‘ఇండస్ర్టీ 4.0’పై మీనమేషాలు!

ABN , First Publish Date - 2021-01-25T08:44:17+05:30 IST

విశాఖపట్నం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు ‘నోటితో పొగుడుతూ... నొసటితో వెక్కిరించినట్టు’గా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.

‘ఇండస్ర్టీ 4.0’పై మీనమేషాలు!

  • విశాఖ స్టీల్‌ప్లాంటులో ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌.. 
  • మొత్తం అంచనా వ్యయం రూ.30 కోట్లు
  • అందులో ప్లాంటు వాటా రూ.9 కోట్లు
  • 11 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సుముఖం 
  • కోటి ఇచ్చేందుకు రాష్ట్రం తర్జనభర్జన 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు ‘నోటితో పొగుడుతూ... నొసటితో వెక్కిరించినట్టు’గా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఐటీ రాజధాని విశాఖే అంటూ ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం కేవలం రూ.కోటి ఖర్చు చేస్తే రూ.30కోట్ల ‘‘ఇండస్ట్రీ 4.0 ఎక్సలెన్స్‌ సెంటర్‌’’ ప్రాజెక్టు వస్తుందని తెలిసినా తర్జనభర్జన పడుతోంది. ఐటీ రంగంలో ఐఓటీ, మెషిన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక మార్పులను అందిపుచ్చుకొని అభివృద్ధి చేయడానికి కొత్తగా ‘సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌’ పేరుతో కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. నాస్కామ్‌తో కలిసి రుషికొండ ఐటీ సెజ్‌లోని ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ (స్టార్టప్‌ విలేజ్‌) ఇంతకుముందు ‘ఐఓటీ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌’ను ఏర్పాటుచేసింది. ఇది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. విశాఖ కేంద్రంగా గేమింగ్‌, యానిమేషన్‌ రంగంలో మరో ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సటీపీఐ) కేంద్ర స్థాయిలో ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు తాజాగా అదే ఎస్‌టీపీఐ... విశాఖ స్టీల్‌ప్లాంటుతో కలిసి ‘ఇండస్ర్టీ 4.0’ పేరుతో ఒక ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేసి విజయవంతమైంది.


పారిశ్రామిక రంగంలో ఐటీని ఉపయోగించి స్మార్ట్‌ ఉత్పత్తులు తయారు చేయాలనేది దీని లక్ష్యం. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఐఓటీ (ఇండివీడ్యువల్‌), మెషిన్‌ లెర్నింగ్‌ వంటి 8 రకాల టెక్నాలజీలతో దీనిని ఏర్పాటుచేయడానికి ప్రణాళిక రూపొందించారు. దీనికి రూ.30 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేయగా, స్టీల్‌ప్లాంటు తన వాటాగా రూ.9 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ సెంటర్‌ కోసం స్టీల్‌ప్లాంటులోనే 6వేల చ.అ. విస్తీర్ణంలో 50 మంది కూర్చొని పనిచేసుకునేలా ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యంతో భవనాన్ని కూడా సమకూర్చింది. దీనికి అవసరమైన మెంటార్‌షిప్‌ అందివ్వడానికి గ్లోబల్‌ గుర్తింపు కలిగిన డానియల్‌, సీమెన్స్‌, ఎస్‌ఎంఎస్‌ బహుళజాతి కంపెనీలు అంగీకరించాయి. 


ముందుగానే అంతా సిద్ధం

సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాక అన్నీ సమకూర్చుకుంటారు. కానీ, ఇక్కడ సెంటర్‌ ప్రారంభించక ముందే ఫండింగ్‌, సదుపాయాలు, సాంకేతిక సహకరం అన్నీ సిద్ధమైపోయాయి. ఇంకా విశేషమేమిటంటే... ఈ సెంటర్‌ ద్వారా తమకు కొన్ని సొల్యూషన్స్‌ కావాలంటూ స్టీల్‌ప్లాంటు, ఎన్‌టీపీసీ సంస్థలు 40 అంశాలను ఎస్‌టీపీఐ ముందుంచాయి. ఈ సెంటర్‌కు బిజినెస్‌ ప్లాన్‌ కూడా సిద్ధం చేసేశారు. ప్రపంచంలోని టాప్‌ 5 ఐటీ కంపెనీల్లో ఒకటైన డబ్ల్యూఎన్‌ఎస్‌ సీఈఓ, నాస్కామ్‌ పూర్వ చైర్మన్‌ కేశవ్‌ మురుగేశ్‌ దీనికి చీఫ్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సెంటర్‌కు కేంద్ర ఎలక్ర్టానిక్స్‌ మంత్రిత్వ శాఖ రూ.11 కోట్లు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. 


రూ.కోటి ఇస్తే చాలు

ఈ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఎంతో కొంత సమకూరిస్తే సెంటర్‌ మంజూరవుతుంది. ఇందుకోసం కోటి రూపాయలు మంజూరు చేయాలని ఎస్‌టీపీఐ కోరింది. మిగిలిన మొత్తం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ బడ్జెట్‌ సమావేశంలోగా రాష్ట్రం ఆమోదం తెలిపితే ఈ కేంద్రానికి వెంటనే నిధులు వచ్చే అవకాశం ఉందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. 


విశాఖకు చాలా అవసరం

రాష్ట్రంలో పారిశ్రామిక రాజధానిగా విశాఖపట్నం వర్ధిల్లుతోంది. ఇక్కడ డిఫెన్స్‌తో పాటు హెచ్‌పీసీఎల్‌, కోరమాండల్‌, స్టీల్‌ప్లాంట్‌, ఎన్‌టీపీసీ, షిప్‌యార్డు, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటికి అవసరమైన ఐటీ సొల్యూషన్స్‌ను ‘ఇండస్ట్రీ 4.0’ ఎక్స్‌లెన్స్‌ ద్వారా అందించవచ్చు. విశాఖ లాంటి నగరానికి ఇది చాలా అవసరం. 

- శ్రీధర్‌ కొసరాజు, చైర్మన్‌, ఐటాప్‌, ఏపీ

Updated Date - 2021-01-25T08:44:17+05:30 IST