కరోనాతో పోలీసులు, వైద్యులు మృతి చెందడం బాధాకరం : పవన్

ABN , First Publish Date - 2020-07-16T23:40:36+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో నిత్యం పోరాడుతున్న పోలీసు అధికారులు, వైద్యులు మృతి చెందడం

కరోనాతో పోలీసులు, వైద్యులు మృతి చెందడం బాధాకరం : పవన్

అమరావతి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో నిత్యం పోరాడుతున్న పోలీసు అధికారులు, వైద్యులు మృతి చెందడం బాధాకరంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నవారిలో కొందరు ఆ మహమ్మారి కాటుకు బలైపోతుండడం చాలా బాధగా అనిపిస్తోందని ఆయన ఆవేదనకు లోనయ్యారు. వైద్యం, పారిశుద్ధ్య, పోలీసు శాఖలకు చెందిన వారు మృతి చెందడం మనసు కలచివేసే విషాదమని పవన్ అన్నారు. నిన్న, మొన్న తిరుపతి, అనంతపురం నగరాల్లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లుగా పని చేస్తున్న ఇద్దరు అధికారులు కోవిడ్ బారినపడి మరణించడం దురదృష్టకరమన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో సీనియర్ వైద్యాధికారితోపాటు, రాష్ట్రంలో ముగ్గురు యువ వైద్య విద్యార్థులు ఈ మహమ్మారి బారినపడి కన్నుమూయడం దిగ్భ్రాంతికరమని పవన్ వ్యాఖ్యానించారు.


అది మాటలకందని విషాదం!

కోవిడ్ నిబంధనల కారణంగా మృతి చెందిన వారి పేర్లతో నివాళి అర్పించలేని నిస్సహాయ స్థితి మనది. డిపార్టుమెంట్‌లో మంచి పేరు పొంది, ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ ఇద్దరు పోలీస్ అధికారులు అకాల మరణం చెందడం మాటలకు అందని విషాదం. క్షేత్ర స్థాయిలో పని చేసే ప్రతి ఒక్కరు ఏమాత్రం ఏమరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి అజాగ్రత్త చోటు చేసుకున్నా విలువైన ప్రాణాలను హరించివేస్తుంది. పై స్థాయి అధికారులు సైతం తమ సిబ్బంది ఆరోగ్య భద్రతా విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకోవలసి వుంది. పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు సిబ్బందికి అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఉదారంగా నష్టపరిహారం అందించాలి. పోయిన మనిషిని ఎలానూ తెచ్చి ఇవ్వలేం గనుక కనీసం వారి కుటుంబాలకు వారు లేని లోటు తీర్చవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విధి నిర్వహణలో అశువులు బాసిన ఇరువురు పోలీస్ అధికారులకు, వైద్యులకు నా తరపున, జనసేన పార్టీ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2020-07-16T23:40:36+05:30 IST