పద్మవిభూషణ్‌ బాలు

ABN , First Publish Date - 2021-01-26T08:19:37+05:30 IST

తెలుగు జాతి గర్వించదగ్గ గాన గంధర్వుడు, వివిధ భాషల్లో 40వేల పాటలకు పైగా ఆలపించిన సంగీతకారుడు..

పద్మవిభూషణ్‌ బాలు

  • గాయని చిత్రకు పద్మభూషణ్‌
  • పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • మొత్తం ఐదుగురు తెలుగువారికి పద్మాలు
  • రాష్ట్రానికి చెందిన ముగ్గురికి పద్మశ్రీ
  • సంగీత విద్వాంసులు రామస్వామి, సుమతి,
  • పద్యకవి ఆశావాది ప్రకాశరావులకు గౌరవం
  • తెలంగాణ గుస్సాడీ కళాకారుడు కనకరాజుకూ 
  • ఎస్పీ బాలుకు తమిళనాడు కోటాలో పురస్కారం
  • పాసవాన్‌, కేశూభాయ్‌, తరుణ్‌గొగోయ్‌లకు 
  • మరణానంతరం పద్మభూషణ్‌ ప్రకటించిన కేంద్రం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తెలుగు జాతి గర్వించదగ్గ గాన గంధర్వుడు, వివిధ భాషల్లో 40వేల పాటలకు పైగా ఆలపించిన సంగీతకారుడు.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యానికి దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌ లభించింది. గానకోకిల చిత్రకు పద్మభూషణ్‌ లభించింది. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2021కిగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, సామాజిక సేవ.. ఇలా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 120 మంది ప్రముఖులకు 119  పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 120 మందిలో ఏడుగురికి పద్మవిభూషణ్‌.. పది మందికి పద్మభూషణ్‌, 103 మందికి పద్మశ్రీ ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన ఇద్దరు కళాకారులకు కలిపి ఒకటే పద్మశ్రీ పురస్కారం ప్రకటించినందున మొత్తం అవార్డులు 119 అయ్యాయి. కాగా, ఈ జాబితాలో మొత్తం 29 మంది మహిళలు కాగా.. 10 మంది విదేశీయులు/ప్రవాస భారతీయులు/భారత మూలాలున్న వ్యక్తులు/ఓవర్సీస్‌ సిటిజన్‌షి్‌ప ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కేటగిరీవారు. ఒకరు ట్రాన్స్‌జెండర్‌. బాలు, పాసవాన్‌ సహా 16 మందికి మరణానంతర పురస్కారాలు ప్రకటించారు. పద్మవిభూషణ్‌ పురస్కారాలు లభించిన వారిలో బాలుతోపాటు.. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే, వైద్య రంగంలో సేవలందించిన బెల్లె మోనప్ప హెగ్డే, నరీందర్‌ సింగ్‌ కపనీ (మరణానంతరం), మౌలానా వహీదుద్దీన్‌ ఖాన్‌ (ఆధ్యాత్మికం), బీబీ లాల్‌ (ఆర్కియాలజీ), సుదర్శన్‌ సాహు (ఆర్ట్‌) ఉన్నారు.


పద్మభూషణ్‌ లభించిన 10 మందిలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ (మరణానంతరం), కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ (మరణానంతరం), గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయి పటేల్‌ (మరణానంతరం), మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ప్రధానమంత్రి కార్యాలయంలో గత ఏడాది వరకూ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా తదితరులు ఉన్నారు. 


తెలుగు పద్మాలు..

పద్మశ్రీ పురస్కారాలు లభించిన 103 మందిలో నలుగురు తెలుగువారున్నారు. వారిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వాయులీన విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతీ రామమోహనరావు, అనంతపురానికి చెందిన సాహితీవేత్త, విద్యావేత్త ఆశావాది ప్రకాశ్‌రావు కాగా.. మరొకరు తెలంగాణకు చెందిన చిత్రకారుడు కనకరాజు. సాహితీప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుగ్రంథ రచయితగా, కవిగా, అవధానిగా రాణిస్తున్న ఆశావాది ప్రకాశరావు కీర్తికిరీటంలో తాజా కలికితురాయి పద్మశ్రీ. అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన ప్రకాశరావు.. పదో తరగతి నుంచే పద్యాలు రాయడం నేర్చుకుని అవధానాలు చేసేస్థాయికి ఎదిగారు. 60 గ్రంథాలు రచించారు. 170 అవధానాలు చేశారు. ఆయన రచనలు వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. తెలంగాణకు చెందిన రామచంద్రుడు అనే విద్యార్థి ఆయన రచనలపై పీహెచ్‌డీ పూర్తిచేసి పట్టా పొందారు. తనకు ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం ఆనందంగా ఉందని.. ఇది తెలుగు పద్యానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆశావాది ప్రకాశరావు అన్నారు. ఇక.. విజయవాడకు చెందిన అన్నవరపు రామస్వామి సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు.


1923 మార్చి 23న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామంలో ఆయన జన్మించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు ప్రాణ స్నేహితులు. బాలమురళీకృష్ణ చేసిన 10వేలకు పైగా కచేరీలకు అన్నవరపు వయోలిన్‌తో సహకారమందించారు. సంగీతంలో ఉన్న సప్తస్వరాల్లో నాలుగు స్వరాలతో రెండు కొత్త రాగాలను సృష్టించారు. సగమని స్వరాలతో వందన రాగాన్ని, సమపద స్వరాలతో శ్రీదుర్గ రాగాలను చేశారు. ఇక.. ప్రముఖ మృదంగ విద్వాంసురాలైన నిడుమోలు సుమతి (దండమూడి సుమతి) 1950లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. విజయవాడలో స్థిరపడ్డారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణతోపాటు ఎందరో ప్రముఖ సంగీత విద్యాంసులకు ఈమె మృదంగ సహకారం అందించారు. సంగీత ప్రపంచంలో పురుషాధిక్యం ఉన్న రోజుల్లో మృదంగంతో సంగీతం లోకంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళ సుమతి. 

Updated Date - 2021-01-26T08:19:37+05:30 IST