పేటెంట్లు కాదు, పేషెంట్లు ముఖ్యం...!

ABN , First Publish Date - 2021-06-18T06:03:58+05:30 IST

కరోనా మొదటి వేవ్‍తోనే విలవిల్లాడిన ప్రజలు రెండవ వేవ్‌ను తట్టుకోలేకపోయారు. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ దొరక్క, మందులు లభ్యం కాక, అన్నింటికంటే ముఖ్యంగా వైద్య ఖర్చులు...

పేటెంట్లు కాదు, పేషెంట్లు ముఖ్యం...!

కరోనా మొదటి వేవ్‍తోనే విలవిల్లాడిన ప్రజలు రెండవ వేవ్‌ను తట్టుకోలేకపోయారు. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ దొరక్క, మందులు లభ్యం కాక, అన్నింటికంటే ముఖ్యంగా వైద్య ఖర్చులు భరించలేక సగం చచ్చిపోతున్నారు. తెలుగు ప్రజలు త్యాగంతో సాధించుకున్న వైజాగ్ స్టీలు ప్లాంటు ఆక్సిజన్ ఇచ్చి అనేక రాష్ట్రాల్లోని ప్రజల ప్రాణాలను నిలిపింది. సమాజ శ్రేయస్సు కోరేది ప్రభుత్వ సంస్థలే. ప్రభుత్వ మందుల కంపెనీ ఐడిపిఎల్ నేడు ఉండుంటే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ అతి తక్కువ ధరకు లభ్యమయ్యేది. 


డబ్ల్యూటీఓ నిబంధనలను తయారుచేసేటపుడు తెలిసో తెలియకో ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. దాని ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్ ఇవ్వటానికి అవకాశం ఉన్నది. 1970 పేటెంటు చట్టం సెక్షన్ 84 ప్రకారం ఒక మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, లేదా స్థానిక మార్కెట్‌లో ఆ మందు అందుబాటులో లేకపోతే- పేటెంటు అధికారి స్థానిక ఉత్పత్తిదారునికి తప్పనిసరి లైసెన్సు ఇవ్వవచ్చు. తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించి, పేటెంటు చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. కానీ శక్తివంతమైన, దుర్మార్గమైన బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు ఎదురొడ్డి నిలిచేదెవరు? కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చునని చట్టంలో ఉంది. పరిశోధన ఖర్చులకు పేటెంటు కంపెనీకి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో ఉంది. మార్చ్ 2012న ఇండియన్ పేటెంట్ ఆఫీసర్  పిహెచ్ కురియన్ ఈ అంశంలో ధైర్యంగా ప్రజలకు అనుకూలంగా తీర్పును ఇచ్చారు. మొదటిసారీ ఆఖరుసారీ ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్ ఆర్డర్‌ను ఇచ్చి కురియన్ చరిత్రలో నిలిచారు. భారతదేశంలో నెలకు సరిపోయే నెక్సావార్ మందును రూ.8800కు అమ్మేటట్లుగానూ బేయర్ కంపెనీకి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగానూ ఇండియన్ పేటెంట్ యాక్ట్ కింద పేటెంట్ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది. యాభై ఏళ్ళ పేటెంటు చట్టం చరిత్రలో ప్రజల మేలుకోసం ఇచ్చిన తీర్పు ఇదే. సోరాఫెనిబ్ (బ్రాండ్ నేమ్: నెక్సావార్) అనే లివర్, కిడ్నీ, కేన్సర్ మందును బేయర్ కంపెనీ మన దేశంలో అమ్ముతున్నది. 1970 పేటెంట్ చట్టం ప్రకారం అందుకు ఆ కంపెనీకి హక్కులున్నాయి. ఆ కేన్సర్ మందును వేరెవరూ తయారు చేయకూడదు, అమ్మకూడదు. నెలకు సరిపోయే ఆ మందును ఆ కంపెనీ రూ.2లక్షల80వేలకు అమ్ముతున్నది. ఇలా ఎన్నో కంపెనీలు పేటెంట్ పేరున ప్రజలను పీక్కు తింటున్నాయి. ఈ కంపెనీలు తమ పరిశోధనలకు అయిన ఖర్చును ఒకటి రెండేళ్ళలోనే వసూలు చేసుకోగలవు. కానీ మందు తయారీ ఖర్చుకు కొన్ని వేల రెట్లు అధికంగా ఇరవయ్యేళ్ళ పాటు రాబడిని గుంజుతున్నాయి. అత్యవసర పరిస్థితులలో కంపల్సరీ లైసెన్సు ఇవ్వవచ్చునని కురియన్ చేసి చూపించారు. కరోనా మహమ్మారిని మించి అత్యవసర పరిస్థితి ఏమున్నది? ప్రభుత్వం, మందుల కంపెనీలు కంపల్సరీ లైసెన్సును తీసుకోవచ్చు కదా? రెమ్‌డెసివిర్ మందును, కొవాక్సిన్, కొవిషీల్డ్ టీకాలను కంపల్సరీ లైసెన్సు కిందకు తీసుకురావచ్చు కదా? 


సోవియట్ సోషలిస్టు ప్రభుత్వం ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చి ప్రపంచానికి ఆదర్శమయింది. ‘లుముంబా’ యూనివర్సిటీని స్థాపించి పేద దేశాల విద్యార్థులను వైద్యులుగా తీర్చిదిద్దింది. లాటిన్ అమెరికన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ను క్యూబా 1999లో స్థాపించింది. ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యం తన ధ్యేయంగా ఎక్కడ వైద్య కార్యకర్తలు అవసరమైతే అక్కడికి వారిని పంపుతున్నది. క్యూబా లాంటి సోషలిస్ట్ దేశాల్లో పరిశోధనలకు ప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది. క్యూబాలోని హవానాలో ఫినిలే ఇనిస్టిట్యూట్‌ ఐదు కరోనా టీకాల అభివృద్ధిలో పురోగతిని సాధించింది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు ఈ టీకాల పట్ల ఆసక్తి చూపుతూ లక్షలాది డోసులకు ఆర్డర్లు ఇస్తున్నాయి. ఇలా చిన్న దేశమైన క్యూబా తన ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూ ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నది. అమెరికా ఆంక్షల వలన క్యూబా ఆదాయం పూర్తిగా పడిపోయింది. అయినా ప్రజల ప్రాణాలను కాపాడటంలో క్యూబా ముందుంది. ‘‘ప్రపంచంలోని అత్యంత ధనవంతుని ఆస్తి కన్నా మానవుని ప్రాణం విలువైనది’’ అని క్యూబా వైద్య విధానాన్ని రూపొందించిన చేగువేరా అన్నారు. ఇలా ప్రజల కోసం ప్రాణాలిచ్చే నాయకులు, సైంటిస్టులు ప్రపంచానికి కావాలి. 


వేలాదిమంది పసిపిల్లలను పక్షవాతానికి గురిచేసే పోలియో జబ్బుకి డాక్టర్ జోనాస్ సాల్క్ 1955లో మందు కనుగొన్నారు. ఆయన తన పరిశోధనకు పేటెంటు అడగలేదు. ఒక పత్రికా విలేఖరి ఆయనను ‘పోలియో టీకాపై పేటెంటు ఎవరిది?’ అని అడిగితే ప్రజలది అని సాల్క్‌ చెబుతూ, సూర్యుడిని పేటెంటు చేయగలమా అన్నారు. ఇలాంటి స్ఫూర్తి నేడు కావాలి. పేటెంటు పేరున ప్రజల ప్రాణాలు తీస్తున్న కార్పొరేట్ మందుల కంపెనీలు లేని వ్యవస్థ కావాలి. అటువంటి వ్యవస్థ లేనపుడు పేటెంటు చట్టంలో ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలి. కంపల్సరీ లైసెన్సుకు అనుమతి ఇవ్వాలి. అందరికీ ఆరోగ్యం (యూనివర్సల్ హెల్త్) సిద్ధాంతాన్ని ఆచరించే దేశాలే నేడు కరోనా కట్టడిలో ముందున్నాయి. వన్య జీవుల నుంచి మానవులకు సంక్రమిస్తున్న జూనోటిక్ వ్యాధులన్నిటి వెనకా ఒకే కారణం ఉంది. లాభం తప్ప మరే విలువా లేని పెట్టుబడిదారీ వ్యవస్థలో భూమాత ముడిపదార్థాల గనిగా మారింది. మనుషులు వినియోగదారులుగా మారారు. ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పొరేట్ పెద్దలు ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు, టీకా రాగానే కొనుక్కోగలరు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలకే ప్రమాదమంతా. కరోనాని దీటుగా ఎదుర్కోవాలంటే తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, టీకాలను కంపల్సరీ లైసెన్సు కిందకు తేవాలి.

డా. కొల్లా రాజమోహన్

Updated Date - 2021-06-18T06:03:58+05:30 IST