గాంధీలో గాలి ద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తి

ABN , First Publish Date - 2021-04-25T08:58:13+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో గాలి ద్వారా నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

గాంధీలో గాలి ద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తి

  • ఆస్పత్రిలో 2 యంత్రాల ఏర్పాటు.. 
  • నిమిషానికి రెండు వేల లీటర్ల సృష్టి
  • వరంగల్‌, కరీంనగర్‌లోనూ ప్లాంట్లు: కిషన్‌ రెడ్డి


మంగళ్‌హాట్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో గాలి ద్వారా నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. అందుకోసం ప్రత్యేకంగా రెండు యంత్రాలను సమకూర్చామని వెల్లడించారు. శనివారం ఆయన కింగ్‌ కోఠి జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. కొవిడ్‌ ఆస్పత్రులను పరిశీలించి కరోనా వారియర్స్‌, వైద్యులతో చర్చించి సలహాలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించడంతో గాంధీ, కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లో పర్యటిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రి, కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాల్లో గాలి నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే పరికరాలను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఒక్కో యంత్రం నిమిషానికి 960 నుంచి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. మే మొదటి వారంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి మొదలవుతుందని చెప్పారు. 


ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిని నిలిపివేసి, మెడికల్‌ ఆక్సిజన్‌ను 24 గంటల పాటు ఉత్పత్తి చేయిస్తున్నామని చెప్పారు. వ్యాక్సిన్‌ విషయంలో భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా మిగతా కంపెనీల్లో జాబ్‌ వర్క్‌ చేస్తూ సమాంతరంగా 24 గంటల పాటు ఉత్పత్తి చేసే కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఎగుమతులను నిలిపివేసి, దేశ ప్రజలకు ఉపయోగించాలని నిర్ణయించామని చెప్పారు. ఆదివారం మిగిలిన ఆస్పత్రులను పరిశీలించి మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో చర్చించి కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు. తెలంగాణ లెక్కల ప్రకారం రోజుకు 10 మంది వరకు కొవిడ్‌తో మృతి చెందుతున్నారని, శ్మశానాల్లో మాత్రం 30 నుంచి 40 శవాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొవిడ్‌పై వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని కిషన్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2021-04-25T08:58:13+05:30 IST