Abn logo
Mar 9 2021 @ 14:55PM

నేనే సీఎం అయితే టీడీపీ ఖాళీ: పెద్దిరెడ్డి

అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ‌కు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏమిటని తెలుగుదేశం నేతలను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్మోహన్‌రెడ్డి సీఎం గనుక ఇంకా టీడీపీ‌లో కొంతమంది శాసన సభ్యులు ఉన్నారు.. అదే సీఎంగా నేనైతే చంద్రబాబు మాత్రమే ఆ పార్టీలో మిగిలేవారు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అని నిలదీశారు. కేంద్రంపై అంతా విశాఖ స్టీల్ కోసం కలిసి పోరాడి సాధించాలని కోరారు. రాజీనామా చేయాలని టీడీపీ చేస్తున్న వ్యాఖలు అర్ధరహితమని చెప్పారు. మళ్లీ ఎన్నికలు వస్తే వైసీపీ 170 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉక్రోషంతో మాట్లాడుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 90 శాతం విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.  టీడీపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లను ఢిల్లీ తీసుకెళ్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారన్నారు. చంద్రబాబు హయాంలో ఏ సమస్య పైన అయినా ఒక్కసారైనా అఖిలపక్షం పెట్టారా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.

గనులు, పంచాయతీరాజ్ అభివృద్ధి పనులపై చర్చ..

అమరావతి: గనులు, పంచాయతీరాజ్ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. అనంతపురం, కర్నూలు జిల్లాలోని ఇనుప గనులను కడప స్టీల్ ప్లాంట్‌కు ఇస్తామన్నారు. విశాఖ ఉక్కుకు ఆ గనులు కేటాయించడం వల్ల ఉపయోగం లేదని తెలిపారు.గ్రామ సచివాలయాల్లో ఎనిమిదివేల ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు.ఎల్ఈడీ లైట్‌ల నిర్వహణ గ్రామ సచివాలయానికి అప్పగించామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement