ఏడాదిగా వెలి!

ABN , First Publish Date - 2022-08-05T09:35:28+05:30 IST

ఏడాదిగా వెలి!

ఏడాదిగా వెలి!

ఆ కుటుంబంతో మాట్లాడొద్దంటూ తాజాగా మైక్‌లో ప్రచారం

‘పశ్చిమ’లో ఘటన.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు  


ఆకివీడు రూరల్‌ ఆగస్టు 4: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చినిమిల్లిపాడులో వెలి ఘటన మరొకసారి వెలుగులోకి వచ్చింది.  గురువారం బాధితుడు బలే నాగేశ్వరరావు తెలిపిన వివరాలివీ.. సర్పంచ్‌ భర్త గురదాసు బాలాజీ (వైసీపీ).. గ్రామస్థుల్లో కొందరిని తన చెప్పుచేతల్లో పెట్టుకుని కుటుంబాన్ని ఏడాది కిందట వెలివేశారు. మరల ఇప్పుడు.. నాగేశ్వరరావు కుటుంబంతో మాట్లాడిన వారికి రూ.10 వేలు అపరాధ రుసుం విఽధిస్తామని, ఎవరైనా మాట్లాడితే చూసి చెప్పిన వారికి రూ.5వేలు బహుమతి ఇస్తామని మైక్‌లో ప్రచారం చేస్తున్నారని ఈ నెల 2న పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏడాది కిందట తనకు చెందిన చేపల చెరువు గట్టు మీద నుంచి గతంలో అక్రమంగా రోడ్డు వేయడానికి గురుదాసు బాలాజీ  ప్రయత్నించగా తాను అడ్డుకున్నానని, దీంతో కక్ష కట్టి.. తాను టీడీపీకి చెందిన వాడినన్న అక్కసుతో.. తన కుటుంబాన్ని గ్రామంలో వెలి వేశారని బాధితుడు వాపోయాడు. గురదాసు బాలాజీ, బలే నరేష్‌, గురదాసు చంద్రశేఖర్‌, ముంగర రత్నంగి రాజు, సైదు ఏసుపాదం, సైదు పెద్దిరాజు, ఘంటసాల సుబ్బారావు, బలే వెంకటేశ్వరరావు, బలే సూరిబాబు, బలే శ్రీను, ఘంటసాల నాగరాజులు తన కుటుంబాన్ని వెలి పేరుతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాక్ష్యాధారాలు లేక గతంలో అధికారులు ఏమీ చేయలేకపోయారని, ప్రస్తుతం మైక్‌ ప్రచారాన్ని ఆడియో రికార్డు చేసి ఫిర్యాదు చేశానని తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాడు. దీనిపై గ్రామంలో విచారణ చేస్తామని ఎస్‌ఐ యుగంధర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు.


Updated Date - 2022-08-05T09:35:28+05:30 IST