Abn logo
May 3 2021 @ 01:03AM

పద్యమంటే ఆత్రేయకు ప్రాణం!

ఆత్రేయ పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చేవి- ఆయన సినిమా పాటలు, అభిరుచి గల కొందరికి ఆయన నాటకాలు కూడా! కాని ఎవరికో తప్ప కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ వంటి మహామహులు మెచ్చిన పద్య కవిత్వాన్ని కూడా ఆత్రేయ రాసినట్టు తెలియదు. ఆత్రేయ రచనల్లో సినీ నాటక సాహిత్యాలు గంగా యమునల వంటివైతే- అంతర్వాహిని అయిన సరస్వతి పద్యసాహితి. 


ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. పేరులోని ఆచార్యను గోత్ర నామామైన ఆత్రేయకు కలుపుకొని ‘ఆచార్య ఆత్రేయ’ అనే కలం పేరుతో ప్రసిద్ధులయ్యారు. సొంత ఊరు నెల్లూరు జిల్లా సుళ్లూరు పేట సమీపంలోని ‘ఉచ్చూరు’ అనే వ్యవహార నామం కలిగిన వత్సపురి కాగా, జన్మించింది దానికి సమీపంలోని ‘మంగళంపాడు’లో. జన్మదినం మే 07, 1921. 


ఆత్రేయ రచనా వ్యాసంగం పద్యంతోనే ప్రారంభమయింది. ఆయన తన మొదటి పద్యాన్ని పాఠశాలలో విద్యార్థిగా వుండగానే రాశాడు- అదీ యాదృచ్ఛికంగా! ఆత్రేయ పెద మేనమామ శ్రీనివాస వరదాచార్యులు తెలుగు పండితులు. ఆ వాసన ఆత్రేయకు వుండదా అని సహాధ్యాయి అయిన చెంగలువరాయ పిళ్లె తను రాసిన పద్యాలను ఆత్రేయకు చూపి వాటి బాగోగులు చెప్పమన్నాడు. ఆత్రేయ దానిని సవాలుగా తీసుకొని తనకు పద్య విద్యను నేర్పమని మేనమామను అడిగాడు. ఆయనిచ్చిన ‘సమాసాలంకార ఛందోదర్పణా’న్ని ఆ రాత్రికి రాత్రే చదివి ఆకళింపు చేసుకొని మరనాడు పిళ్లె పద్యాల మీద తన అభిప్రాయాన్ని ఒక కందపద్యంలో రాసి చూపించాడు:

తప్పులు చాలగలవు నే

చెప్పితినని కోపపడుట చెల్లదు నీవే

చప్పున సరిదిద్దుకొనుము

పప్పులు నములుటలు కావు పద్య రచనముల్‌

- గణయతి ప్రాసల్ని యెలాగో సరిపెట్టుకొంటూ దీన్ని రాశాడు! అలాగే అచ్చయిన ఆత్రేయ మొదటి కవిత ఆయన రాయవెల్లూరులోని ‘ఊరిస్‌’ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతుండగా ‘ఢంకా’ పత్రికకు రాసి పంపిన ‘దేవుళ్లదంతా అన్యాయమే!’ అనేది. 


ఛందోబద్ధమైన పద్య కవిత్వం పట్ల ఆత్రేయ జీవితాంతం మక్కువను చూపారు. ఆయన 20వ యేట భగవద్గీతను పద్యాల్లో రాస్తే అది కాస్తా బస్‌ ప్రయాణంలో పోయిందట. అలాగే మంగళంపాడు లోని ‘శ్రీసౌందర్యవల్లీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామి’ మీద ఒక శతకం రాస్తే అది కూడా కాలగర్భంలో కలిసిపోయిందట! స్వాతంత్య్రం రాగానే ఆనందపడుతూ రాసిన ‘సుప్రభాతం’ ఆ తర్వాత అది దుర్వినియోగమవుతున్నందుకు ఆవేదనతో రచించిన ‘అరణ్య రోదనం’ పద్య కావ్యాలు కూడా అలభ్యాలే. అయినా, ఆయన గుర్తుకు తెచ్చుకుని మిత్రులకు వినిపించిన ‘అరణ్య రోదనం’లోని నాలుగైదు పద్యాలు మాత్రం మచ్చుతునకలుగా మిగిలాయి. వాటి నుంచి 

ఓ పద్యం:

మ: వినువారెవ్వరరణ్యరోదనము మా విశ్వాసముందోచి పె

త్తనముం జేతులబట్టి, కన్నులరమోతల్పడ్డ మీరపుడి

చ్చిన హామీలవి బుట్టదాఖలయెగా, చేజేతనీ శిక్ష నె

త్తిన మేమేకొని తెచ్చుకొంటి, ఇవియా దీన ప్రజారక్షణల్‌?

- దీనిలో స్వాతంత్ర్యానంతరం పాలకుల వాగ్దాన భంగాలతో హతాశులైన ప్రజల ఆర్తికి, ఆవేదనకు అద్దం పట్టారు ఆత్రేయ. 


ఆత్రేయ పద్యసాహితిలో ప్రధానమైంది- 375 పద్యాల్లో రచించిన ఆయన అసంపూర్ణ ఆత్మకథ. అందులో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిది పుట్టు పూర్వోత్తరాలు, రెండవది మాతృవియోగం, మూడవది భగ్నప్రేమ. 


ఆత్మకథ మొదటి భాగంలో తన జన్మ విశేషాలు, స్వస్థలం, జన్మస్థలం, తల్లిదండ్రులు, తోబుట్టువులు మొదలైన విషయాలను స్పష్టంగా రాశారు. కొందరు వ్యాసకర్తలు ఆ పద్యాలను శ్రద్ధగా చదవకుండా ద్వితీయ శ్రేణి ఆకరాల మీద ఆధారపడి ఆ వివరాలను అన్యధా రాయడం దురదృష్టం. ఆత్రేయకు తల్లి అంటే ప్రాణం. ఆమె గురించి ఆత్మకథలో ఒక అధ్యాయమే రాశారు. అది ‘అమ్మ’ అనే మకుటంతో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు కొంత కాలం పాఠ్యాంశంగా ఉంది. ఆత్రేయ తల్లి సీతమ్మ ఆయనకు పదేళ్ల వయసులోనే చనిపోయింది. దాయాదులు చేసిన విష ప్రయోగం వల్ల ఆమె మరణించిందని కుటుంబ సభ్యులతో సహా ఆ పసివాడు కూడా అపోహ పడ్డాడు. ఆ వయసులో ఉచ్చూరు మీద, అక్కడి మనుషుల మీద ఏవగింపు కలిగి ఊరు విడిచిన మేనమామ జగన్నాథాచార్యుల (మేజిస్ట్రేట్‌) వారి పంచన చేరి విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. ఆత్రేయ సినీ రంగంలో అడుగు పెట్టిన తర్వాత ఆణిముత్యాల్లాంటి అమ్మ పాటలు రాయడానికి బాల్యంలో మాతృవియోగ సంఘటనే కారణం. 


లభ్యమౌతున్న ఆత్మకథలో ఆఖరి అధ్యాయం తొలి గాయం. ఆయన వీణా వాదన నిపుణురాలైన ‘బాణం’ అనే ముద్దు పేరు గల యువతిని ప్రేమించగా, సగోత్రీకురాలనే వాదంతో తండ్రి ఆమెతో వివాహానికి అడ్డుపడ్డారు. తండ్రి మాటకెదురాడ లేక భగ్న ప్రేమికునిగా ఆత్రేయ జీవితాంతం పరితపించారు. ‘తొలి గాయం’ పేరుతో ఆ వృత్తాంతాన్ని చిన్న పుస్తకంగా ప్రచురించడమే గాక ప్రియురాలి జ్ఞాపకాల నేపథ్యంలో ఆత్రేయ సినిమాల్లో అద్భుతమైన ప్రేమ గీతాలను, వీణ పాటల్ని రాశారు. 


ఆత్రేయ డైరీలలో తన అనుభవాలను, జీవిత సత్యాలను, చాటువులను పద్యాల రూపంలో రచించి భద్రపరిచారు. తన జాతకాన్ని కూడా పద్యాల్లోనే రాశారు. ఆయన అమావాస్య నాడు ధనుర్లగ్నంలో భరణి నక్షత్రంలో పుట్టారట. 


పద్యం పట్ల మమకారంతోనే ఆత్రేయ ‘మనసే మందిరం’, ‘ప్రేమనగర్‌’, ‘కల్యాణ మండపం’, ‘అమరదీపం’, ‘జూదగాడు’ మొదలైన సాంఘిక చిత్రాల్లో కూడా పద్యాలను రాశారు. ఆత్రేయ పద్యాలను పరిశీలిస్తే అవి వేమన పద్యాల్లా అలతి అలతి పదాలతో సులభమైన శైలిలో ఉంటాయి. పద్యాన్ని అమితంగా ప్రేమించిన ఆత్రేయ ఆ ప్రక్రియ ప్రజలతో ప్రత్యక్ష పరిచయం ఏర్పరచుకోవడానికి అనువైనది బలమైనది కాదనే అభిప్రాయంతో తర్వాత నాటక రంగంవైపు, అది సోపానంగా సినీ రంగంవైపు మళ్లి తన ప్రస్థానాన్ని కొనసాగించారు.  


సినీ గేయాలకుండే ఆదరణను దృష్టిలో పెట్టుకొనే ఆత్రేయ శతజయంతి సందర్భంగా గాన గంధర్వులు యస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం సంకల్ప స్ఫూర్తితో, డా. కె.ఐ. వరప్రసాద్‌రెడ్డి (శాంతాబయోటెక్నిక్స్‌) సౌజన్యంతో స్నేహ ప్రచురణలు ఆత్రేయ సినీ గేయ సర్వస్వాన్ని (1636 సినీ గీతాలు) ‘ఆత్రేయ సాహితి’ పేరుతో ప్రచురించి ఆత్రేయ అభిమానులకు కానుకగా ఇస్తున్నారు. 

(మే 7 ఆత్రేయ శతజయంతి)

పైడిపాల

99891 06162

Advertisement
Advertisement
Advertisement