క్రికెట్‌ కోసం..కాల్‌ లెటర్‌ చించేశా

ABN , First Publish Date - 2020-04-12T10:06:11+05:30 IST

పాండ్యా బ్రదర్స్‌..క్రునాల్‌, హార్దిక్‌ కొద్దికాలంలోనే క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు. మేటి క్రికెటర్లుగా మారడానికి ముందు ఆ ...

క్రికెట్‌ కోసం..కాల్‌ లెటర్‌ చించేశా

ముంబై: పాండ్యా బ్రదర్స్‌..క్రునాల్‌, హార్దిక్‌ కొద్దికాలంలోనే క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు. మేటి క్రికెటర్లుగా మారడానికి ముందు ఆ అన్నదమ్ములు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు ఎన్నో. అయితే క్రికెటర్లు కావాలన్న తమ కలను నిజం చేసుకొనేందుకు వారు వాటిని లెక్క చేయలేదు. ఈక్రమంలో తనకు వచ్చిన ప్రభుత్వోద్యోగ కాల్‌ లెటర్‌ను చించివేసిన ఉదంతాన్ని క్రునాల్‌ పాండ్యా గుర్తు చేసుకున్నాడు. ‘కొద్ది సంవత్సరాలు వెనక్కు వెళితే..స్పీడ్‌ పోస్ట్‌ ఉద్యోగానికి నాకు కాల్‌ లెటర్‌ వచ్చింది. నెలకు రూ. 15 వేలనుంచి 20 వేలు వస్తాయి. మంచి  ఉద్యోగం వదులుకోకు అని నాన్న చెప్పాడు. ఇంటర్వ్యూ రోజునే బరోడా జట్టుకు ముస్తాక్‌ అలీ ట్రోఫీకి ఎంపికలకు నేను హాజరుకావాల్సి ఉంది. నాలో అంతర్మథనం మొదలైంది.. ప్రభుత్వోద్యోగమా, క్రికెటా అని. క్రికెటర్‌ అవడంకోసం అహరహరం శ్రమించా.


కానీ స్పీడ్‌ పోస్ట్‌ జాబ్‌ కోసం నేను కష్టపడలేదు. రాష్ట్ర జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం లభించే అవకాశం వచ్చింది. దాంతో క్రికెటర్‌గానే స్థిరపడాలని నిర్ణయించుకొని కాల్‌ లెటర్‌ చించేశా’ అని వివరించాడు. ‘ఎంపికలకు వెళ్లడమేకాదు అక్కడ సత్తా చాటి బరోడా జట్టులోనూ చోటు సంపాదించా. హార్దిక్‌ అప్పటికే ఆ జట్టులో ఉన్నాడు’ అని తెలిపాడు. ఇక.. తమలో ప్రతిభను పసిగట్టి సానబెట్టింది ముంబై ఇండియన్స్‌ మాజీ కోచ్‌ జాన్‌ రైట్‌ అని క్రునాల్‌ వెల్లడించాడు. ‘మాకు బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ సత్తా ఉందని రైట్‌ గ్రహించి ప్రోత్సహించాడు. అలా మా నైపుణ్యం మరింత మెరుగుపడింది. ఆ రోజు నేను ఆ లెటర్‌ను చింపివేయకుంటే క్రికెటర్‌ను అయ్యేవాడినికాదు. మా జీవితాలు కూడా భిన్నంగా ఉండేవి’ అని  క్రునాల్‌ వివరించాడు. 

Updated Date - 2020-04-12T10:06:11+05:30 IST