విదేశీ పర్యాటకులకు Philippines శుభవార్త.. భారతీయులకు మాత్రం నో ఛాన్స్..!

ABN , First Publish Date - 2022-01-29T16:56:40+05:30 IST

విదేశీ పర్యాటకులకు ఫిలిప్పీన్స్ శుభవార్త చెప్పింది.

విదేశీ పర్యాటకులకు Philippines శుభవార్త.. భారతీయులకు మాత్రం నో ఛాన్స్..!

మనీలా: విదేశీ పర్యాటకులకు ఫిలిప్పీన్స్ శుభవార్త చెప్పింది. వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్న 157 దేశాలకు చెందిన పర్యాటకులు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి తమ దేశానికి రావొచ్చని ప్రకటించింది. అయితే, దీనికి ఒక షరతు పెట్టింది. ఆయా దేశాలకు చెందిన పర్యాటకులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. ఈ మేరకు శుక్రవారం ఆ దేశ పర్యాటకశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కాగా, 157 దేశాల జాబితాలో భారత్‌కు చోటు లేదు. కనుక భారతీయ పర్యాటకులకు ఆ దేశానికి వెళ్లాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. భారత్‌తో పాటు చైనా, తైవాన్‌ కూడా లిస్ట్‌లో లేవు. 


ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత రెండేళ్లుగా ఫిలిప్పీన్స్ దేశ సరిహద్దులను పూర్తిగా మూసి ఉంచిన విషయం తెలిసిందే. బీచులు, డైవ్ స్పాట్స్‌తో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ఫిలిప్పీన్స్.. రెండేళ్లుగా విదేశీ పర్యాటకుల రాకపై నిషేధం కొనసాగుతుండడంతో వెలవెలబోయింది. ఇది చాలదంటూ గతేడాది డిసెంబర్‌లో ఆ దేశంలోకి విరుచుకుపడిన సూపర్ టైఫూన్.. ప్రముఖ పర్యాటక ప్రదేశాలలోని రిసార్ట్‌లు, రెస్టారెంట్లు, బార్‌లను పూర్తిగా తుడిచిపెట్టేసింది. అవి ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్నాయి. ఇలా దెబ్బ మీద దెబ్బతో ఆ దేశ పర్యాటక రంగం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. తాజాగా ప్రకటనతో ఆ దేశ పర్యాటక రంగానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి కార్లో నోగ్రేల్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-29T16:56:40+05:30 IST