Abn logo
Oct 29 2020 @ 00:39AM

కశ్మీర్‌కు అద్దంపట్టే ఆమె ఫొటోలు

Kaakateeya

మజ్రత్‌ జహ్రా... 26 సంవత్సరాల కశ్మీరీ యువతి. ఫొటో జర్నలిజానికి ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంజా నైడ్రింగ్‌హాస్‌ కరేజ్‌ అవార్డు గ్రహీత. కానీ ప్రభుత్వం ఆమెపై కేసు పెట్టింది!  కశ్మీర్‌లోని పరిస్థితులను ప్రపంచం ముందు యథాతథంగా ఉంచడమే నేను చేసిన తప్పా అని ఆమె ప్రశ్నిస్తోంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...


‘‘పోయిన ఏడాది కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌ స్వతంత్య్ర ప్రతిపత్తిని రద్దు చేసింది. ఇది తెలిసిన వెంటనే నా స్కూటీ ఎక్కి  శ్రీనగర్‌ శౌరాలోని అంచార్‌ ప్రాంతానికి  బయలుదేరా. ఆ ప్రాంతంతో కమ్యూనికేషన్లన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఆ ప్రాంతమంతటా కర్ఫ్యూ విధించారు.

 

 శౌరా ప్రాంతం తరచూ నిరసన ప్రదర్శనలకు నిలయం. సైనిక వ్యతిరేక గళాలు నిత్యం అక్కడ వెల్లువెత్తుతుంటాయి. నేను అక్కడికి చేరే సమయానికి శుక్రవారం ప్రార్థనలు అప్పుడే ముగిశాయి. ప్రార్థనలు అలా ముగిశాయో లేదో  ప్రజా వ్యతిరేక ప్రదర్శనలు ఆ ప్రాంతాన్ని మిన్నుముట్టాయి. గట్టిగా నినాదాలు చేస్తూ జనాలు ప్రధాన రహదారి వైపు దూసుకువెళ్లారు. వారికి  ఎదురు నుంచి సైన్యం తుపాకులతో వచ్చింది. ప్రజలపై టియర్‌గ్యాస్‌ షెల్స్‌, పెల్లెట్స్‌ వర్షం కురిపించింది. ఆ ప్రదేశమంతా పొగతో నిండిపోయింది. నాకు కూడా కొన్ని ప్లాస్టిక్‌ బుల్లెట్లు వచ్చి తగిలాయి  కానీ అదృష్టవశాత్తు చర్మంలోకి దూసుకుపోలేదు. ఒక చెట్టు చాటున నిలబడి నేను నా డిఎ్‌సఎల్‌ఆర్‌  కెమెరాతో ఫోటోలు తీయడం మొదలెట్టా. హఠాత్తుగా టియర్‌గ్యాస్‌ షెల్స్‌ పొగల్లోంచి ఒక మహిళ పరిగెడుతూ కనిపించింది. ఆమె ముఖం పూర్తిగా కవర్‌ చేసి ఉంది. ఆమె కశ్మీరీ భాషలో ‘అందరూ వచ్చేయండి. సైనికదళాలు వచ్చాయి. మనల్ని మనం రక్షించుకోవాలి’ అంటూ   అరుస్తూ హెచ్చరికలు చేస్తూ కనిపించింది. ఆ దృశ్యం నన్ను వివశురాలిని చేసింది. ఆ విజువల్‌ను వెంటనే నా కెమెరాను క్లిక్‌ మనిపించా. ఆమె కళ్లల్లోని ధైర్యం నాకెంతో అద్భుతంగా తోచింది. ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయి చర్య నన్ను నిశ్చేష్టురాలిని చేసింది. ఆ దృశ్యం ఎన్నటికీ నేను మరిచిపోలేను.


 ఒక ఫొటోగ్రాఫర్‌గా నాకు ఇది ఒక ముఖ్యమైన విజువల్‌. కశ్మీర్‌లోని ఈ సంఘర్షణా ప్రాంతం నుంచి రిపోర్టు చేస్తున్న ఏకైక మహిళా ఫొటో జర్నలిస్టును నేనే. నేను చేస్తున్న ఈ పని ద్వారా మరెందరో మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనే నా కోరిక. కశ్మీర్‌ సంఘర్షణలో తల్లడిల్లిపోతున్న తల్లులుగానే కాకుండా ఆడవాళ్లల్లో దాగున్న ధైర్యసాహసాలను కూడా నా ఫొటోలో ఆవిష్కరించగలగడం నాకెంతో ఆనందంగా ఉంది. పురుషులకు తామేమీ తీసిపోమని కశ్మీరీ మహిళలు గుండెల నిండా సాహసంతో ముందుకు అడుగులు వేయడం నా కెమెరా కన్ను పట్టుకుంది. ఆ క్షణాలు నాకు అద్భుతమైనవి.  నేను తీసిన ఈ ఫొటోలు కేవలం రెండు నెలల సమయంలోనే అత్యంత సాహసమైన ఫొటో జర్నలిజానికి ఇచ్చే అంజా నైడ్రింగ్‌హాస్‌ అవార్డు వచ్చేట్టు చేశాయి. ఈ అవార్డును ఇంటర్నేషనల్‌ విమెన్స్‌ మీడియా ఫౌండేషన్‌ ప్రదానం చేసింది. కానీ నా పని ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించ్చింది.  జాతివ్యతిరేక పోస్టులను  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశానన్న ఆరోపణలతో  సైబర్‌ పోలీస్‌ ‘అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ (ప్రివెన్షన్‌) యాక్ట్‌ (యుఎపిఎ)కేసును నా మీద దాఖలుచేసింది. విచిత్రమేమిటంటే అందులో నన్ను జర్నలిస్టుగా కాకుండా ‘ఫేస్‌బుక్‌ యూజర్‌’ అని  పేర్కొన్నారు! 


 ఈ కష్టకాలంలో మా అమ్మ నుంచి నాకు అనూహ్యమైన మద్దతు లభించింది.  తొలుత ఈ వృత్తి చేపడతానంటే అమ్మ వద్దుగాక వద్దు అంది. కానీ తర్వాత నా వెన్నుదన్నుగా నిలిచింది. నన్నెంతో ప్రోత్సహించింది. లేకపోతే నేనెలా ఉండేదాన్నో నాకు తెలియదు. ఇప్పటి వరకూ నేను తీసిన ఫొటోలు వాషింగ్టన్‌పోస్ట్‌, టిఆర్‌టి వరల్డ్‌, ఆల్‌ జజీరా, ది న్యూ హ్యుమానిటేరియన్‌, ఇంకా మరెన్నో మీడియాల్లో వచ్చాయి. నా నేపథ్యం కూడా ఫొటోగ్రఫీ వైపు  మళ్లడానికి ఒక కారణమేమో. 


 ఇక్కడ కొన్ని సంఘటనలను మీతో పంచుకోవాలి. ఈద్‌ పండుగ రోజు అందరూ చుట్టాలు, స్నేహితుల మధ్యన గడుపుతుంటే నేను మాత్రం కశ్మీర్‌ లోయలో గొడవలు జరుగుతున్న చోట నా కెమెరా పట్టుకుని తిరుగుతుండేదాన్ని. ఒకసారి అలా ఫోటోలు తీస్తున్నప్పుడే ఒక పెల్లెట్‌ వచ్చి నా నుదురుకు తగిలి బలమైన గాయమైంది. ఏం జరిగినా ఫొటోలు తీయడం మాత్రం ఆపను.  ఇపుడు జరుగుతున్న సంఘర్షణల సమయంలో  అసలు ఆపే ప్రసక్తి లేదు. నా కెమెరాను క్లిక్‌ మనిపిస్తూనే ఉంటా. ఆగస్టు ఐదు వరకూ ప్రభుత్వం హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ యాక్సె్‌సను లోయలో అనుమతించని విషయం అందరికీ తెలిసిందే. అలాగే కరోనా సమయంలో కొత్త సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే కశ్మీర్‌లాంటి ప్రాంతాల్లో సామాజిక దూరాన్ని పాటించడం కలలో మాట. మే 20న మిలటెంట్లకు, భద్రతాదళాలకు జరిగిన తుపాకుల పోరులో కనీసం 15 ఇళ్లు నాశనమయ్యాయి.


ప్రతి ఒక్కరూ కరోనా విపత్తు సమయంలో ‘స్టే హోమ్‌, స్టే సేఫ్‌’ అంటున్నారు. కానీ ఇళ్లనే తగలపెడితే ప్రజలు ఎక్కడ బతుకుతారు? వారి జీవితాల మాటేమిటి? ఈ విపత్తు సమయంలో కూడా లోయలోని ఘర్షణాత్మక ప్రాంతాలలో ఫొటోలను తీస్తూనే ఉన్నా. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీడియా ఫెసిలిటేషన్‌ సెంటర్‌ నుంచి ఫొటోలను పంపుతున్నాను. మీడియా వారి సౌలభ్యం కోసం కొన్ని గంటలు ఇంటర్నెట్‌ సౌకరాన్ని ప్రభుత్వం అక్కడ ఏర్పాటుచేసింది. పైగా అక్కడ ఉన్న సిస్టమ్స్‌ కూడా చాలా తక్కువ. వాటిని ఉపయోగించే జర్నలిస్టులం మాత్రం ఎక్కువ. అన్యాయానికి, అణచివేతకు గురవుతున్న వారిని, విషాదానికి లోనైన ఎందరో కశ్మీరీల కథలను చూపిస్తున్న నన్ను రాజ్యం  నోరు మూయించాలని చూస్తోంది. కానీ ఎవరూ నన్ను ఆపలేరు.....నా కెమెరా మెరుపులు మెరిపిస్తూనే ఉంటుంది. కశ్మీరీ బతుకు వెతలను ఆవిష్కరిస్తూనే ఉంటుంది.      ఫ


నన్ను ముఖిబీర్‌ (ఇన్ఫార్మర్‌) అన్నా, రాజ్యం నన్ను భయభ్రాంతులకు గురిచేసినా,   వివక్ష చూపినా.... నేను కశ్మీర్‌లోయలో జరుగుతున్న వార్తలను ప్రపంచానికి తెలియజేయడం ఆపను. ఎవరికీ భయపడను. 

Advertisement
Advertisement