రాజకీయ కబ్జాల్లో జల కేటాయింపులు

ABN , First Publish Date - 2022-06-07T06:27:19+05:30 IST

కర్రగల వానిదే బర్రె అనే ఈ కహానీలోనికి వెళ్ళితే– ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాలేరు నగరి రెండవ దశకు..

రాజకీయ కబ్జాల్లో జల కేటాయింపులు

కర్రగల వానిదే బర్రె అనే ఈ కహానీలోనికి వెళ్ళితే– ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాలేరు నగరి రెండవ దశకు కేటాయింపులు ఉన్న 10.722 టీఎంసీల కృష్ణ జలాల నుంచి గాలేరు నగరి హంద్రీనీవా అనుసంధానం పేర ఏకంగా 6.5టీఎంసీల నీటిని తన, తన సోదరుని నియోజకవర్గానికి మళ్లించుకున్నారు. అప్పట్లో గాలి ముద్దు కృష్ణమనాయుడు ఎంతో శ్రమించి నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు గాలేరు నగరి రెండవ దశ పథకం ద్వారా సాధించిన దాదాపు 5టీఎంసీల కృష్ణ జలాలకు గండి పెట్టారు.


గాలేరు నగరి రెండవ దశ పథకానికి కేటాయింపులు ఉన్న నీటిని మొత్తంగా మంత్రి పెద్దిరెడ్డి వివాదాస్పదం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గాలేరు నగరి రెండవ దశకు చెంది డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన టెండర్లు అన్నీ రద్దయ్యాయి. రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు పాత కాంట్రాక్టర్లకు బకాయి బిల్లులు చెల్లించలేదు. కొత్తగా టెండర్లు పిలిచే సూచనలు లేవు. మూడు దశాబ్దాలు గడుస్తున్నా ప్రధాన కాలువ అలైన్మెంట్ ఇంకా నిర్ధారణ కాలేదు. జిల్లా తూర్పు ప్రాంతంలోని శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు వైకాపా ఎమ్మెల్యేలు నగదు బదిలీల గోలలో మునిగి తేలుతున్నారు గాని తిరుపతి తిరుమలకు తాగునీరు సరఫరాతో పాటు తమ నియోజకవర్గాలకు సాగునీరు అందించే ఈ పథకం గురించి పట్టించుకున్న జాడ లేదు. ఈ ఎమ్మెల్యేలను పక్కన బెడితే ప్రస్తుతం మంత్రి పదవి చేపట్టిన రోజా తుదకు అడ్డగోలు నీటి కేటాయింపులను అడ్డుకొంటారా? లేక పెద్దిరెడ్డికి దాసోహమంటారా? తేలవలసి వుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన హవా సాగించిన రోజుల్లో ఎమ్మెల్యేగా ఉండిన రోజాను బాగా ఆట పట్టించినట్లు మీడియాలో పుంఖానుపుంఖంగా వార్తలు రావడం అందరికీ తెలుసు. ఇప్పుడు– పైకి ప్రచారం లేకుండా మంత్రి పెద్దిరెడ్డి రోజాకు ఈ విధంగా భారీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు గాని మున్ముందు గాని నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు.


గాలేరు నగరి పథకానికి ఆవిరి పారుదల నష్టం పోగా మిగిలేది 32.995టీఎంసీలు మాత్రమే. ఇందులో కడప జిల్లాకు 22టీఎంసీలు పోగా చిత్తూరు జిల్లాకు 10.722టీఎంసీల కేటాయింపులున్నాయి. కడప జిల్లాకు బొటాబొటీగా కేటాయింపులు సరిపోతాయి. పైగా గాలేరు నగరి పథకం ఒరిజినల్ డిపిఆర్‌లో లేకున్నా వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే గండికోట నీటి నిల్వ సామర్థ్యం 16.484టీఎంసీల నుంచి 26టీఎంసీలకు పెంచి ఎత్తిపోతల ద్వారా తుంగభద్ర ఎగువ కాలువ కింద నికర జలాలు కేటాయింపులు గల ఆయకట్టుకు అదనంగా నీరు ఇస్తున్నారు.


జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒకవైపు గాలేరు నగరి రెండవ దశకు చెందిన టెండర్లను రద్దు చేస్తూ మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా పుంగనూరు తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో 6.5టీఎంసీల సామర్థ్యంతో మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి గాలేరు నగరి హంద్రీనీవా అనుసంధానం పేర పరిపాలన అనుమతులు ఇచ్చారు. దీనితో రెండవ దశ పథకానికి చెందిన నీటి కేటాయింపులకు ఎసరు పెట్టినట్టయింది. అది కూడా కడప జిల్లాలో గాలేరు నగరి ప్రధాన కాలువ నుంచి చక్రాయపేట ఎత్తిపోతల ద్వారా నీరు తరలించి హంద్రీనీవా రెండవ ఫేజ్‌లో గల పుంగనూరు బ్రాంచి కెనాలులో పోసి తదుపరి నిర్మితమయ్యే రిజర్వాయర్లకు తరలించేటట్లు అనుమతులు పొందారు. ఇందులో మరో కొసమెరుపేమిటంటే– ఈ రిజర్వాయర్ల ఆయకట్టు హంద్రీనీవా రెండవ పేజ్ కింద  ఉండటం,  హంద్రీనీవా నుంచి నీటి కేటాయింపులు లేకపోవడం.


రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూలులో పొందుపర్చిన నీటి కేటాయింపులకు మించి గాలేరు నగరి పథకానికి కృష్ణ జలాలు లభ్యమయ్యే అవకాశం లేదు. పైగా అవి కూడా మిగులు జలాలు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం కృష్ణ బోర్డు పరిధి నిర్ణయిస్తూ జారీ చేసిన నోటిఫికేషనులో గాలేరు నగరి పథకాన్ని ఆమోదం పొందనిదిగా పేర్కొన్నారు. దీనికి తోడు డిపిఆర్ ఆమోదానికి పంపమని కేంద్ర జల వనరుల శాఖ కృష్ణ యాజమాన్య బోర్డు ఒత్తిడి చేస్తోంది. మున్ముందు డిపిఆర్ పంపవలసి వస్తే తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిపాలన అనుమతులు పొందిన మూడు రిజర్వాయర్లకు 6.5టీఎంసీలు ఎక్కడ నుంచి తెస్తారు? రెండవ దశకు చెందిన టెండర్లు రద్దయి, ఇంతవరకు వాటి ఊసే లేనందున ఆ కేటాయింపులు పక్కనబెట్టి టెండర్లు జరిగి నిర్మాణం చేపట్టిన (మధ్యలో గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉంది), మంత్రి పెద్దిరెడ్డి పరిపాలన అనుమతులు పొందిన మూడు రిజర్వాయర్లకే కేటాయిస్తారా? అదే జరిగితే మూడు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో ప్రతిపాదితమైన చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతానికి చెందిన గాలేరు నగరి రెండవ దశకు మంగళం పాడినట్లవుతుంది. ఈ నేపథ్యంలో ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందిన, మంత్రిగా ఉన్న రోజా గతంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు సాధించిన కృష్ణ జలాలను వదులుకుంటారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన లోపంతో గాని లేక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని  కాదనలేక గాని కొత్త రిజర్వాయర్లకు పరిపాలన అనుమతి ఇచ్చారనుకున్నా ఇప్పుడు జిల్లాల విభజన జరిగినందున మున్ముందు గాలేరు నగరి రెండవ దశ నీటి కేటాయింపులు జిల్లాల మధ్య చిచ్చు రగిలే అవకాశాలు లేకపోలేదు. కాగా ఈ మూడు రిజర్వాయర్లకు హంద్రీనీవా నుండే నీటి కేటాయింపులు చేసి అనుమతి ఇచ్చి ఉంటే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చైతన్యం గల అనంతపురం, కర్నూలు జిల్లాల వారు ఈ పాటికే ధర్నాలకు దిగి ఉండేవారు. ఈ ప్రమాదం గ్రహించే సాగునీటి ప్రాజెక్టుల అంశంలో చైతన్యం కాదు కదా తుదకు అవగాహన లేని చిత్తూరు జిల్లాకే అందరూ కలసి స్పాట్ పెట్టారు.


ఇదిలా ఉండగా గాలేరు నగరి రెండవ దశ పథకం పరిశీలిస్తే వైయస్ రాజశేఖర రెడ్డి 2006 జూన్ 4వ తేదీన నగరి వద్ద పునాది రాయి వేశారు. విశేషమేమంటే మూడు దశాబ్దాల చరిత్రలో ఈ పథకానికి ఇది మూడవ మారు పునాది రాయి పడటం. ఈ సందర్భంలో రాష్ట్ర జల వనరుల శాఖ గాలేరు నగరి పథకం నీటి కేటాయింపులను అధికారికంగా ప్రకటించింది. కడప జిల్లాకు 22.183టీఎంసీలు చిత్తూరు జిల్లాకు 10.772టీఎంసీల నీటి కేటాయింపులు చూపారు. చిత్తూరు జిల్లాకు చెంది గాలేరు నగరి రెండవ దశలో భాగంగా బాలాజీ రిజర్వాయర్ (3.000 టియంసిలు) మల్లిమడుగు (2.650) పద్మ సాగర్ (0.450) శ్రీనివాస సాగర్ (0.448) వేణుగోపాల్ సాగర్ (2.683) వేపగుంట (0.553) అడవి కొత్తూరు (0.800)టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించబడ్డాయి. బాలాజీ రిజర్వాయరు నుంచి ఒక టీఎంసీ నీరు తిరుపతి తిరుమల తాగునీటికి పోగా రెండు టీఎంసీలను మల్లిమడుగుకు సరఫరా చేస్తారు. అక్కడ నుంచి మొదలయ్యే 61కిలోమీటర్ల కైలాసగిరి కెనాల్ కాళంగి జలాశయం మీదుగా ఆరణియార్ రిజర్వాయర్ వద్ద ముగుస్తుంది. ఈ పథకం ద్వారా చిత్తూరు జిల్లాలో తిరుపతి రూరల్ రేణిగుంట ఏర్పేడు శ్రీకాళహస్తి కెవిబి పురం పిచ్చాటూరు నాగలాపురం నిండ్ర రామచంద్రాపురం వడమాలపేట పుత్తూరు నారాయణ వనం నగరి విజయపురం మండలాల్లో లక్షా 3 వేల 500 ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందుతుంది. ఒక్క నగరి నియోజకవర్గంలోనే మొత్తం మండలాలకు నీటి సరఫరా ఉంటుంది. ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా నగరి నియోజకవర్గానికి దాదాపు అయిదు టీఎంసీల నీరు సరఫరా జరుగుతుంది. మిగిలిన అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువగా 43 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.


వేణుగోపాల్ సాగర్ (2.683), వేపగుంట (0.533), అడవి కొత్తూరు (0.800) పూర్తిగా మూడు రిజర్వాయర్లు నగరి నియోజకవర్గంలో నిర్మింపబడతాయి. పాక్షికంగా శ్రీనివాస సాగర్ నుంచి నీరు అందుతుంది. గాలేరు నగరి రెండవ దశ పథకం తుది డిపిఆర్ తయారు చేసే సమయంలో అప్పట్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు చొరవ తీసుకొని ప్రతిపాదిత మొత్తం ఆయకట్టులో సింహ భాగం నగరి నియోజకవర్గానికి లభించే విధంగా కృషి చేశారు. ప్రస్తుతం నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా మంత్రిగా ఉండి కూడా ఇప్పుడు ఏం చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది.


వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2022-06-07T06:27:19+05:30 IST