మా దారి అడ్డదారి

ABN , First Publish Date - 2020-09-25T08:02:21+05:30 IST

రాష్ట్రంలో టెండరు ప్రక్రియను అమలు చేయాలనుకుంటే.. 2003 జూలై 1వ తేదీన జారీ చేసిన 94వ ఉత్తర్వును ప్రభుత్వ శాఖలన్నీ ప్రామాణికంగా తీసుకుంటాయి.

మా దారి అడ్డదారి

‘సీమ’ ఎత్తిపోతల కాంట్రాక్టులో నిబంధనలు ఎత్తివేత‘సీమ’ ఎత్తిపోతల కాంట్రాక్టులో నిబంధనలు ఎత్తివేత

కాంట్రాక్టు పనుల్లో అనుభవం అక్కర్లేదు

కాంట్రాక్టు సంస్థగా రిజిస్టర్‌ చేయించుకోనవసరం లేదు

బిడ్‌ దక్కించుకున్నాక మూడు నెలల్లో రిజిస్టర్‌ కావచ్చు!

ఖాయిలా పడినా పర్లేదు.. పదేళ్ల లావాదేవీలు ఇవ్వక్కర్లేదు

మూడు సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడితే చాలు

గాలేరు-నగరి యూనిట్‌లో అడ్డగోలుగా సడలింపులు

40 వేల కోట్ల పనులు అస్మదీయులకు కట్టబెట్టేందుకేనా?

ఇక్కడా రాయలసీమ రింగ్‌ మాస్టర్‌దే స్కెచ్‌!



న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) సహకారంతో రాష్ట్రంలో భారీస్థాయిలో చేపట్టే రహదారుల అభివృద్ధి పనులు దక్కించుకునేందుకు స్కెచ్‌ వేసిన రాయలసీమ రింగ్‌ మాస్టర్‌ నేతృత్వంలో.. మరో భారీ వ్యూహం సిద్ధమైందని చిన్న, మధ్యతరహా కాంట్రాక్టు సంస్థలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. రూ.40 వేల కోట్ల వ్యయంతో తలపెట్టిన రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కాంట్రాక్టు పనులను అస్మదీయులకు అప్పగించేందుకు జలవనరుల శాఖ అడ్డగోలుగా టెండర్‌ నిబంధనలను మార్చేసిందని మండిపడుతున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో టెండరు ప్రక్రియను అమలు చేయాలనుకుంటే.. 2003 జూలై 1వ తేదీన జారీ చేసిన 94వ ఉత్తర్వును ప్రభుత్వ శాఖలన్నీ ప్రామాణికంగా తీసుకుంటాయి. ఇదే ప్రాతిపదికన రాష్ట్రంలో తొలిసారిగా జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీ కూడా ఏర్పడింది. అయితే ఇప్పుడీ ఉత్తర్వును జల వనరుల శాఖ పక్కన పడేసింది. రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకాన్ని రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చేపట్టే గాలేరు-నగరి సుజల స్రవంతి యూనిట్‌ పరిధిలో జలవనరుల శాఖ టెండరు నిబంధనలన్నీ మార్చేసింది.


మూడు కాంట్రాక్టు సంస్థలు సంయుక్తంగా భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటే... అంటే జాయింట్‌వెంచర్‌గా ఏర్పడితే.. జీవో 94లోని నిబంధనలేవీ వర్తించవని స్పష్టం చేస్తోంది. సహజంగా రాష్ట్రంలో సివిల్‌ కాంట్రాక్టు పనులు చేపట్టాలంటే ముందస్తుగా ఆ సంస్థ రాష్ట్రప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ కావాలి. జాయింట్‌ వెంచర్‌ సంస్థగా ఏర్పడితే.. అది కూడా ఇక్కడ రిజిస్టర్‌ చేసుకోవాలి. జాయింట్‌ వెంచర్‌లోని ప్రతి భాగస్వామ్య సంస్థా రాష్ట్రప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ చేసుకోవడంతో పాటు.. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలి. సంస్థలు ఖాయిలా పడకూడదు. గత పదేళ్ల వార్షిక వ్యాపార టర్నోవర్‌ సమాచారాన్ని స్పష్టంగా అందించాలి. తాజాగా గాలేరు-నగరి యూనిట్‌ పరిధిలో ఈ నిబంధనలన్నిటినీ ఎత్తేశారు. కచ్చితంగా కాంట్రాక్టు సంస్థ రాష్ట్రంలోనే రిజిస్టర్‌ చేసుకోవాలన్న నిబంధనను పూర్తిగా సడలించారు.


దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా.. కేంద్ర ప్రభుత్వం వద్దయినా కాంట్రాక్టు సంస్థ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేచాలన్న వెసులుబాటు కల్పించారు. జాయింట్‌ వెంచర్‌ సంస్థలు కేంద్రంలోను, ఇతర రాష్ట్రాల్లోనూ రిజిస్టరైతే చాలని.. రాష్ట్రంలోనే రిజిస్టర్‌ కావాలన్న నిబంధన లేదని పేర్కొన్నారు. ఒకవేళ జాయింట్‌ వెంచర్‌ బిడ్‌ను దక్కించుకుంటే.. అందులోని భాగస్వామ్య కంపెనీలు మూడు నెలల్లోగా రాష్ట్రంలో తమ సంస్థలను రిజిస్టర్‌ చేసుకోవాని నిబంధన పెట్టారు. వాస్తవానికి రాష్ట్రంలో రిజిస్టర్‌ చేసుకోకుండా టెండర్‌ డాక్యుమెంట్‌ను దాఖలు చేసేందుకు వీలే లేదు.


కానీ ఆ నిబంధనను మార్చారు. అప్పటికప్పుడు సంస్థను స్థాపించి.. సివిల్‌ కాంట్రాక్టుల్లో క్లాస్‌ వన్‌ కాంట్రాక్టు సంస్థగా నమోదుకాకపోయినా టెండర్‌ బిడ్లు దాఖలు చేయొచ్చు. కాంట్రాక్టు పనుల్లో అనుభవం లేకపోయినా.. ఆర్థిక స్థితిగతులు బాగాలేకపోయినా.. ఖాయిలా పడినా.. అ వివరాలేవీ జాయింట్‌ వెంచర్‌ సంస్థలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఒకవేళ టెండరును దక్కించుకుంటే.. మూడు నెలల్లోగా రాష్ట్రంలో రిజిస్టర్‌ చేయించుకుంటే చాలని జల వనరుల శాఖ తెలిపింది.




అసలు కారణం ఇదేనా..?


భారీగా రుణంగా తీసుకుని రూ.40 వేల కోట్లతో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తున్న తరుణంలో ఇలా టెండరు నిబంధలన్నీ సడలించేందుకు ప్రత్యేక కారణాలపై రాష్ట్రంలోని కాంట్రాక్టు సంస్థలు ఆరా తీయడం ప్రారంభించాయి. జగన్‌ సర్కారుకు సన్నిహితులైన ఏడుగురు ప్రజాప్రతినిధులకు ఈ పనులు కట్టబెట్టేందుకు పథక రచన జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వారికి టెండర్లు ఖరారు చేయడానికే.. జాయింట్‌ వెంచర్‌ పేరిట అడ్డదారి కాంట్రాక్టు విధానానికి ప్రణాళిక సిద్ధం చేశారని అంటున్నారు. జాయింట్‌ వెంచర్‌లో ప్రముఖ కాంట్రాక్టు సంస్థలతో పాటు కాంట్రాక్టు పనుల్లో ఏ మాత్రం అనుభవంలేని నయా సంస్థలు కూడా ఉంటాయి. ఈ నయా సంస్థలు 85 శాతం దాకా వాటా తీసుకుంటాయి.


బిడ్‌ను దక్కించుకునే ముందు చెల్లించాల్సిన ధరావతు, బిడ్‌ను దక్కించుకున్నాక ఇవ్వాల్సిన బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లను బడా సంస్థే చెల్లిస్తుంది. పనులన్నీ మిగతా రెండు అనామక భాగస్వామ్య సంస్థలు అంటే ప్రభుత్వ పెద్దల అస్మదీయుల కంపెనీలు చేపడతాయన్న మాట! అనుకున్నదే తడవుగా.. ఇంత హడావుడిగా, అడ్డగోలుగా నిబంధనల మార్పు స్కెచ్‌ వేసింది..

ఎన్‌డీబీ టెండర్లలో చక్రం తిప్పిన రాయలసీమ సీమ రింగ్‌ మాస్టరేనని చిన్న. మధ్య తరహా కాంట్రాక్టు సంస్థలు ఆరోపిస్తున్నాయి. రోడ్లు భవనాల శాఖ చేపట్టే ఎన్‌డీబీ పనుల టెండర్ల వ్యవహారం బెడిసి కొట్టడంతో.. ఇప్పడు రాజమార్గంలోనే తమ వారికి టెండర్లను కట్టబెట్టేందుకు ఆయన వ్యూహరచన చేశారని విమర్శిస్తున్నారు.




Updated Date - 2020-09-25T08:02:21+05:30 IST