడు ‘హ్యాండ్సప్‌’

‘‘పోలవరం సాగునీటి ప్రాజెక్టు సీఎం చంద్రబాబుకు ఏటీఎంగా మారింది. అందుకే.. 2013- 14లో రూ.29,027.95 కోట్లుగా ఉన్న అంచనాలను రూ.55,548.87 కోట్లుకు పెంచేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి అంచనా వ్యయాన్ని ఆకాశానికి ఎగబాకించారు. ప్రాజెక్టు అంతా అవినీతిమయం’’ అని ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక.. ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరిట కాంట్రాక్టు సంస్థను మార్చేశారు. ఇప్పుడు... కేంద్రం కాలాన్ని కూడా రివర్స్‌ చేసి, 2013-14 అంచనాలే ఫైనల్‌ అని తేల్చేసింది. నిజానికి... యూపీఏ సర్కారు పోతూ పోతూ చేసిన కొత్త భూసేకరణ చట్టంతో పోలవరం నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, పునరావాస వ్యయం భారీగా పెరిగాయి.


తెలంగాణ నుంచి కూడా ముంపు మండలాలు కలిశాయి. ఈ విషయాన్ని అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ గుర్తించకుండా... ‘అంచనాలు పెంచేశారు. అవినీతికి పాల్పడ్డారు’ అంటూ విమర్శలు గుప్పించారు. తాను అధికారంలోకి వచ్చాక భూ సేకరణ, పరిహారం, పునరావాసానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం కుదిస్తున్నా జగన్‌ సర్కారు పట్టించుకోలేదు. గత నెలలో మంత్రులు అనిల్‌, బుగ్గన, విజయ సాయిరెడ్డితో కలిసి  కేంద్ర ఆర్థిక మంత్రులు నిర్మలా సీతారామన్‌, గజేంద్ర సింగ్‌లను జగన్‌ కలిశారు. ఈ సమయంలోనూ.. భూసేకరణ,  పరిహారం, నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాల్లో కోత విధించొద్దని అభ్యర్థించలేదు. కేవలం రాష్ట్రం ఖర్చు పెట్టిన రూ.2234.288 కోట్లను త్వరితగతిన ఇవ్వాలని అర్జీలు ఇచ్చి వచ్చారు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఏకంగా 2014లో ఆనాటి ప్రధాని మన్మోహన్‌ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను బయటకు తీసింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంపై జగన్‌ సర్కారు ఏం చేస్తుందనేది కీలకంగా మారింది. ఎందుకంటే... 2013-14 అంచనా వ్యయంతో ఇప్పుడు పోలవరం నిర్మాణం పూర్తి చేయడం అసాధ్యం! మిగిలిన మొత్తాన్ని రాష్ట్రమే భరిస్తుందా? లేక... కేంద్రంతో పోరాడి నిధులను సాధిస్తుందా? వేచి చూడాల్సిందే!

Updated Date - 2020-10-22T08:21:48+05:30 IST