రమ్యమైన అభినయం

ABN , First Publish Date - 2022-06-16T07:22:32+05:30 IST

‘‘అప్పుడు నాకు ఏడెనిమిదేళ్లు ఉంటాయి... మొట్టమొదటిసారి వెండి తెరపై కనిపించినప్పుడు

రమ్యమైన అభినయం

నాన్న ఇండస్ర్టీ మనిషే. కానీ ఆడిషన్స్‌కు వెళ్లి... అవకాశాలు తెచ్చుకుంది. సినిమాల్లో నటిస్తూనే... వెబ్‌సిరీస్‌లపైనా మనసు పారేసుకుంది. ‘మైల్స్‌ ఆఫ్‌ లవ్‌’తో తన జర్నీ ‘హుషారు’గా సాగిపోతోందంటున్న రమ్య పసుపులేటితో ‘నవ్య’ ముచ్చట్లు... 


‘‘అప్పుడు నాకు ఏడెనిమిదేళ్లు ఉంటాయి... మొట్టమొదటిసారి వెండి తెరపై కనిపించినప్పుడు! ‘పంచాక్షరి’ సినిమాలో బాల నటిగా నా కెరీర్‌ ప్రారంభమైంది. 2010లో విడుదలైన ఆ సినిమాలో అనుష్క హీరోయిన్‌. ఆ అవకాశం అనుకోకుండా వచ్చింది. మా నాన్న పసుపులేటి చంద్రశేఖర్‌ బాలీవుడ్‌లో సినిమాటోగ్రాఫర్‌. ఆయన స్నేహితుడు ఒకరు వచ్చి అడిగారు... ‘పంచాక్షరి’ కోసం. నాన్న ఓకే అన్నారు. నటిగా అప్పుడు మొదలైంది నా జర్నీ. తరువాత బాల నటిగా చాలా సినిమాలు చేశాను. 


మళ్లీ అలా... 

నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. ఒక పక్క సినిమాలు... మరో వైపు అడ్వర్‌టైజ్‌మెంట్స్‌తో చిన్నప్పుడే బిజీగా మారిపోయింది జీవితం. కొన్నాళ్లు భరతనాట్యం, సంగీతం నేర్చుకున్నా. నటనలో అయితే శిక్షణంటూ తీసుకోలేదు. చదువుతోపాటే ఇవన్నీ కొనసాగేవి. కానీ ఎప్పుడూ కష్టం అనిపించలేదు. ఎందుకంటే ఎంతో ఇష్టపడి చేస్తున్నాను కదా! కాలేజీకి వెళ్లాక కూడా నటనకు బ్రేక్‌ ఇవ్వలేదు. ‘ఇక్‌ఫై బిజినెస్‌ స్కూల్‌’లో గత ఏడాదే బీబీఏ పూర్తయింది. పీజీ చేద్దామనుకొంటున్నా. మరి కుదురుతుందో లేదో చూడాలి! నిజానికి డిగ్రీ చదువుతున్నప్పుడు నా కెరీర్‌ మళ్లీ మొదలైంది. అంటే... హీరోయిన్‌గా! ‘హుషారు’ చిత్రంతో. 2018లో విడుదలైన ఆ సినిమాకు మంచి ఆదరణ లభించింది. తరువాత ‘మైల్స్‌ ఆఫ్‌ లవ్‌’ చేశాను. ఆడియో సూపర్‌ హిట్‌ అయింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా అది. నా గురించి తెలిసి కాలేజీలో లెక్చరర్లు ఎంతో సహకరించేవారు. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా వదులుకోవద్దనేవారు. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 


నా అంతట నేనే... 

నాన్న సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే అయినా నన్ను ఏ రోజూ ఎవరికీ రికమండ్‌ చేయలేదు. నాకు వచ్చిన అవకాశాలన్నీ ఆడిషన్స్‌కు వెళ్లి, వాళ్లను మెప్పించి తెచ్చుకున్నవే. ఒక్క ‘పంచాక్షరి’ తప్ప. ఆఖరికి వెబ్‌సిరీ్‌సలకు కూడా ఆడిషన్స్‌ ఇచ్చాను. అవకాశాలనేవి మనల్ని వెతుక్కొంటూ రావాలి. అప్పుడే ఈ పరిశ్రమలో నిలబడగలుగుతాం. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నాన్న పేరు ఉపయోగించకుండా నా అంతట నేను నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్నాను. అది నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. 


    వెబ్‌సిరీ్‌సలలో అలా... 

‘మైల్స్‌ ఆఫ్‌ లవ్‌’ తరువాత ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’లో హీరోయిన్‌గా చేశాను. అదే సమయంలో నాకు ‘చదరంగం’ వెబ్‌సిరీస్‌లో ఆఫర్‌ వచ్చింది. శ్రీకాంత్‌ గారు హీరో. అందులో నాది చాలా ప్రాధాన్యమున్న పాత్ర. దానికి మంచి పేరు లభించింది. వెబ్‌సిరీస్‌లో చేయడం అదే తొలిసారి. తరువాత ‘ఆహా’లో వస్తున్న ‘బీఎ్‌ఫఎఫ్‌’ వెబ్‌సిరీస్‌. ‘బీఎ్‌ఫఎఫ్‌’... అంటే ‘బెస్ట్‌ ఫ్లాట్‌మేట్‌ ఫరెవర్‌’. జీవితం, స్నేహం, ఇంకా ఎన్నో అద్భుత కథల సమ్మేళనం ఈ కథ. మరో ప్రధాన పాత్రలో సిరి హనుమంత్‌ చేస్తోంది. ఇందులో నాది ‘తార’ రోల్‌. తను చలాకీ పిల్ల. అనాలోచితంగా పనులు చేసేస్తుంటుంది. కాస్త ఫన్నీగా ఉండే కేరెక్టర్‌. ప్రేక్షకుల స్పందన అద్భుతం. ‘హుషారు’ చిత్రంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఇప్పుడు ‘తార’ పాత్రకు కూడా! ఎంతోమంది అభినందిస్తున్నారు. ‘బీఎ్‌ఫఎఫ్‌’ సీజన్‌-2 షూటింగ్‌ కూడా త్వరలోనే మొదలవుతుంది. కొన్ని సినిమా ఆఫర్లు ఉన్నాయి కానీ... నాకు నచ్చే పాత్రలు రావడంలేదు. 


అదే నా కల... 

నటిగా నాకూ ఒక కల ఉంది. రాజమౌళి గారి దర్శకత్వంలో నటించాలని! అయితే ఏ దర్శకుడితో పని చేసే అవకాశం వచ్చినా సంతోషంగా చేస్తాను. అందరితో చేస్తేనే కదా... ‘సక్సెస్‌’ అనిపించుకోగలిగేది. అలాంటి విజయవంతమైన కెరీర్‌ కోసమే కష్టపడుతున్నా. ఇక నాకు బాగా ఇష్టమైన హీరో పవన్‌ కల్యాణ్‌ గారు. హీరోయిన్‌... సమంత. ఆమె నటన చాలా బాగుంటుంది. బాలీవుడ్‌లో అయితే రణవీర్‌సింగ్‌, అలియా భట్‌ ఇష్టం. కొందరు అడుగుతుంటారు... ‘మీ నాన్న బాలీవుడ్‌లో ఉన్నారు కదా... అక్కడ మీరు ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నారా’ అని! అలాంటివేవీ లేవు. మా నాన్న కూడా... ‘ముందు ఇక్కడ నిరూపించుకొని పేరు తెచ్చుకో. తరువాత బాలీవుడ్‌ గురించి ఆలోచిద్దాం’ అన్నారు. 


అంతా హ్యాపీ... 

లేని అవకాశాల కోసం తాపత్రయపడే కంటే వచ్చినవాటిని సద్వినియోగించుకోవడం గురించే నేను ఆలోచిస్తాను. అందుకే సినిమాలు చేస్తున్నా... వెబ్‌సిరీ్‌సల్లో కూడా నటిస్తున్నా. ఎక్కడ షూటింగ్‌కు వెళ్లినా... టెక్నికల్‌ టీమ్‌లో కానీ, నటులు కానీ... అంతా తెలిసినవాళ్లే కనిపిస్తుంటారు. అందరూ నన్ను చిన్న పిల్లలా ఆప్యాయంగా చూసుకొంటారు. దీంతో నాకు తెలిసిన మనుషుల మధ్య చేస్తున్న అనుభూతే ఉంటుంది. బహుశా అందుకేనేమో... నాకు ఏ రోజూ పరిశ్రమలో ఇబ్బందులనేవి ఎదురుకాలేదు. సంతోషంగా సాగిపోతోంది నా ప్రయాణం. అయితే ప్రతి ప్రాజెక్ట్‌ నుంచీ ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని నా డబ్బింగ్‌ నేనే చెప్పుకొంటున్నాను. మా 

సరదాగా కాసేపు...  

నాకు ఖాళీ దొరికితే స్నేహితులతో సరదాగా బయటకు వెళతాను. లేదంటే మంచి మ్యూజిక్‌ పెట్టుకుని... డ్యాన్స్‌ చేస్తాను. మా పెట్‌తో ఆడుకొంటాను. ఇంట్లో నేనొక్కదాన్నే. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఎవరూ లేరు. ఏకైక సంతానం అన్నమాట! ఇంట్లో సినిమా వాతావరణం అలవాటే కనుక... నటిగా స్థిరపడతానంటే ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. నాకు బలం, ప్రోత్సాహం నా కుటుంబమే. నాలో నాకు బాగా నచ్చింది... నా చిరునవ్వు. బయట కూడా చాలామంది... ‘మీ నవ్వు బాగుంటుంద’ని అంటుంటారు. అయితే నన్ను ఒక ప్రాజెక్ట్‌కు తీసుకున్నారంటే అందుకు మొదటి కారణం... నా నటన... తరువాత నా గ్లామర్‌ అనుకొంటున్నా. అన్నింటి కంటే ముఖ్యంగా వాళ్లనుకున్న పాత్రకు నేను సరిపోతేనే కదా... తీసుకొనేది!  


నాకు బాగా ఇష్టమైన హీరో పవన్‌ కల్యాణ్‌ గారు. హీరోయిన్‌... సమంత. ఆమె నటన చాలా బాగుంటుంది. బాలీవుడ్‌లో అయితే రణవీర్‌సింగ్‌,అలియా భట్‌ ఇష్టం.ఎక్కడ షూటింగ్‌కు వెళ్లినా... టెక్నికల్‌ టీమ్‌లో కానీ, నటులు కానీ... అంతాతెలిసినవాళ్లేకనిపిస్తుంటారు. అందరూ నన్ను చిన్న పిల్లలా ఆప్యాయంగా చూసుకొంటారు. 

Updated Date - 2022-06-16T07:22:32+05:30 IST