55వేల కోట్లు ఇప్పించండి ప్లీజ్‌!

ABN , First Publish Date - 2020-11-01T09:22:08+05:30 IST

జాతీయ ప్రాజెక్టు పోలవరం అంచనాలపై నెలకొన్న తాజా పరిస్థితి తలెత్తుకోలేనివిధంగా, ఇబ్బందికరంగా మారిందని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌

55వేల కోట్లు ఇప్పించండి ప్లీజ్‌!

ఇది తలెత్తుకోలేని ఇబ్బందికర పరిస్థితి

జోక్యం చేసుకుని సహకరించండి.. ప్రధానికి జగన్‌ లేఖ

పోలవరం జాప్యమైతే విస్తృత ప్రయోజనాలకు దెబ్బ

పునరావాసానికే రూ.28,191 కోట్లు అవసరం

20 వేల కోట్లతో ప్రాజెక్టు ఎలా పూర్తిచేయగలం?

సమాచార లోపం వల్లే ఈ సమస్య తలెత్తింది

ఆర్థిక, జల శాఖలతో సమావేశమై చక్కదిద్దండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 

రాసిన లేఖలో జగన్‌ వినతి

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన ముఖ్యమంత్రి!


్ఙఅమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జాతీయ ప్రాజెక్టు పోలవరం అంచనాలపై నెలకొన్న తాజా పరిస్థితి తలెత్తుకోలేనివిధంగా, ఇబ్బందికరంగా మారిందని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ సిఫారసు చేసిన రెండో సవరించిన అంచనాలు రూ.55,548.87 కోట్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అక్టోబరు 28వ తేదీన ప్రధాని మోదీకి జగన్‌ లేఖ రాశారు. ఈ లేఖను శనివారం ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ మీడియాకు విడుదలచేశారు. ‘‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యమైతే.. విస్తృత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. ప్రాజెక్టు అంచనాల అంశంలో మీరే చొరవ తీసుకోవాలి. కేంద్ర ఆర్థిక శాఖ, జలశక్తి శాఖ మంత్రులతో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దండి’’ అని ఆ లేఖలో సీఎం విజ్ఞప్తి చేశారు.


సమాచార లోపం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆ లేఖలో జగన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఉమ్మడి ఏపీలో పోలవరం కోసం రాష్ట్రం రూ.5135 కోట్లు వ్యయం చేసింది. సత్వర మౌలిక లబ్ధి పథకం(ఏఐబీపీ) కింద పోలవరం అంచనా వ్యయం 2010-11 నాటికి 16010.45 కోట్లుగా రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం గుర్తించింది. కేంద్రం 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి పరిహారం, సహాయ, పునరావాసాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర కేబినెట్‌ నిర్ణయం, విభజన చట్టం ప్రకారం పోలవరం వ్యయాన్ని కేంద్రమే భరించాలి. అందుకే, ఈ ప్రాజెక్టు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్పీవీ)గా పోలవరం ప్రాజెక్టు అథారిటీని 2014 మే 28న కేంద్రం ఏర్పాటు చేసింది’’ అని తెలిపారు. విభజనచట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రా జెక్టుగా ప్రకటించారు, నిర్మాణ వ్యయం.. సహాయ పునరావాసాలను చట్టం పరిధిలో భరిస్తామని చట్టంలో పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రం కేవలం కార్యనిర్వాహక బాధ్యతలు చేపడుతోంద’’న్నారు. ‘‘పోలవరం అంచనా వ్యయం 2010-11 ప్రకారం 16,010.45 కోట్లు. 2013-14లో అది రూ.28919.95 కోట్లకు చేరింది. సవరించిన అంచనా వ్యయాన్ని.. ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్సును తొలిసారి 2017 మే 8న కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించింది. అంచనాలను పంపాలని రాష్ట్రాన్ని కోరింది. సవరించిన డిజైన్లు, 2013 భూసేకరణ చట్టం ప్రకా రం ముంపు బాధిత కుటుంబాలు.. పునరావాసం వంటి అంచనాలను లెక్కగట్టి.. 2017-18 షెడ్యూల్డ్‌ స్టాండర్డ్‌ ధరల మేరకు రూ.57297.42 కోట్లుగా 2019 జనవరి 2న పంపింది. దీనిని పరిశీలించిన సాంకేతిక సలహా కమిటీ 2017-18 ధరల మేరకు వాస్తవ వ్యయం రూ. 55,548.87 కోట్లుగా నిర్ధారించింది. ఈ అంచనాలను సమీక్షించి 2020 జూన్‌ 30న రూ.47,617.74 కోట్లుగా నిర్ధారించారు. ఈ సవరణ అంచనాలకు ఇప్పటి వరకూ క్లియరెన్సు రాలేదు’’ అని తెలిపారు. 


ఇచ్చేది పునరావాసానికే చాలదు..

‘‘2014 తర్వాత పోలవరంపై రాష్ట్రం రూ.12,520.91 కోట్లను వ్య యం చేసింది. రూ.8507.26 కోట్లను కేంద్రం రీఇంబర్స్‌ చేయగా రూ.4013.65 కోట్లు రావాలి. వాటిలో రూ.2234.77 కోట్లు ఇస్తామన్నారు. అంచనా సమీక్షా కమిటీ రూ.47725.74 కోట్లుగా ఒకవైపు నిర్ధారిస్తే.. 2013-14 అంచనాల మేరకు మరోవైపు రూ.20398.61 కోట్లుగా పేర్కొనడం వాస్తవ దూరం. కేంద్రం ఇచ్చిన హామీలకు.. విభజన చట్టానికి ఇది విరుద్ధం. పునరావాసానికే రూ.28,191 కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా.. రూ.20.398.61 కోట్లతో పోలవరం ఎలా పూర్తి చేస్తాం?’’అని ప్రధాని మోదీని సీఎం జగన్‌ ప్రశ్నించారు. కాగా, పోలవరం అంచనాలపై ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు సీఎం జగన్‌ సిద్ధమవుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సీఎంవో కార్యాలయం.. ప్రధాని అపాయింట్‌మెంట్‌ను కోరిందని పేర్కొన్నాయి.

Updated Date - 2020-11-01T09:22:08+05:30 IST