పాలమూరు ‘మానవతా పతాక’

ABN , First Publish Date - 2022-03-10T07:26:21+05:30 IST

పిల్లల హృదయాలలోకి లేలేత మనసుతో ఎవరు చొచ్చుకుపోగలరో, అట్లా చొచ్చుకుపోయి వాళ్లని తేజోవంతం చేయగలరో వాళ్లు విద్యార్థులను గెలుచుకోగలుగుతారు....

పాలమూరు ‘మానవతా పతాక’

పిల్లల హృదయాలలోకి లేలేత మనసుతో ఎవరు చొచ్చుకుపోగలరో, అట్లా చొచ్చుకుపోయి వాళ్లని తేజోవంతం చేయగలరో వాళ్లు విద్యార్థులను గెలుచుకోగలుగుతారు. ముప్పై ఏడు సంవత్సరాల సుదీర్ఘకాలం విద్యార్థులలో విద్యార్థిగా, తోటి ఉపాధ్యాయులను ఆలోచింపజేసిన ఉపాధ్యాయుడుగా, ప్రజాస్వామికవాదుల మధ్య కొత్త ప్రపంచపు కలల్ని సరికొత్తగా చర్చకు తెచ్చే తాత్వికుడుగా ఎందరెందరి హృదయాలనో చూరగొన్న ఉదాత్త మానవుడు సి. రామ్మోహన్‌. క్యాన్సర్ వ్యాధి తీవ్రమై మార్చి 8 ఉదయం ఆయన మరణించారు.


చుక్కంబొట్ల సుభద్రమ్మ–కృష్ణయ్యల పదకొండు మంది సంతానంలో రామ్మోహన్‌ నాలుగోబిడ్డడు. తండ్రి భూస్వామి, తల్లి కదిరేపాడు (గోపాల్‌పేట సంస్థానంలో ఉంది) మఖ్తేదారు బిడ్డ. రామ్మోహన్‌ బాల్యం కదిరెపాడు, గంట్రావుపల్లి, సాతాపూర్‌లలో గడిచింది. పిల్లలందరినీ చదివించాలనే సుభద్రమ్మగారి పట్టుదలవల్ల రామ్మోహన్‌ బడి చదువు ఎక్కువగా వనపర్తి, కొల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌లలో సాగింది. చిన్న వయసులో మా రామ్మోహన్‌ చాలా తుంటరి. ‘ఇంత ఓపిక ఎట్ల వచ్చిందో నాయినా ఇరవై ఐదు మంది కుటుంబాన్ని నడుపుతున్నడని’ ఆయన తల్లి ఎంతో గౌరవంతో చెప్పేది. పాలెం గ్రామంలో హాస్టల్‌లో ఉండి పియుసి చదువుకుంటు రెండో సంవత్సరం ఫీజులకు డబ్బులేక మధ్యలోనే మానేశాడు. కదిరెపాడులో ఎయిడెడ్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా జీవితం ప్రారంభించాడు. జీవితం అర్థమైతే ఎవరూ తుంటరివాళ్లు కారనే స్వానుభవంతో తెలుసుకున్న రామ్మోహన్‌ తన విద్యార్థులకు జీవితం అర్థం చేయించే పనిలోకి దిగాడు. అప్పటికే గోపాల్‌పేట, వనపర్తి, కొల్లాపూర్‌ సంస్థానాల ప్రజాజీవితం, కొనా పాలమూరు పక్కన ఉన్న గాంధీరోడ్‌ స్కూల్‌ చదువుతో పట్టణ ప్రజల పేదరికం, పాలెం హాస్టల్‌ జీవితం చూసి, అనుభవించి ఉన్నాడు గనుక, నాగార్జునసాగర్‌, తుంగభద్ర, శ్రీశైలం, తదితర భారీ ప్రాజెక్టులు, రైలు దారులు, దేశమంతటా భారీ నిర్మాణాలకు ‘దేశం’ పోయే మట్టిమనుషుల దుఃఖం రోజూ చూస్తున్నాడు గనుక అతని పాఠాలు బడి పిల్లలను కదిలించేవి. రామ్మోహన్‌ జీవితం తుంటరిగా మొదలైందని అమ్మ చెప్పింది కానీ ఆయన బాల్యం వీడే జీవితం ఉద్యమాలతో మొదలైంది. 1969 తొలి తెలంగాణ సాధన పోరాటంలో క్రియాశీల కార్యకర్తగా, ఆలోచనాపరుడుగా గొప్ప నాయకత్వ స్ఫూర్తిని అందించాడని ఆనాటి అతని మిత్రులు అడ్వొకేట్‌ వేణుగోపాల్‌, ముత్యాల ప్రకాశ్‌ గుర్తుచేసుకుంటారు. ఉపాధ్యాయుడుగా రాష్ట్రోపాధ్యాయ సంఘంలో పనిచేస్తు అప్పటికే చాలా క్రియాశీలకంగా ఉండిన విపి రాఘవాచారి, ఎ. శ్యాంసుందర్‌రావు, వి. సుజీవన్‌రావు తదితరుల నిరాడంబర జీవితం, వాళ్లు పాటించే విలువలు సొంతం చేసుకున్నాడు. పొద్దస్తమానం మాట్లాడుతూ గడిపిన జీవితం రామ్మోహన్‌ది. ‘రాఘవా! ఇక ఈ మనిషి మాటలుడిగిపోతున్నాయి మరి కొద్దిసేపు కూర్చుని వినమని– ఫిబ్రవరి 27న ఉదయ్‌, వామన్‌, జనజ్వాల, నేనూ మహబూబ్‌నగర్‌ నుండి వచ్చి కలిసినపుడు– అంటే దుఃఖం ఆగలేదు. ఎ. రాజేంద్రబాబుతో 1969లో మొదలైన స్నేహం గాఢమైంది. ఆయన సంపాదకత్వం వహించి తెచ్చిన మార్పు, తీర్పు వంటి పత్రికలు వెలుగుచూడటంతో రామ్మోహన్‌ కృషి ఉంది. ఆ పత్రికలకు వేరు వేరు పేర్లతో రాసేవాడు. విప్లవ అనివార్యతను గుర్తించి అత్యవసర పరిస్థితి తరువాతి రోజుల్లో విరసంలో చేరి కార్యవర్గ బాధ్యతలు చేపట్టి నాయకత్వం అందించాడు. రాష్ట్రమంతటా అనేక సభలు అతని శ్రావ్యమైన కంఠంతో తాదాత్మ్యమయ్యేవి. జ్వాలాముఖి, కాశీపతి లాగా మాట్లాడేవాడు అనిపించేది. వరవరరావు వలె విషయజ్ఞానంతో చైతన్యాన్ని వెలిగించే ప్రసంగాలు నేను చేయగలనా అనేవాడు. శాస్త్రీయ భావజాల వ్యాప్తి కోసం, సమకాలీన విషయాలపై చర్చ కోసం న్యూథింకర్స్‌ ఫోరం ఏర్పరచటంలో తనది ముఖ్యపాత్ర. ఎపిటిఎఫ్‌ను తెలంగాణలో ఏర్పరచటంలో ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ నిర్మాణ విస్తరణలో ఆయన కృషి మరువలేనిది. సాంతిక విషయాలు వదిలేస్తే ఆయన విరసం సభ్యుడు. ఈనాటికీ ఆయన మనసు విరసంతో, విప్లవ రాజకీయాలతోనే. ఆయన ఆదర్శాలకనుగుణంగా చాలా గౌరవంతో అతని తమ్ముళ్లు, అక్కలు, చెల్లెండ్లు, కొడుకులు, బంధుమిత్రులు, మనుమలు, మనుమరాండ్ల దాకా అందరూ కలిసి విప్లవ, ప్రజాస్వామిక పద్ధతిలో చివరి వీడ్కోలు పలికారు.


తొంభై రూపాయల వేతనంతో అతని జీవితం, ఇంటి పెద్దరికం మొదలైంది. జీతాలు కాస్తో కూస్తో పెరుగుతూండే కాలానికి 2006లో అతను రిటైరయ్యాడు. అతని జీవితం సంతోషాల ప్రపంచం వైపు కదిలిన దుఃఖనావ. అయినా చిరునవ్వుతో ఎందరినో ఆ నావలో కదిలించాడు. ఓపిక, ప్రేమ నిండిన జీవన సహచరి భారతమ్మ 2003లో క్యాన్సర్‌తో మరణించింది. ఇంటాబయటా అనేక వత్తిడుల మధ్య అందరికీ స్నేహం, కరుణ పంచుతూ రామ్మోహన్‌ విప్లవంతో విప్లవ మిత్రులతో కలిసి అడుగులేశాడు. దళిత సమస్యలపై, మతం మతతత్వవాదమైన దుర్మార్గంపై రాశాడు. మేం తనతో ఈ అన్ని సంఘాలతో పాటు కరువు వ్యతిరేక పోరాట కమిటీలో ప్రస్తుతం పాలమూరు అధ్యయన వేదికలో కలిసి పనిచేస్తున్నాం. అరుణోదయతో కలిసి నడుస్తూ ముందుమాటలు పలికాడు. విమోచన మిత్రులతో కలిసి నడిచాడు. మరసం సహచరుడు. బాలగోపాల్‌, కన్నాభిరాన్‌, బొజ్జా తారకం, జయశంకర్‌ ఆయన ఇష్ట మిత్రులు, ప్రేరణ. హరగోపాల్‌, వరవరరావు, శివారెడ్డి వంటివారే కాక భవిష్యత్తు కోసం ప్రాణాలిచ్చిన ఎందరో అమరులు జీవించిన కాలంలో జీవించాను. నా జీవితం సఫలమైందని సంతృప్తి ప్రకటించి క్యాన్సర్‌తో పోరాడుతూ జీవితాన్ని జయించాడు. ఆయన సాహచర్యంతో స్నేహంతో ఎంతో నేర్చుకున్నాం.


‘నరుడు నరుడవుట దుష్కరము సుమ్ము’ అన్న దాశరథి వాక్కులు రామ్మోహన్‌కు మినహాయింపు. ఆ దుష్కర, దుస్తర సమస్యను అతను అధిగమించాడు. నరుడయ్యాడు. శ్రీశ్రీ, చెరబండరాజుల అమరత్వం తరువాత మేం కలిసి జరిపిన సభలలో ఆవేదన, ఆగ్రహమూ కలిపి తాను చేసిన ఉపన్యాసాలు మా చెవుల్లో మోగుతున్నాయి. లోతైన అధ్యయనంతో గద్వాల విరసం సభలో ఆయన చేసిన ఉపన్యాసం రాష్ట్రమంతటా ఆయనకు అభిమానుల్ని అందించింది. విధ్వంసమైన పాలమూరు లేబర్‌ జీవితం ఎంత నెత్తురూ చెమటా ఒడిపిందో ఎవరు ఆ నెత్తుటి కూటితో బలిసిపోయారో నగ్నంగా ప్రపంచం ముందు పెట్టిన రాజకీయార్థిక విద్యార్థి మాత్రమే కాదు. తొలి ఉపాధ్యాయుడు కూడా రామ్మోహన్. మేం అతని జీవితం రాయమన్నాం. క్యాన్సర్‌ రాకముందు ఆయన సమ్మతించలేదు. క్యాన్సర్‌ వచ్చిన తరువాత ఆయనకు అనిపించినా అది ఆయనకు సమయం ఇవ్వలేదు. మేమే పూనుకుని మిత్రులతో అనుబంధం రాయించాం. చాలా ప్రయత్నంతో ఆయన రచనలూ సేకరించి ఒక దగ్గర కూర్చి ‘మానవతా పతాక’ పేరున ముందురోజే తన ప్రియమిత్రుడు సత్యంతో అతని ఒడిలోకి చేర్చాం. ఆయనకు తెలుసు మేం పుస్తకం తెస్తున్నామని. ఈ పుస్తకం తెచ్చే చర్చ మొదలైన ఈ కొద్ది రోజులలో ఎందరో తనను చూశారు. మాట్లాడారు. అక్కున చేర్చుకున్నారు. ఆయనకు తెలియనిదల్లా ఆయన విద్యార్థులు, మిత్రులు, సహచరులు, బంధువులు పెద్ద పెట్టున పాల్గొని చివరి వీడ్కోలు పలికారని. ఆయనను ప్రకృతి ఒడిలో సంలీనం చేసి ఆయన ఆదర్శాలను స్వప్నాలను కాపాడతామని, పరివ్యాప్తం చేస్తామని ప్రతిజ్ఞ చేశారని, తల్లి కోడికి దూరమైన పిల్లల్లాగా దుఃఖంతో విలవిలలాడారని. రామ్మోహన్‌ వంటి మనుషులు సమాజపు అవసరం. సమాజం రామ్మోహన్‌ జ్ఞాపకాలతో ప్రేరణ తీసుకుంటుంది. ఆయన తన శరీరమ్మీద ఎర్రజెండా కప్పమన్నాడు. ఎర్రజెండా రెపరెపల్లో విప్లవగీతాల్లో రామ్మోహన్‌ జ్వలిస్తూనే వుంటాడు.

ఎం. రాఘవాచారి

పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - 2022-03-10T07:26:21+05:30 IST