‘ఊపిరి’ పోయింది!

ABN , First Publish Date - 2021-05-11T08:21:12+05:30 IST

తిరుపతిలోని రుయా(ఎ్‌సవీఆర్‌ఆర్‌) ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ప్రభుత్వం జిల్లాస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన కొవిడ్‌ బాధితులు

‘ఊపిరి’ పోయింది!

ఆక్సిజన్‌ అందక 11 మంది మృతి

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘోరం

చిత్తూరు కలెక్టర్‌ అధికారిక ప్రకటన

మృతులు 25 మంది అని మరో అంచనా

ట్యాంక్‌లో తరిగిన ఆక్సిజన్‌ నిల్వలు

ప్రెషర్‌ పడిపోయి అందని వాయువు

పడకల మీదే బాధితులు గిలగిల

పనిచేయని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

చెన్నై నుంచి రాని ఆక్సిజన్‌ ట్యాంకర్‌

అరగంటలోనే జరిగిన దారుణం

మృతుల బంధువుల ఆగ్రహావేశాలు

విధ్వంసం.. సిబ్బందిపై దాడికి యత్నం

తక్షణ నివేదికకు సీఎం ఆదేశం


ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



మరో ఘోరం జరిగింది. ప్రాణాలు పట్టి నిలిపే ఆక్సిజన్‌ అందక...11 మంది కొవిడ్‌ బాధితులు ఆస్పత్రి పడకలపైనే ఆఖరి శ్వాస వదిలారు. ఇది అధికారిక లెక్క మాత్రమే! మృతుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండొచ్చునని తెలుస్తోంది. కనీసం పాతిక మంది చనిపోయి ఉంటారని వివిధ వర్గాలు ‘అనధికారికంగా’ చెబుతున్నాయి. ఉత్తమ సేవలతో ప్రాణదాతగా పేరుపొందిన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. 


భీతావహ దృశ్యాలు

రుయా ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డుల్లో ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోవడంతో పరిస్థితి భయానకంగా తయారైంది. ఎటు చూసినా బెడ్లపై అచేతనంగా పడి ఉన్న బాధితులు, శ్వాసకోసం ఇబ్బందులు పడుతున్న వారే కనిపించారు. వైద్యులు, సిబ్బంది వారి చుట్టూ చేరి... ఛాతీపై నొక్కుతూ, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆక్సిజన్‌ అందించేందుకు ప్రయత్నించారు. బాధితుల కుటుంబ సభ్యులు కూడా సపర్యలు చేస్తూ కనిపించారు.


తిరుపతి, మే 10 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని రుయా(ఎ్‌సవీఆర్‌ఆర్‌) ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ప్రభుత్వం జిల్లాస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఆవరణలోనే 11వేలలీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఉంది. దీని నుంచే రుయా ఆస్పత్రిలోని వెంటిలేటర్‌, ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లకు ప్రాణవాయువు సరఫరా అవుతుంది. సోమవారం సాయంత్రం 6 - 7 గంటల సమయానికి ట్యాంకులో ఆక్సిజన్‌ నిల్వలు అయిపోయే అవకాశముందని సిబ్బంది ముందుగానే అధికారులకు చెప్పారు. దానికనుగుణంగా తమకు ఆక్సిజన్‌ సరఫరా చేసే చెన్నైకి చెందిన లిండేన్‌ కంపెనీకి సమాచారం అందించారు. చెన్నైలో సాయంత్రం 4 గంటలకు ఆక్సిజన్‌ ట్యాంకర్‌ బయల్దేరింది. నిబంధనల ప్రకారం ఆక్సిజన్‌ ట్యాంకర్‌ గంటకు 40 కిలోమీటర్లకు మించి వేగంతో ప్రయాణించవద్దు. దీంతో... అది తిరుపతికి చేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


పడకల మీదే గిలగిల: రాత్రి 7 గంటలకు ట్యాంకులో ఆక్సిజన్‌ నిల్వలు 3 కేఎల్‌కు పడిపోయాయి. దీంతో సరఫరాకు సరిపడా పీడనం (ప్రెషర్‌) అందలేదు. ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సాధారణ ఆక్సిజన్‌ బెడ్లు, మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో ఉన్న వెంటిలేటర్‌ బెడ్లపై చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయింది. మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో 51మంది చికిత్స పొందుతున్నారు. వీరిలోనే ఎక్కువమంది చనిపోయారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సాధారణ ఆక్సిజన్‌ బెడ్లలో ఉన్న బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ‘ఆక్సిజన్‌ అందక ఇప్పటి వరకు 11 మంది మరణించారు’ అని సోమవారం రాత్రి పొద్దుపోయాక జిల్లా కలెక్టర్‌ తెలిపారు.


ఆ అరగంటలోనే...: సోమవారం రాత్రి 7 గంటలకు ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడగా... నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి అధికారులు, సిబ్బంది సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. 7.45 గంటలకు చెన్నై నుంచి వచ్చిన ట్యాంకర్‌తో ఆస్పత్రిలోని ట్యాంకును నింపి.. సరఫరాను యథాతథ స్థితికి తీసుకొచ్చారు. కానీ... ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కలిగిన 15-30 నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది.


ఆగ్రహంతో విధ్వంసం

తమ వారు కళ్ళెదుటే ఆక్సిజన్‌ అందక గిలాగిలా కొట్టుకుంటూ విగత జీవులుగా మారడంతో బాధితుల బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులను, సిబ్బందిని, ప్రభుత్వాన్ని నిందిస్తూ... వైద్య పరికరాలను ధ్వంసం చేశారు. వైద్య సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. భయాందోళనతో వైద్యులు, సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


11 మంది చనిపోయారు: కలెక్టర్‌ 

రుయాస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల 11మంది చనిపోయారని కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రకటించారు. రాత్రి 10.45కు ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో 700 మందికి ఆక్సిజన్‌ పడకలపై చికిత్స అందిస్తున్నారని, ఐదు నిమిషాలు ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల కొంతమంది చనిపోయారన్నారు. చెన్నై నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు  రావడంతో చాలా ప్రాణాలను రక్షించగలిగామన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.

Updated Date - 2021-05-11T08:21:12+05:30 IST