ఐదేళ్లలో పౌరసత్వం వదులుకున్న 8లక్షల మంది భారతీయులు.. వీరి మొదటి చాయిస్ ఏ దేశమంటే..?

ABN , First Publish Date - 2022-02-10T17:37:40+05:30 IST

2016 నుండి 2021 వరకు సూమారు 8లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తాజాగా వెలువడిన భారత ప్రభుత్వ అధికారిక డేటా ద్వారా తెలిసింది.

ఐదేళ్లలో పౌరసత్వం వదులుకున్న 8లక్షల మంది భారతీయులు.. వీరి మొదటి చాయిస్ ఏ దేశమంటే..?

న్యూఢిల్లీ: 2016 నుండి 2021 వరకు సూమారు 8లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తాజాగా వెలువడిన భారత ప్రభుత్వ అధికారిక డేటా ద్వారా తెలిసింది. ఇక భారత పౌరసత్వం వదులుకున్న 8లక్షలకు పైగా మంది భారతీయుల్లో 2021 డిసెంబర్ వరకు సుమారు 6.10లక్షల మంది విదేశీ పౌరులుగా మారారు. ఇలా విదేశీ పౌరసత్వం తీసుకున్న వారిలో దాదాపు 42శాతం మంది అమెరికా పౌరులుగా మారారు. 2021 మొదటి తొమ్మిది నెలల్లోనే ఏకంగా 50వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందినట్లు డేటా వెల్లడించింది. దీంతో భారత పౌరసత్వం వదులుకుంటున్న వారి మొదటి చాయిస్‌గా అగ్రరాజ్యం అమెరికా నిలిచింది. యూఎస్ తర్వాత భారతీయులు అత్యధికంగా ఎంచుకుంటున్న దేశం కెనడా. 


2017 నుంచి 2021 వరకు 91వేల మంది కెనడా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత 86,933 మంది భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకుంటే.. 66,193 మంది ఇంగ్లండ్, 23,490 మంది ఇటలీ పౌరులుగా మారారు. అలాగే మరో 83,191 మంది భారతీయులు ప్రపంచంలోని ఇతర 86 దేశాల పౌరసత్వం తీసుకున్నారు. ఇక ఇదే ఐదేళ్లలో మొత్తం 4,844 మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు. 2021లో అత్యధికంగా 1,773 మంది విదేశీయులు భారత పౌరసత్వం పొందినట్లు తెలిపారు. అలాగే 2020లో 639 మంది, 2019లో 987 మంది, 2018లో 628 మంది, 2017లో 817 మందికి భారత పౌరసత్వం ఇచ్చినట్టు మంత్రి తెలియజేశారు. 


కాగా, 2016 నుంచి 2019 వరకు భారత పౌరసత్వం పొందిన వారిలో పాకిస్థాన్ టాప్‌లో ఉంది. ఈ మూడేళ్ల కాలంలో ఏకంగా 2,405 మంది పాకిస్థానీలు భారత పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత ఆఫ్గనిస్థాన్ నుంచి 431 మంది, బంగ్లాదేశ్ నుంచి 132 మంది, శ్రీలంక నుంచి 92 మంది, అమెరికా నుంచి 80 మంది భారత పౌరసత్వం పొందారు. అలాగే 2021 డిసెంబర్ నాటికి 10,635 దరఖాస్తులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. వీటిలో ఎక్కువ దరఖాస్తులు పాకిస్థాన్ (7,306), ఆఫ్ఘనిస్తాన్ (1,152) నుండి వచ్చినట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-10T17:37:40+05:30 IST