టీఆర్‌ఎస్‌లోకి పల్లె రవికుమార్‌ దంపతులు

ABN , First Publish Date - 2022-10-16T08:03:18+05:30 IST

నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ నేత పల్లె రవికుమార్‌ గౌడ్‌ దంపతులు టీఆర్‌ఎ్‌సలో చేరారు.

టీఆర్‌ఎస్‌లోకి పల్లె రవికుమార్‌ దంపతులు

  • కేటీఆర్‌ సమక్షంలో చేరిక..‘గులాబీ’ వ్యూహాత్మక ఎత్తుగడ
  • నష్ట నివారణలో టీఆర్‌ఎస్‌.. గౌడ నేతల చేరికకు ప్రోత్సాహం

హైదరాబాద్‌/నల్లగొండ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ నేత పల్లె రవికుమార్‌ గౌడ్‌ దంపతులు టీఆర్‌ఎ్‌సలో చేరారు. శనివారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు. రవికుమార్‌ గౌడ్‌ భార్య కల్యాణి చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఉద్యమకాలం నుంచి తమతో కలిసి పనిచేసిన రవికుమార్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ అన్నారు. కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపునకు టీఆర్‌ఎ్‌సలో చేరేందుకు ముందుకొచ్చినందుకు పల్లె రవికి ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు భవిష్యత్తులో మరిన్ని మంచి రాజకీయ అవకాశాలు పార్టీ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. పల్లె రవికుమార్‌ మాట్లాడుతూ.. చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్‌కి తెలియజేశానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.


మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ టీఆర్‌ఎ్‌సను వీడటంతో ఆ పార్టీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా.. పల్లె రవికుమార్‌ దంపతులను చేర్చుకున్నట్లు స్పష్టమవుతోంది. బూర నర్సయ్య పార్టీని వీడటం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తీవ్ర ప్రభావం చూపుతుందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో అత్యఽధికంగా 37,144 వేల ఓట్లు ఉన్న గౌడ సామాజిక వర్గంలో కనీసంగా 6వేల ఓట్లపై ప్రభావం ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో గౌడ సామాజికవర్గం నుంచి నష్ట నివారణకు ప్రగతి భవన్‌ నుంచి ఆపరేషన్‌ ప్రారంభించారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో సాన్నిహిత్యం ఉన్న పల్లె రవికుమార్‌గౌడ్‌ కుటుంబాన్ని టీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షించారు. మరోవైపు.. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కాషాయం గూటికి చేరారని సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారమైంది. శనివారం కర్నె సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో పుకార్లకు బలం చేకూరింది. అయితే, పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రకటనలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఖండించారు.

Updated Date - 2022-10-16T08:03:18+05:30 IST