నా ఫోన్లో పెగాసస్‌!

ABN , First Publish Date - 2022-10-08T08:33:27+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తనతో పాటు దేశవ్యాప్తంగా పాత్రికేయులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు..

నా ఫోన్లో పెగాసస్‌!

  • కిషన్‌రెడ్డి ఫోన్‌ కూడా మోదీ వింటున్నారు
  • దేశంలో పదివేల మంది ఫోన్ల ట్యాపింగ్‌
  • రాహుల్‌ పాదయాత్రలో ఒకరిద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు జంప్‌
  • ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ఉండకపోవచ్చు
  • రాహుల్‌ కాంగ్రెస్‌ జోడో యాత్ర చేయాలి
  • పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌
  • బీజేపీని నడిబజారులో నగ్నంగా నిలబెడతాం
  • చరిత్రలోనే అత్యంత అసమర్థ ప్రధాని మోదీ
  • ఆంధ్ర, ఒడిసాల నుంచి చేరతామని ఫోన్లు
  • మోహన్‌ భాగవత్‌వి చిల్లర మాటలు
  • మీడియాతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే టీఆర్‌


హైదరాబాద్‌, అక్టోబర్‌ 7, (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తనతో పాటు దేశవ్యాప్తంగా పాత్రికేయులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు.. ఇలా అన్ని రంగాలకు చెందిన 10 వేల మంది ఫోన్లపై నిఘా వేస్తోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. తనతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ప్రధాని నిఘా పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. తమ అందరి ఫోన్లలో పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ జొప్పించి, ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిస్సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ఈ విషయం తెలియక పోవచ్చని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ప్రగతి భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తమ కార్యాలయంలోకి ఇంటిలిజెన్స్‌ సీఐని ఎలా పంపిస్తారని ప్రశ్నించగా, కేటీఆర్‌ పెగాసస్‌ ప్రస్తావన చేశారు. కాంగ్రెస్‌ దేశానికి గుదిబండలా మారిందని, ఉనికికోసం తాపత్రయపడే స్థాయికి చేరుకుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర వదిలి కాంగ్రెస్‌ జోడో యాత్రను చేపట్టాలని సూచించారు. యాత్ర తెలంగాణలోకి చేరేసరికి ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఒకరిద్దరు ఎంపీలు పార్టీ మారనున్నారని తెలిపారు. ఎవరనేది తాను చెప్పనని, అది తనకున్న సమాచారమని అన్నారు.


 భారత్‌ రాష్ట్ర సమితి లక్ష్యం 2024 సాధారణ లోక్‌సభ ఎన్నికలేనని కేటీఆర్‌ చెప్పారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా? అన్నది అంతర్గత సమావేశాల్లో నిర్ణయిస్తామని చెప్పారు. దేశ చరిత్రలోనే అత్యంత అసమర్ద, పనికిరాని ప్రధానిగా మోదీని అభివర్ణించారు. ఆయన తన మనసులో మాటను(మన్‌కీ బాత్‌) చెప్పడమే తప్ప ప్రజల మాట(జన్‌కీ బాత్‌) వినరని అన్నారు.  మోదీ కేవలం ప్రచారానికి పరిమితం అయ్యారని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఆయన హయాంలో ఎన్నడూ లేనంతగా  పెరిగాయని చెప్పారు. రూపాయి విలువ దారుణంగా పడిపోయిందన్నారు. బీజేపీ వైఫల్యాలపై నిలదీస్తామని, ఆ పార్టీని బట్టలిప్పి నగ్నంగా నడివీధిలో నిలబెడతామని హెచ్చరించారు.


నాడు అడ్రస్‌ లేనివాళ్లు కూడా..

టీఆర్‌ఎస్‌ పెట్టినప్పుడు కూడా చాలా మంది మెదక్‌ జిల్లా దాటి ఇతర జిల్లాలకు తెలియని కేసీఆర్‌ ఏం సాధిస్తారని ఎగతాళి చేశారని కేటీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణ పదం తీసేసి భారత్‌ అని పెట్టగానే బంధం తెగిపోయిందని మాట్లాడుతున్నారని, టీఆర్‌ఎస్‌ లేకుంటే అడ్రస్‌ లేనివాళ్లు కూడా గొంతు చించుకుంటున్నారని అన్నారు. తెలంగాణకు కేసీఆరే ప్రతీక అని, పార్టీ పేరులో తెలంగాణ లేకున్నా పల్లెల్లో తమ పార్టీని తెలంగాణ పార్టీయేఅంటారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ పార్టీ అని తేలిగ్గా పక్కన పెట్టకుండా పార్టీ పేరు మార్చారని వివరించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ చేసిన పనులను చూసి పంజాబ్‌లోను అధికారాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కర్ణాటకలో ఆ రాష్ట్ర మంత్రి పాల్గొన్న సభలో ‘తెలంగాణలోలా మాకూ రైతు బంధు, దళితబంధు ఇవ్వండి. లేకుంటే మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి’ అని ప్రజలు నిలదీశారని ప్రస్తావించారు. మహారాష్ట్ర నుంచి కూడా ఇలాంటి విజ్ఞప్తులే వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశమంతటా జరగాలన్న లక్ష్యంతోనే కేసీఆర్‌ జాతీయ పార్టీ దశగా వెళుతున్నారని చెప్పారు. బీజేపీ రెండు సీట్ల నుంచి సొంతంగా అధికారానికి రావడానికి 40 ఏళ్లు పట్టిందని, తాము చాలా వేగంగా దాన్ని సాధించగలమని భరోసా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో మోదీ గుజరాత్‌ సీఎంగా ఉంటూనే దేశవ్యాప్తంగా 100 సమావేశాల్లో పాల్గొన్నారని, కేసీఆర్‌ కూడా సీఎంగా ఉంటూనే దేశవ్యాప్తంగా తిరుగుతారని చెప్పారు. 


వేట కుక్కల్లా దర్యాప్తు సంస్థలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ, సీబీఐలను వేటకుక్కల్లా వాడుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. మమత, కేజ్రీవాల్‌, సంజయ్‌రౌత్‌, కేసీఆర్‌ ఇలా అందరినీ టార్గెట్‌ చేశారన్నారు. ఈ 8ఏళ్లలో ఒక్క బీజేపీ నేతపై అయినా ఈడీ, ఐటీ దాడులు జరిగాయా? అని ప్రశ్నించారు.  గతంలో సుజనాచౌదరి, సీఎం రమే్‌షలపై  కేసులుండేవని, బీజేపీలోకి చేరగానే అవన్నీ ఏమైపోయాయని అడిగారు. మోహన్‌ భగవత్‌వి చిచోరా చిల్లర మాటలని, హిందూ, ముస్లింలను వేరు చేసే కుట్ర అని విమర్శించారు. మోహన్‌ భగవత్‌ ఎవరు? ఆయన ఎప్పుడైనా కౌన్సిలర్‌గా గెలిచారా? అని ప్రశ్నించారు. ఆయన ముందు కౌన్సిలర్‌గా గెలవాలన్నారు.


ఆగస్టు 15 ఎందుకు కాదు

‘‘సెప్టెంబరు 17ను విమోచన దినోత్సవంగా జరపాలని అడుగుతున్న బీజేపీ ఆగస్టు 15ను విమోచన దినంగా ఎందుకు చేయదు? స్వాతంత్య్ర దినోత్సవం అని ఎందుకంటున్నారు? హైదరాబాద్‌లో నిజాం రాజు కాబట్టి విమోచన దినం అని హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టాలి. బ్రిటిష్‌ వారిని తిట్టినా ఓట్లు రాలవు కాబట్టి అక్కడ స్వాతంత్య్ర దినోత్సవం చేయాలి...ఇది బీజేపీ రాజకీయం’’ అని కేటీఆర్‌ విమర్శించారు. 


చంద్రబాబు నవ్వారుగా

జాతీయ పార్టీ గురించి జగన్‌తో కూడా మాట్లాడారా? అన్న ప్రశ్నకు...అన్నీ సమయం వచ్చినప్పుడు మాట్లాడతామని కేటీఆర్‌ బదులిచ్చారు. చంద్రబాబుతో మాట్లాడారా? అని ప్రశ్నించగా... విలేకరులు బాబును అడిగితే నవ్వారు కదా? నా సమాధానం కూడా నవ్వే అని బదులు ఇచ్చారు.  ఆంధ్ర, ఒఢిశా నేతలు తన నెంబర్‌ తెలుసుకుని నేరుగా తనకే ఫోన్‌లు చేస్తున్నారని, బీఆర్‌ఎ్‌సలో చేరతామంటున్నారని కేటీఆర్‌ వెల్లడించారు. 


తెలంగాణ మోడల్‌ దేశమంతా కావాలి

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 8 ఏళ్లలోనే అద్భుత అభివృద్ధి సాధించామని కేటీఆర్‌ చెప్పారు. 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ అందించామన్నారు. 28 రాష్ట్రాల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందించామని చెప్పారు. రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గించామని చెప్పారు. ‘‘గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ను చూపించి మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. కానీ దేశానికి నిజమైన రోల్‌మోడల్‌ తెలంగాణే. ఈ మోడల్‌నే దేశమంతా ప్రచారం చేస్తాం’’ అన్నారు.  


కవిత గైర్హాజరును పెద్దదిగా చూడక్కర్లేదు

బీఆర్‌ఎస్‌ కీలక సమావేశానికి ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు అవడం పెద్ద విషయం కాదని కేటీఆర్‌ బదులిచ్చారు. ‘‘రంజిత్‌రెడ్డికి కాలు విరిగింది. అందుకు రాలేదు. దాన్నేమంటాం?’’ అని ప్రశ్నించారు. ‘‘99 శాతం మంది ప్రతినిధులు హాజరైతే గైర్హాజరు అయన వారి గురించి మాట్లాడుతున్నారు. మీకు సంచలనాలు కావాలి’’ అని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మునుగోడులో కేంద్ర బలగాలను దించాలన్న బీజేపీ డిమాండ్‌పై స్పందిస్తూ, ‘‘వారికి తెలంగాణ పోలీసుల మీద, తెలంగాణ ప్రజల మీద కూడా నమ్మకం లేదు. అంత నమ్మకం లేకుంటే తెలంగాణ పోలీసుల భద్రతను వాడుకోకూడదు’’ అని సూచించారు. 


మునుగోడులో రూ.500 కోట్ల ఖర్చు 

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.500కోట్లు ఖర్చు చేస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్వయంగా ఒక పెద్దాయనతో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చెప్పారని కేటీఆర్‌ వెల్లడించారు. స్వయంగా ఆ పెద్దాయనే తనకు ఈ విషయాన్ని చెప్పారన్నారు. మునుగోడులో ఒక్కో ఓటరుకు రూ.15-20వేలు ఇచ్చి గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాకు రూ.22వేల కోట్ల కాంట్రాక్టును కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అందులో మిగిలే రూ.5 వేల కోట్ల కోసమే రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారన్నారు. మునుగోడు ఎన్నిక కాంట్రాక్టరు బలుపు...మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 13ు ఓట్ల ఆధిక్యంలో ఉందన్నారు.


అదనపు సాయమే ఐప్యాక్‌ పని 

‘‘నాయకుడిలో దమ్ముంటే జాతీయ స్థాయికి వెళ్తారు. నాయకుడిలో దమ్ముంటేనే, పార్టీలో కంటెంట్‌ ఉంటే... ఐప్యాక్‌ లాంటి సర్వే సంస్థలు కొంత అదనంగా సాయం చేస్తాయి. దమ్ము లేకుంటే అవి చేసేదేం ఉండదు’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి పీకే పనిచేయరని వస్తున్న వార్తలపై  స్పందిస్తూ, ఒక సర్వే సంస్థపై ఇంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించారు.

Updated Date - 2022-10-08T08:33:27+05:30 IST