కొందరికే పింఛన్‌

ABN , First Publish Date - 2022-01-02T09:16:18+05:30 IST

కొందరికే పింఛన్‌

కొందరికే పింఛన్‌

ఒకటో తేదీన 37.5 శాతమే పంపిణీ


 (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పెంచిన పెన్షన్‌ను ఒకటో తేదీ నుంచి ఇస్తున్నామని ప్రకటించి, తీరా పంపిణీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామున నిద్రలేపి పెన్షన్లు ఇచ్చే వలంటీర్లు శనివారం ఇంటి దరిదాపులకు కూడా రాకపోవడంపై పింఛనుదారులు ఆందోళన చెందారు. ఈనెల నుంచి పెన్షన్‌ రూ.2,500 వస్తుందంటూ అవ్వాతాతలు శనివారమంతా ఎదురుచూశారు. అయితే, పెన్షన్‌ ఇచ్చేందుకు వలంటీర్లు రాకపోవడంతో అవ్వాతాతలు ఈసురోమన్నారు. పెంచిన పెన్షన్‌ను ముఖ్యమంత్రి జగన్‌ శనివారం ప్రత్తిపాడులో ప్రారంభించాక, మధ్యాహ్నం నుంచి పెన్షన్‌ పంపిణీ చేస్తారని ప్రకటించినా, రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు అరకొరగానే పంపిణీ అయ్యాయి. పలు జిల్లాల్లో బ్యాంకుల నుంచి వలంటీర్లు పూర్తిస్థాయిలో డబ్బులు డ్రా చేసుకోకపోవడంతో పంపిణీ ఆలస్యమైంది. 61 లక్షల పెన్షన్లకు గాను శనివారం రాత్రి 8.30 గంటల వరకు 23 లక్షల మందికి(37.5 శాతం) మాత్రమే పంపిణీ చేయగలిగారు. పలు జిల్లాల్లోని బ్యాంకుల్లో సర్వర్లు మొరాయించడంతో వలంటీర్లు డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అన్ని జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాతే పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో 34 మండలాల్లో మాత్రమే శనివారం పెన్షన్ల పంపిణీ జరిగింది. పెన్షన్‌ సొమ్ము మొత్తం బ్యాంకులకు బట్వాడా చేయడం ఆలస్యమైంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎస్‌బీఐ తప్ప మిగిలిన బ్యాంకుల నుంచి పెన్షన్ల మొత్తం డ్రా చేసుకున్నారు. ఆ జిల్లాలో ఆదివారం పంపిణీ చేయనున్నారు. పలు జిల్లాల్లో శనివారం బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయని చోట్ల ఆదివారమూ పంపిణీ సాధ్యం కాదు. వారికి సోమవారం నుంచి పంపిణీ చేసే అవకాశం ఉంది.  


అనంతలో 19 శాతమే..

అనంతపురం జిల్లాలోని కొన్ని సచివాలయ ఖాతాలకు పింఛన్‌ డబ్బులు శనివారం మధ్యాహ్నం తరువాత జమచేశారు. మిగిలిన సచివాలయాల ఖాతాలకు సాయంత్రం 5 గంటల తరువాత జమచేశారు. దీంతో సాయంత్రం 5 గంటల తరువాత కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అరకొరగా పింఛన్‌దారులకు సొమ్ము పంపిణీ చేశారు. జిల్లాలో 5,23,986 మంది పింఛన్‌దారులకుగాను, శనివారం 95,186 మందికి(19 శాతం) మాత్రమే పంపిణీ చేశారు. 


సాయంత్రం వరకు బ్యాంకుల ముందే..

పింఛన్‌ డబ్బు కోసం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలులోని ఎస్‌బీఐ కార్యాలయానికి గ్రామ, వార్డు సచివాలయాల వెల్ఫేర్‌ అసిస్టెంట్లు శనివారం ఉదయమే చేరుకున్నారు. బ్యాంకు ముందు సాయంత్రం 6 గంటల వరకు  పడిగాపులు కాశారు. చివరకు పింఛన్‌ సొమ్ము ఈ రోజు ఇవ్వలేమని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో విసుగుతో వెనుదిరిగారు.

Updated Date - 2022-01-02T09:16:18+05:30 IST