నచ్చినోళ్లకే పింఛన్‌

ABN , First Publish Date - 2020-02-19T09:36:42+05:30 IST

ఒక చేత్తో కోతలు! మరో చేత్తో కొత్తగా మంజూరులు! ఏళ్ల తరబడి పింఛను సాయం పొందుతున్న వారి పేర్లు జాబితాలో మాయమైపోయాయి! అదే సమయంలో... అస్మదీయులు, అనర్హులకు

నచ్చినోళ్లకే పింఛన్‌

సాయ..మేదయ్యా!

లేవలేరు..కూర్చోలేరు.. పట్టుమని పది అడుగులు వేయలేరు.. కానీ ఏదో కొర్రీ పెట్టి వారికి అందుతున్న సాయాన్నీ నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన డొంకాన సాయమ్మ పక్షవాతంతో కాళ్లు చచ్చుబడి పదేళ్లుగా మంచంలోనే ఉంది. ఆమె స్థితిని గుర్తించి గత ప్రభుత్వాలు పింఛను అందిస్తున్నాయి. అయితే, ఆమెకు ప్రభుత్వ గృహం మంజూరయిందనే కారణంగా పింఛను నిలిపివేశారు.  


సిత్రాలు చూడరో..

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో నేతన్నలు కాని చాలామందికీ చేనేత పింఛన్లు మంజూరయ్యాయి. ఇదే జిల్లా అద్దంకిలో వల, వేట తెలియని కుటుంబాలకు మత్స్యకార పింఛన్లు అందుతున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్‌ ప్రాంతంలో 25గజాల స్థలంలో షేక్‌ బాజీకి రేకులషెడ్డు ఉంది. ఈ షెడ్డును చూపించి ఆయనకు పింఛను ఆపేశారు.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 14 ఎకరాల పొలం ఉంది. ఈ ఆసామి కొత్తగా పింఛను అందుకొన్నాడు. ఆయనకు తెల్లరేషన్‌ కార్డు కూడా ఉంది!


నాకు వయసు లేదంట!

నాకు వయసు లేదంటా అని పింఛన్‌ తొలగించారు. నా వయసు 75 ఏళ్లు. ఆధార్‌ కార్డులో ఉన్న వయసును బట్టి పింఛన్‌ తొలగించారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే వలంటీర్ల వద్ద సమాధానం లేదు.

 రేనాటి ఈశ్వరమ్మ, వృద్ధురాలు, ముత్తలూరు, కర్నూలు జిల్లా


అర్హులకు కత్తెర.. అస్మదీయులకు కొత్త జాతర

ఆధార్‌లో వయసులు పెంచేసి

తమవారికి యథేచ్ఛగా పందేరం

కొడుకు ఉద్యోగి.. భర్త రిటైర్డు

పేదగా తలచి ఆమెకు సాయం

13 ఎకరాల ఆసామికీ పెన్షన్‌ 

లారీ ట్రాన్స్‌పోర్టు ఓనరూ అర్హుడే

వల, వేట తెలియకున్నా జాలరే!

ఆ కోటాలో ప్రకాశంలో పింఛన్లు

భర్త, పిల్లలున్నా ‘ఒంటరే’నట!

రేపల్లెలో ఓ గృహిణికి ఆ పింఛన్‌

‘అధికార’ చెలగాటం.. ‘స్థానిక’ హడావుడిలో పదనిసలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఒక చేత్తో కోతలు! మరో చేత్తో కొత్తగా మంజూరులు! ఏళ్ల తరబడి పింఛను సాయం పొందుతున్న వారి పేర్లు జాబితాలో మాయమైపోయాయి! అదే సమయంలో... అస్మదీయులు, అనర్హులకు కొత్తగా పింఛన్లు ఇచ్చి పండగ చేసుకోమన్నారు. కొత్త పింఛన్లలో అత్యధికం  ఇలాంటివే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. వలంటీర్ల పదనిసలు కొంత,  నేతల హడావుడి మరింత.. అనర్హులను పెద్దఎత్తున జాబితాల్లోకి తెచ్చేశాయి. పెట్టిన కోతలు కనిపించనంతగా ప్రతి జిల్లాలో పెంచేసిన పింఛన్లలో ఈ బాపతే ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఉదాహరణకు...  రాజమహేంద్రవరం 1వ డివిజన్‌లో ఉండే ఆయనకు పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉంది. పైగా ఆయన కొడుకు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.


గతంలో దూదిమిల్లులో పనిచేస్తుండగా ఆయనకు పింఛను మంజూరయింది. ఆ తరువాత ఆయన స్థితి బాగా మారిపోయింది. ఆ సర్వేలు, ఈ సర్వేలని హడావుడి చేసిన అధికారుల దృష్టికి మాత్రం ఆయన పేదవాడిగానే కనిపించారు. ఫిబ్రవరి ఒకటిన అందరితో పాటు ఆయనా కొత్త పింఛను అందుకొన్నారు. ఈ ప్రాంతంలోనే ఉంటున్న ఓ లారీ ట్రాన్స్‌పోర్టు యజమానికి, వడ్డీ వ్యాపారం చేసే మహిళకు పింఛను ఇవ్వడానికి వారికి ఉన్న సొంత నచ్చినోళ్లకే ‘పింఛన్‌’ ఇళ్లు, స్థలాలు అడ్డు కాలేదు. ‘నా వాడా.. కాడా’ అనేదే అధికార నేతలు చూస్తుండటంతో ఇలాంటి వేలాదిమంది ఎంచక్కా సాయం అందుకొంటున్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నేతలు చేస్తున్న హడావుడి కొన్నిచోట్ల ప్రభుత్వం పరువు తీస్తోంది. భర్త, పిల్లలు ఉన్నా....పలువురికి ఒంటరి మహిళ కోటాలో పింఛన్లు ఇవ్వడం గుంటూరు జిల్లా రేపల్లెలో గగ్గోలు రేపింది!


అన్నకు నో.. తమ్ముడికి ఓకే..

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో సుమారు 40 మంది గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు మసాల్లో ఆధార్‌ కార్డులో తమ వయసు తప్పుగా పడిందంటూ కొత్త ఆధార్‌ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపువారే. వైసీపీ నేతల    సూచనతో వారికి సన్నిహితులైన వీరంతా మూకుమ్మడిగా దరఖాస్తు చేశారు. ఈ 40 మందికీ అధికారులు వయసు పెంచి, జనవరి 1న జన్మించినట్లు కొత్త ఆధార్‌లో నమోదు చేశారు. 1958, 1959లోనే వీరంతా జన్మించినట్లు అందులో నమోదు చేశారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. కడప జిల్లాలో కొత్తగా మంజూరు చేసిన పింఛన్లలో సగం మంది అనర్హులే ఉన్నట్లు తెలుస్తోంది. ఆధార్‌ కార్డులో వయసు పెంచి కొత్త పింఛన్లు అందుకున్నట్లు తెలుస్తోంది. పెండ్లిమర్రి మండలంలో రేషన్‌కార్డులలో 60 ఏళ్ల లోపు ఉన్నా.. మీసేవ కేంద్రాల్లో ఆధార్‌ కార్డుల్లో 60 సంవత్సరాలపైబడిగా మార్పు చేసి..పింఛన్లు పొందినట్లు ఆరోపణలున్నాయి. గ్రామ వలంటీర్ల ద్వారా ఈ బాగోతం జరిగినట్లు తెలుస్తోంది. 


ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలేనికి చెందిన పాలపల్లి హనుమంతు, నాగేశ్‌ అన్నదమ్ములు. అన్న హనుమంతుకు (65) వృద్ధాప్య పింఛను నిలిపివేసిన అధికారులు తమ్ముడికి మాత్రం కొనసాగిస్తున్నారు.  


భర్తతో ఉంటున్నా..

గుంటూరు జిల్లా రేపల్లెలో ఓ మహిళకు పింఛను ఇచ్చిన తీరు గగ్గోలు రేపింది. ఆమెను ఒంటరి మహిళ కోటాలో పింఛనుకు అర్హురాలిగా అధికారులు తేల్చారు. వలంటీరు ఇంటికెళ్లి ఆమె చేతికి పింఛను డబ్బులు అందించారు. తనకు పింఛను మంజూరు కావడంపై ఆమె అయోమయానికి గురయితే, ఆమె భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నేను బతికే ఉన్నాను.  మేం కలిసే ఉంటున్నాం. అలాంటప్పుడు నా భార్య ఒంటరి మహిళ ఎలా అవుతుంది?’’ అని మండిపడ్డాడు. అనంతపురం సిటీకి చెందిన శివమ్మకు భర్త, యల్లప్ప, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. అధికారులు మాత్రం శివమ్మను ఒంటరి మహిళగా తేల్చి పింఛను మంజూరు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ నేతలు చేసిన హడావుడి ఫలితమిదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. 


అనంతపురం 15వ డివిజన్‌లో ఉంటున్న రోషన్‌బీ గత 13 సంవత్సరాలుగా మంచంలోనే ఉంది. వెన్నెముక దెబ్బతినడంతో కదలలేని పరిస్థితి ఆమెది. ఆమెకు ఆసరా 80ఏళ్ల తల్లి ఫాతిమా. వారికి వస్తున్న వికలాంగుల, వృద్ధాప్య పింఛన్లు ఒకేసారి ఆగిపోయాయి. ఉండేది అద్దె ఇంట్లో అయినా వెయ్యి చదరపు అడుగుల సొంతిల్లు ఉన్నట్టు వాలంటీర్‌ రికార్డులో నమోదు చేయడమే దీనికి కారణం.


పుట్టుకతోనే దివ్యాంగురాలిని. కొన్నేళ్లుగా నాకు వికలాంగుల పింఛన్‌ వస్తా ఉండేది. కానీ ఇప్పుడు రేషన్‌కార్డు సక్రమంగా లేదని, ఆధార్‌కార్డుతో లింక్‌ లేదని నా పింఛన్‌ ఆపేసినారు. మా కుటుంబ పరిస్థితులు బాగాలేవు. నన్ను చూసేవాళ్లు ఎవరూ లేరు.

 రంగాని లక్ష్మీదేవి, నాయునివారిపల్లె, కడప జిల్లా.


మహా పేదలు...

కృష్ణాజిల్లా నూజివీడులో ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాల పరిపాలనాధికారిగా పనిచేస్తున్న వ్యక్తికి పట్టణంలోని 24వ వార్డులో వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేశారు. అదే వార్డులో రెండంతస్థుల భవనాలు ఉన్న వ్యక్తులకు సైతం పింఛన్‌ మంజూరు చేశారు. ఇదే పట్టణంలోని 18వ వార్డులో చర్చి ఫాదర్‌లుగా పనిచేస్తున్న వారి కుటుంబీకులకు వృద్ధాప్య పెన్షన్‌లు మంజూరు చేశారు. వీరికి పట్టణంలో రెండంతస్థుల భవనాలు ఉండటం విశేషం. ఈ ప్రాంతానికే చెందిన ఓ దివంగత శాసనసభ్యుని కుమారుడికి మీర్జాపురం గ్రామంలో వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేశారు. ఇతనికి ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో 15 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇదే జిల్లా పామర్రు మండలానికి ఒకరి కుమారుడు ఓ మేజర్‌ పంచాయతీ కార్యదర్శి. భర్త రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి. రూ.40వేలకు పైగా పింఛన్‌ పొందుతున్నారు. అయినా, ఆమెకు వృద్ధాప్య పింఛను మంజూరయింది. 


పొలమున్నా పండేనా.. చచ్చేనా..

‘‘నా భర్త చనిపోయి మూడు సంవత్సరాలు. అప్పటి నుంచి వితంతు పింఛను వస్తోంది. ఇటీవల నా పింఛన్‌ తొలగించారు. కారణాలు అడిగితే పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. నేను పెద్ద భూస్వామిని కాదు. నా భర్త పేరున ఉన్న ఒకటిన్నర ఎకరా నాపేరున మార్చుకున్నాను. నీళ్లు లేక ఒక కారు పండితే మరొక కారు బీడుగా ఉంటుంది. ఇద్దరు కొడుకులున్నా.. వారివి వేరు కాపురాలు. నాకొచ్చే వితంతు పింఛనే ఆసరాగా ఉండేది. అది కూడా తొలగించారు. ప్రభుత్వం పెట్టిన అన్ని నిబంధనలకు నేను అర్హురాలినే. అయినా, నా పింఛన్‌ను తొలగించి పుణ్యం కట్టుకున్నారు’’

 వేమన సీతమ్మ, చిన్నఓరంపాడు గ్రామం, ఓబులవారిపల్లె మండలం, కడప జిల్లా


పొలం ఉందని తొలగించారు

‘‘13 ఏళ్ల క్రితం కరెంట్‌ షాక్‌ తగిలి రెండు చేతులూ కోల్పోయాను. అప్పటి నుంచి ప్రభుత్వం నాకు పింఛను ఇస్తోంది. ఈ ప్రభుత్వం 10 ఎకరాలు పొలం, 300 యూనిట్లు కరెంటు వాడకం, నాలుగు చక్రాల వాహనం ఉన్న వారికి పింఛన్లు తొలగిస్తోంది. నా పేరిట 18 ఎకరాల పొలం ఉన్నా సాగుచేసే స్థితిలో లేను. నాలాంటి వారి పింఛన్‌ తొలగించడం అన్యాయం. కలెక్టర్‌ను కలిసినా మా చేతిలో ఏమీ లేదన్నారు.’’

 కె.నాగేశ్వరరెడ్డి, లింగాల,  పులివెందుల నియోజకవర్గం, కడప జిల్లా.


52లో పుట్టాడు.. స్వాతంత్య్ర వీరుడట!

కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేటకు చెందిన తాడిగొట్ట చెన్నయ్యకి 68 ఏళ్లు. పేదరికంతో బాధపడుతున్న ఆయనకు గత ప్రభుత్వం వృద్ధాప్య పింఛను ఇచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చి తాజాగా వడపోత జరిపి.. ఆయనను అనర్హుడిగా తేల్చింది. ఎందుకు పింఛను తీసేశారని అధికారులను చెన్నయ్య అడిగారు. దానికి వారు చెప్పిన జవాబు విని ఆయన నోట రాలేదు. ‘స్వాతంత్ర సమరయోధుల కోటాలో లబ్ధి పొందుతున్నావు. అందుకే పింఛను తీసేశాం’ అని వారు చెప్పడంతో చెన్నయ్య లబోదిబోమన్నాడు. తానెప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నానంటూ నెత్తీనోరు బాదుకొన్నాడు. రికార్డుల ప్రకారం చెన్నయ్య 1952లో పుట్టాడు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి అప్పటికి ఐదేళ్లు!



13 ఎకరాలు ఉందని కట్‌ చేశారు

ఈమె పేరు గాలెస్సా గారి రబియాబీ. వయస్సు 58 సంవత్సరాలు. పుట్టుకతోనే అంధురాలు. ఆమె అన్నయ్య మహబూబ్‌వలి కూడా పుట్టుకతోనే అంధుడు. కర్నూలు జిల్లా సంజామల మండలం కేంద్రంలో నివసిస్తున్నారు. కొన్నేళ్ల కిత్రం తల్లిదండ్రులను కోల్పోయిన వారు కేవలం ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. రబియాబీ పేరు మీద 13 ఎకరాల భూమి ఉందని పింఛను తొలగించారు. ఆమెకున్నది మూడు ఎకరాలే. అంధురాలి పింఛన్‌ ప్రభుత్వం తొలగించడంతో తమకు కుటుంబపోషణ భారంగా మారిందని అన్నాచెల్లెళ్లు ఆవేదన చెందుతున్నారు. 

Updated Date - 2020-02-19T09:36:42+05:30 IST