జీపీఎస్‌పై దీక్షకు అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2022-05-15T08:39:19+05:30 IST

జీపీఎస్‌పై దీక్షకు అనుమతి నిరాకరణ

జీపీఎస్‌పై దీక్షకు అనుమతి నిరాకరణ

ఉద్యోగులు విజయవాడ రాకుండా అడ్డుకునే యత్నాలు

ముందస్తు అరెస్టులకూ రంగం సిద్ధం

శాంతియుత దీక్షకు అనుమతి ఇవ్వరా?

ఉద్యమాలపై నిర్బంధం తగదు

త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం: ఏపీసీపీఎ్‌సఈఏ


విజయవాడ, మే 14(ఆంధ్రజ్యోతి): సీపీఎ్‌సకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న జీపీఎ్‌సకు నిరసనగా ఆదివారం విజయవాడలో ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం తలపెట్టిన నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వారం రోజుల కిందట అనుమతి కోరితే చివరి నిమషంలో అనుమతి ఇవ్వకపోవడం  బాధాకరమని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం మీడియా ఇన్‌చార్జి గంటా వీర్రాజు అన్నారు. వంద మందితో, శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించామని, అయినా ఎందుకు అనుమతి ఇవ్వడంలేదో అర్థం కావటం లేదన్నారు. సమస్యలపై ఉద్యమిస్తుంటే నిర్బంధాలు విధించడం దారుణమన్నారు. 


కాగా,  ఆదివారం ధర్నాచౌక్‌కు సీపీఎస్‌ ఉద్యోగులను రానివ్వకుండా చేసేందుకు ముందస్తు అరెస్టులు చేయటానికి పోలీసులు సిద్ధం అయ్యారు. ఉద్యోగులు తరలిరాకుండా జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం వరకు నిలిపివేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే అనుమతులు ఇవ్వనందున తాము ఆందోళన చేయబోమని గంటా వీర్రాజు తెలిపారు. పోలీసుల అనుమతుల నిరాకరణ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

Updated Date - 2022-05-15T08:39:19+05:30 IST