జనం మెచ్చని జగనన్న!

ABN , First Publish Date - 2021-08-18T07:12:49+05:30 IST

తిరుగులేని సంక్షేమం అంటూ ఊదరగొడుతున్నా... కోట్లకు కోట్లు ఖర్చు చేసి సొంత ప్రచారం

జనం మెచ్చని   జగనన్న!

  • దిగజారిన సీఎం గ్రాఫ్‌.. ‘ఇండియా టుడే’ సర్వేలో వెల్లడి
  • పథకాలు అమలుచేస్తున్నా పెదవి విరుపే
  • స్వరాష్ట్రంలో 42 శాతం ఓట్లతో టాప్‌లో స్టాలిన్‌
  • తర్వాతి స్థానాల్లో నవీన్‌ పట్నాయక్‌, పినరయి
  • జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎంగా యోగి ఆదిత్య
  • ఈ జాబితాలో జగన్‌కు నాలుగో స్థానం
  • ఇందులోనూ గతంకంటే తగ్గిన ప్రజాదరణ
  • 19 రాష్ట్రాల్లో ‘ఇండియా టుడే’ సర్వే


  • పాపులర్‌ ముఖ్యమంత్రుల టాప్‌-10లో దక్కని చోటు
  • స్వరాష్ట్రంలో 19% కూడా దక్కని ఆదరణ
  • జాతీయ స్థాయిలో 5 శాతం ఆదరణ డౌన్‌


వరాలు ప్రకటిస్తూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ గత ఏడాదితో పోల్చితే జగన్‌ ప్రజాదరణ 11 నుంచి 6 శాతానికి తగ్గిపోయింది. ఇక... సొంత రాష్ట్రంలో ఎక్కువ ఆదరణ ఉన్న టాప్‌-10 సీఎంల  జాబితాలో జగన్‌కు చోటుదక్కలేదు.

- ఇండియా టుడే 


న్యూఢిల్లీ/అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తిరుగులేని సంక్షేమం అంటూ ఊదరగొడుతున్నా... కోట్లకు కోట్లు ఖర్చు చేసి సొంత ప్రచారం చేసుకుంటున్నా... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రజాదరణ తగ్గిపోతోంది. ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో జగన్‌ గ్రాఫ్‌ బాగా దిగజారినట్లు వెల్లడైంది. ‘స్టాలిన్‌ బెస్ట్‌ సీఎం’ అని తమిళనాడులో 42 శాతం మంది ఓటేసి ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టారు. 38 శాతం మంది ఒడిసా ప్రజల ఆదరణతో నవీన్‌ పట్నాయక్‌ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో పినరయి విజయన్‌ (35 శాతం) ఉన్నారు.


‘స్వరాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులు’ (మోస్ట్‌ పాపులర్‌ సీఎమ్స్‌ ఇన్‌ దెయిర్‌ హోమ్‌ స్టేట్స్‌) అనే ఈ జాబితాలో టాప్‌-టెన్‌లో కూడా జగన్‌ లేరు. హేమంత్‌ సొరేన్‌ (జార్ఖండ్‌), భూపేశ్‌ (ఛత్తీ్‌సగఢ్‌) 19 శాతం ఆదరణ సాధించి వరుసగా 10, 11 స్థానాల్లో నిలిచారు. అంటే... జగన్‌ను ఏపీలో కనీసం 19 శాతం మంది కూడా ‘బెస్ట్‌ సీఎం’గా గుర్తించలేదని స్పష్టమైంది. ఈ జాబితాలో ఆయన ఏ స్థానంలో నిలిచారు, ఎంత ప్రజాదరణ లభించిందో తెలియదు. ఎందుకంటే... టాప్‌-10 జాబితాను మాత్రమే ‘ఇండియా టుడే’ వెలువరించింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో వరాలు ప్రకటించి, ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ... జగన్‌కు ప్రజాదరణ తగ్గిపోయింది’’ అని ఇండియా టుడే వ్యాఖ్యానించింది.




‘జాతీయ స్థాయి’లోనూ అంతే...

సొంత రాష్ట్రంలో టాప్‌-10 జాబితాలో కనపడకుండా చతికిలపడ్డ సీఎం జగన్‌... జాతీయ స్థాయిలోనూ ఆదరణ కోల్పోయారు. ఇదే సంస్థ గత ఏడాది నిర్వహించిన సర్వేలో... జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు ప్రదర్శిస్తున్న సీఎంగా జగన్‌కు 11 శాతం మంది ఓటు వేశారు. ఇప్పుడు ఆ సంఖ్య ఆరు శాతానికి పడిపోయింది. జాతీయ స్థాయిలో 19 శాతం ఓట్లతో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ దాస్‌ అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోల్చితే ఆయన ప్రజాదరణ 6 శాతం తగ్గిందని ‘ఇండియా టుడే’ తెలిపింది.


ఇక... ఈ జాబితాలో 14 శాతం ఓట్లతో కేజ్రీవాల్‌ రెండో స్థానంలో ఉండగా... 11 శాతం ప్రజాదరణతో మమతా బెనర్జీ (బెంగాల్‌) మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 6 శాతం ఆదరణతో జగన్‌ నాలుగో స్థానంలో ఉన్నారు. స్వరాష్ట్రంలో, జాతీయ స్థాయిలో జగన్‌కు ప్రజాదరణ తగ్గడానికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కూల్చివేతల సర్కారుగా  పేరు పొందడం, అడ్డగోలు నిర్ణయాలతో కోర్టుల్లో ఎదురు దెబ్బలు, మూడు రాజధానులతో అనిశ్చితి, పరిశ్రమలను బెదరగొట్టడం, విపక్షం లక్ష్యంగా వేధింపులు... వంటి కారణాల వల్లే ఆయనకు ఆదరణ తగ్గిందని చెబుతున్నారు.


నిజానికి... నేరుగా డబ్బులు చెల్లించే ‘ఫార్ములా’తో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తమకు ప్రజాదరణ భారీగా పెరుగుతోందని వైసీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కానీ.. అది వాస్తవం కాదని ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేతో స్పష్టమైంది. ఇక.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేరు ఏ జాబితాలోనూ కనిపించలేదు.


స్టాలిన్‌కు ఎలా సాధ్యం... 

జగన్‌ వచ్చీ రాగానే అన్నా క్యాంటీన్‌తో సహా పాత ప్రభుత్వ పథకాలను, రాజధాని అమరావతిని అటకెక్కించిన సంగతి తెలిసిందే. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఇందుకు భిన్నంగా... రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నారు. తమిళనాడులో పేదల కడుపు నింపే ‘అమ్మ క్యాంటీన్ల’ను జయలలిత బొమ్మతోనే కొనసాగిస్తున్నారు.


గత ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నింటిని యథాతథంగా కొనసాగిస్తూనే తనకంటూ ఒక ప్రత్యేక పంథాను ఏర్పరుచుకున్నారు. పౌరుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఏడు అంశాలను ప్రాధాన్యంగా ఎంచుకుని కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. కొవిడ్‌ సమయంలో పేదలకు రూ.4 వేల నగదు సహాయం చేశారు. వీటన్నింటి వల్లే స్టాలిన్‌ ఉత్తమ సీఎంగా నిలిచారని ‘ఇండియా టుడే’ పేర్కొంది. ఈ సర్వేలో కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొన్న తీరు కూడా కీలకంగా నిలిచిందని తెలిపింది.


సర్వే చేసిందిలా... 

‘ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేను కార్వీ ఇన్‌సైట్స్‌తో కలిసి నిర్వహించారు. గత నెల 10 - 20 తేదీల మధ్య ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. 19 రాష్ట్రాల పరిధిలో 115 లోక్‌సభ నియోజకరవర్గాలు, 230 అసెంబ్లీ స్థానాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ రాష్ట్రాలలో... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు అసోం, బిహార్‌, ఛత్తీ్‌సగఢ్‌ ఢిల్లీ, గుజరాత్‌, హరియాణా, జార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిసా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, బెంగాల్‌ ఉన్నాయి.


మొత్తంగా 14,599 మంది అభిప్రాయాలు సేకరించినట్లు ‘ఇండియా టుడే’ తెలిపింది. వీరిలో 71 శాతం మందిని గ్రామీణ ప్రాంతాల నుంచి, 29 శాతం మందిని పట్టణ ప్రాంతాల నుంచి ఎంపిక చేశారు. సగం మంది టెలిఫోన్‌ ద్వారా, సగం మందిని నేరుగా సంప్రదించి అభిప్రాయాలు సేకరించినట్లు ‘ఇండియా టుడే’ తెలిపింది. కొవిడ్‌ నిబంధనల మేరకు ఈ జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొంది.




జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎంలు..

(బ్రాకెట్‌లో గత సర్వేలో వచ్చిన ఓటింగ్‌ శాతం)


యోగి ఆదిత్యనాథ్‌, యూపీ 19 (24)

కేజ్రీవాల్‌, ఢిల్లీ 14 (14) 

మమతా బెనర్జీ, బెంగాల్‌ 11 (8)

వైఎస్‌ జగన్‌, ఏపీ 6 (11)

నితీశ్‌ కుమార్‌, బిహార్‌ 5(6)

ఉద్ధవ్‌ ఠాకరే, మహారాష్ట్ర 5(6)

నవీన్‌ పట్నాయక్‌, ఒడిసా 5(5)




స్వరాష్ట్రంలో అత్యధిక ఆదరణ ఉన్న సీఎంలు


ఎంకే స్టాలిన్‌ (తమిళనాడు) 42%

నవీన్‌ పట్నాయక్‌ (ఒడిసా) 38%

పినరయి విజయన్‌ (కేరళ) 35%

ఉద్ధవ్‌ ఠాకరే (మహారాష్ట్ర) 31%

మమతా బెనర్జీ (బెంగాల్‌)        30%

హిమంత విశ్వ శర్మ (అసోం) 29%

యోగి ఆదిత్యనాథ్‌ (యూపీ) 29%

అశోక్‌ గోహ్లోత్‌ (రాజస్థాన్‌) 22%

అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఢిల్లీ) 22%

హేమంత్‌ సోరెన్‌ (జార్ఖండ్‌) 19%

భూపేశ్‌ (ఛత్తీ్‌సగఢ్‌)      19%


Updated Date - 2021-08-18T07:12:49+05:30 IST