నచ్చినోడికే పీహెచ్‌డీ సీటు

ABN , First Publish Date - 2020-02-21T07:41:21+05:30 IST

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూల్లో విద్యార్థులకు చివరగా చెబుతున్న సమాధానం... ‘

నచ్చినోడికే పీహెచ్‌డీ సీటు

హెచ్‌సీయూ ఇంటర్వ్యూలో వింతలు.. 

రాత పరీక్షలో విద్యార్థులకు మంచి మార్కులు

కానీ ఇంటర్వ్యూలో ఒక్క మార్కు వేయని వైనం

మెరుగైన ప్రజెంటేషన్‌, రిజర్వేషన్‌ ఉన్నా సీటు లేదు

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో నచ్చిన వారికే సీట్లు


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూల్లో విద్యార్థులకు చివరగా చెబుతున్న సమాధానం... ‘‘సారీ.. నాట్‌ సాటిస్ఫాక్టరీ’’ అని! ఇంటర్వ్యూలో కనీసం ఒక్క మార్కైనా వేయాలని, సున్నా వేయకూడదని నిబంధనలు చెబుతున్నాయి. దానికి భిన్నంగా మార్కులేమీ వేయకుండా ‘నాట్‌ శాటిస్ఫాక్టరీ’ (సంతృప్తికర స్థాయిలో లేరు) అని రాసేస్తున్నారు. నచ్చిన విద్యార్థులకే సీట్లు కేటాయిస్తున్నారు. ఎంఫిల్‌, గేట్‌, రాత పరీక్షలో మెరుగైన మార్కులు, ఇంటర్వ్యూలో ప్రతిభాపాటవాలు చూపిన విద్యార్థులకు కూడా సీట్లు రావడం లేదు. రిజర్వేషన్‌ ఉన్నా సీటు కేటాయించేందుకు డిపార్ట్‌మెంట్‌ అధికారులకు మనసొప్పడం లేదు. నాలుగు సీట్ల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్‌ వెలువడింది. ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి ఒక్కో సీటు కేటాయించారు. దాదాపు 60 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష (70 మార్కులకు), తర్వాత ఇంటర్వ్యూ (30 మార్కులకు) నిర్వహించారు. ఇంటర్వ్యూలో ప్రతిపాదనల ప్రజెంటేషన్‌కు 10, ఎంఫిల్‌, గేట్‌ ఉంటే 5, ప్రశ్నలకు చెప్పే జవాబులకు 15 మార్కులు ఉంటాయి. 


ఒక మార్కు ఎక్కువ వచ్చేలా

జమ్ము కశ్మీర్‌కు చెందిన ముస్తాక్‌ అనే విద్యార్థికి రాత పరీక్షలో 36 మార్కులు వచ్చాయి. కానీ ఇంటర్వ్యూలో ఒక్క మార్కయినా వేయలేదు. ‘నాట్‌ శాటిస్ఫాక్టరీ’ అని రాసేశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలోని ఆ సీటును వేరే విద్యార్థికి కేటాయించారు. అతనికి రాత పరీక్షలో మార్కులు 15 రాగా ఇంటర్వ్యూలో 22 మార్కులు వేశారు. కశ్మీర్‌ విద్యార్థికి రాత పరీక్షలో వచ్చిన మార్కుల (36) కంటే రెండో విద్యార్థికి ఒక మార్కు అధికంగా వచ్చేలా ఇంటర్వ్యూలో 22 మార్కులు వేసి సీటు ఖరారు చేశారు. విద్యార్థికి రాత పరీక్షల్లో వచ్చిన మార్కులు ఇంటర్వ్యూ నిర్వహించే విభాగానికి తెలియకుండా ఉండాలి. కానీ తెలుస్తున్నాయి. ఎంఫిల్‌ చేసిన మరో విద్యార్థికి రాత పరీక్షలో 23 మార్కులు వచ్చాయి. ఇంటర్వ్యూలో ‘నాట్‌ శాటిస్ఫాక్టరీ’ అని రాశారు. ఇంటర్వ్యూకు హాజరైన సుమారు 25 మంది విద్యార్థుల్లో అత్యధికులకు ఇలాగే రాశారు.  మెరుగైన మార్కులు సాధించిన వారికి కాకుండా తమకు నచ్చిన విద్యార్థులకు సీట్లు పంచారని హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ప్రధాన కార్యదర్శి గోపిస్వామి ఆరోపించారు. 


రూ.2 లక్షలు లంచం అడిగిన ఓయూ ప్రొఫెసర్‌ వనితాదా్‌సపై కేసు

ఉస్మానియా యూనివర్సిటీ): పీహెచ్‌డీ కోసం లంచం ఇవ్వనందుకు ఓయూ జువాలజీ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ వనితాదాస్‌, ఆమె విద్యార్థి గిరిప్రసాద్‌ తనను మానసికంగా వేధిస్తున్నారని పరిశోధక విద్యార్థి ధాత్రిక స్వప్న ఫిర్యాదు చేశారు. దీనిపై వర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.2 లక్షలు ఇస్తేనే వైవాకు అనుమతి ఇస్తానని గిరిప్రసాద్‌ ద్వారా వనితాదాస్‌ చెప్పించారని స్వప్న ఫిర్యాదులో పేర్కొన్నారు. అంత సొమ్ము ఇవ్వలేనని చెప్పినా వైవా నిర్వహించకుండా వేధిస్తున్నారని పేర్కొంది. 

Updated Date - 2020-02-21T07:41:21+05:30 IST