అరుదైన సంగీత వాద్యాల ప్రదర్శన

ABN , First Publish Date - 2020-02-25T07:26:04+05:30 IST

భారతీయ సంగీత వాద్య ప్రపంచం సముద్రమంత లోతైనదీ విశాలమైనదీ. ఏ అల ఎక్కడ మొదలై ఏ తీరాన్ని తాకుతుందో చెప్పలేం.

అరుదైన సంగీత వాద్యాల ప్రదర్శన

భారతీయ సంగీత వాద్య ప్రపంచం సముద్రమంత లోతైనదీ విశాలమైనదీ. ఏ అల ఎక్కడ మొదలై ఏ తీరాన్ని తాకుతుందో చెప్పలేం. ఆఫ్రికాలో ఖండం మారుమూల అడవుల్లో మోగే డ్రమ్ (djembe) ఆదిలాబాద్ గోండు గిరిజన గూడెంలో ప్రతిధ్వనిస్తుంది. నేటీవ్ అమెరికన్ల ఫ్లూట్ గమకాలు ఖమ్మం జిల్లా భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతానికి చెందిన నాయకపోడ్‌ల పిల్లంగోయిలో జాలువారతాయి. జానపద కళాకారుల రుంజ వాద్యం తెలుగునేలపై నిరాదరణకి గురికావొచ్చు కానీ అదే తమిళనాడు కేరళ తుళు ప్రాంతాల ఆలయాల్లో చెందామేళంలో మంగళవాద్యమై పూజలందుకుంటుంది. ఎక్కడో పురాణాల్లో వినిపించే హిమాలయాల్లోని కిన్నరుల వాద్యం (కిన్నెర) మన చెంచు పెంటల్లోనో పాలమూరు నల్లగొండ పరిసరాల్లోనో డక్కలి కళాకారుల చేతిలో ప్రత్యక్షమై జానపద వీరుల కథల్ని తీగలపై పలుకుతుంది. ఈశాన్య భారతంలోని నాగాల డోలు కొండరెడ్ల ముంగిట్లో కొత్తధ్వనితో మారుమోగుతుంది. వీటన్నిటిలో యెంత సారూప్యం వుంటుందో అంత వైవిధ్యం గోచరిస్తుంది.


ఈ వైవిధ్యం యిప్పుడు అంతరించిపోతోంది. పాశాత్య సంగీతపు హోరు, సినిమా వాద్యాల జోరులో ఆదిమ సంగీత వాద్య ధ్వనులు వినిపించవు. జాతీయ సాంస్కృతిక వాదం సైతం బహుళత్వాన్ని అంగీకరించదు. అసంఖ్యాకమైన జానపద గిరిజన వాద్యాలు అనామకంగా మిగిలిపోతాయి. వాస్తవానికి శిష్ట సంగీత వాద్యాలన్నిటికీ మూలాలు ఆదివాసీ ఆవాసాల్లోనే వున్నాయి. డప్పు, డోలు, ఒగ్గు, శారద, పిల్లనగ్రోవి, తప్పెట్లు, తాళాలు, డక్కీలు లాంటి కొన్ని జానపద వాద్యాల గురించే చాలామందికి తెలుసు. కిన్నెర, కడ్డీతంత్రి, రుంజ, జమిడిక, కొమ్ము బూర, తుడుం వంటి అరుదైన వాద్యాలు కూడా కొందరం చూసి ఉంటాం. కానీ దుబ్బు, బుర్రవీణ, చామల్లాలి, అక్కుం, తూతుకొమ్ము, గుజ్జిడి మొగ్గ, కింక్రీ, గండ్జ, రబాబ్, నపీరా, పెప్రె, కాలికోం, ఔజం... వంటి వాద్యాలు ఎన్నడూ వినీ చూసీ యెరుగం.


తంత్రీ వాద్యాలు ఘన వాద్యాలు చర్మవాద్యాలు ఊదే (సుషిర )వాద్యాలు యేవైనా మట్టి చెక్క లోహం చర్మం... దేనితో చేసినా కుమ్మరి కమ్మరి వడ్రంగి మాదిగ... వంటి శ్రామిక కులాల చేతిలోనే అవి రూపొంది సుస్వనాలు పలుకుతాయి. ఆ విధంగా సంగీత వాద్యాలకు సామాజిక చరిత్ర వుంటుంది. సాంస్కృతిక వారసత్వం వుంటుంది. 


ఈ వారసత్వ సంపదని పరిరక్షించే మహత్తర లక్ష్యంతో సంగీత వాద్యాల సేకరణకు పూనుకున్న జానపద గిరిజన విజ్ఞానవేత్త జయధీర్ తిరుమలరావు. తన నలభై యేళ్ళ క్షేత్రపర్యటనలో సేకరించిన 56 సంగీత వాద్యాలతో జానపద గిరిజన సంగీత మహా సమ్మేళనం ‘మూలధ్వని’ వినిపించారు. 2019 మార్చి 17, 18 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో 200 మందికి పైగా దళిత బహుజన ఆదివాసీ కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అప్పుడే అదృశ్యమయ్యే సంగీత వాద్యాలను పరిరక్షించుకోడానికి వొక ప్రదర్శనశాలను యేర్పాటుచేయాలనే తీర్మానం జరిగింది. ఫలితంగా నవంబర్ 9 నుంచి 13 వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘ఆదిధ్వని’ పేరుతో 120 సంగీత వాద్యాలతో అపూర్వమైన ప్రదర్శన జరిగింది. కనీ వినీ ఎరుగని వైవిధ్య భరితమైన సంగీత వాద్య పరికరాల్ని చూసి ఈ సారి సినిమా రంగం విస్తుపోయింది. సోషల్ మీడియా ముక్కుమీద వేలేసుకుంది. కారణాలు ఏవైనా మన సాంస్కృతిక మూలాల్ని పరిరక్షించుకోవాలన్న తపన చాలామందిలో మొదలైంది. దరిమిలా తిరుమలరావు సంచార సంగీత వాద్య ప్రదర్శనశాలగా మారారు. అందులో భాగంగా ఈ నెల 25 నుంచి 28 వరకు గుంటూరు అన్నమయ్య కళా వేదిక లో ‘ఆది ధ్వని’ ప్రదర్శన జరుగుతోంది. ఆది నుంచీ ఆదిధ్వనికి తన గొంతుని అందిస్తోన్న పాలమూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గూడూరు మనోజ కన్వీనర్‌గా, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, వల్లూరు తాండవకృష్ణ, నన్నపనేని అయ్యన రావుల సహకారంతో సౌజన్యంతో ఏర్పాటయ్యే ఈ ప్రదర్శనలో తెలుగునేల నాలుగు చెరగులనుంచీ, దండకారణ్యం లోతట్టు ఆదివాసీ గూడేలనుంచీ సేకరించిన దాదాపు 240 సంగీతవాద్యాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచ నున్నాయి. ఏపీలో ఇది తొలి ప్రదర్శన.


ఎ .కె. ప్రభాకర్ 

(నేటి నుంచి 28 వరకు గుంటూరు అన్నమయ్య కళావేదికలో ‘ఆది ధ్వని’ ప్రదర్శన) 

Updated Date - 2020-02-25T07:26:04+05:30 IST