పెంచిన పింఛన్‌ ఎప్పుడిస్తారు సార్‌!

ABN , First Publish Date - 2020-07-05T09:22:10+05:30 IST

ఏటా రూ.250 చొప్పున పెంచుతామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు ఈ నెల పెరిగిన పింఛన్‌ అందకపోవడంతో సామాజిక పెన్షన్‌దారులు నిరాశ చెందారు.

పెంచిన పింఛన్‌ ఎప్పుడిస్తారు సార్‌!

  • గతేడాది జూలైలో రూ.250 పెంపు
  • ఈనెల పెంపు లేకుండానే పంపిణీ..
  • సామాజిక పెన్షన్‌దారులకు నిరాశ 
  • కేంద్ర కరోనా పరిహారమూ అందలేదు..
  • ఆ నిధులూ రాష్ట్ర ఖజానాకే 


అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఏటా రూ.250 చొప్పున పెంచుతామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు ఈ నెల పెరిగిన పింఛన్‌ అందకపోవడంతో సామాజిక పెన్షన్‌దారులు నిరాశ చెందారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా రూ.250 చొప్పున పెంచి ఇస్తామని, నాలుగో సంవత్సరం వచ్చే సరికి పెన్షన్‌ రూ.3 వేలకు చేరుకుంటుందని మాట మార్చారు. గతేడాది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి(జూలై 8) రోజున పెంచిన  రూ.250తో కలిపి సామాజిక పెన్షన్‌దారులకు రూ.2250 అందించారు. ఈ ఏడాది జూలై నెల నుంచి మరో రూ.250 పెంచి రూ.2,500 ఇస్తారని సామాజిక పెన్షన్‌దారులు ఎదురుచూసినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది. పెంచిన పెన్షన్‌ను ఎప్పుడిస్తారని వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను అడిగినా సమాధానం లేదు. ప్రభుత్వంలోనూ పెంపుపై చర్చ జరిగినట్లు సమాచారం లేదు. అందుకు తగ్గ ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించినట్లు లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా రిలీఫ్‌ కింద దేశవ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతు పెన్షన్‌దారులకు ఒక్కొక్కరికీ రూ.వెయ్యి మంజూరుచేసింది. ఒక్కో దఫా రూ.500 చొప్పున రెండు సార్లు విడుదల చేశారు. ఆ మేరకు కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమచేసింది. అయితే, మన రాష్ట్రంలో ఈ పరిహారం కూడా ఆయా పెన్షన్‌దారులకు అందించలేదు.

Updated Date - 2020-07-05T09:22:10+05:30 IST