‘తిరుమల అగరుబత్తీ’లపై పిల్: హైకోర్టు నో
ABN , First Publish Date - 2021-09-17T08:37:49+05:30 IST
టీటీడీ, దాని అనుబంధ ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాల నుంచి తొలగించిన పూలతో అగరుబత్తీలు తయారు చేయాలన్న టీటీడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో ..
మత విశ్వాసాలను దెబ్బతీయడమే: పిటిషనర్
టీటీడీ నిర్ణయం సరైనదే: టీటీడీ తరఫు న్యాయవాది
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): టీటీడీ, దాని అనుబంధ ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాల నుంచి తొలగించిన పూలతో అగరుబత్తీలు తయారు చేయాలన్న టీటీడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. టీటీడీ నిర్ణయం ఆగమశాస్త్రానికి విరుద్ధమని, ఇది మత విశ్వాసాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. పూల పునర్వినియోగం పాపంతో సమానమని పేర్కొన్నారు. టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది స్పందిస్తూ... దేవతామూర్తులపై వేసిన పూలను కాళ్లతో తొక్కుతున్నారని దానితో పోలిస్తే.. అగరుబత్తీల తయారీయే ఉత్తమమని పేర్కొన్నారు. అయితే, తిరుమలలో శ్రీవారికి సేవకు వినియోగించిన పూలను మాత్రం అగరుబత్తీల తయారీకి ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు. కోర్టును ఆశ్రయించే ముందు పిటిషనర్ అధికారులకు ఎలాంటి వినతిపత్రం కూడా ఇవ్వలేదన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ అంశంపై పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలిపింది. రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. పిటిషనర్ సంబంధిత అధికారులకు అభ్యంతరాలను తెలియజేస్తూ వినతిపత్రం ఇవ్వొచ్చని పేర్కొంటూ.. పిల్‌పై విచారణను మూసివేసింది.