మన కాలం మహిళా చైతన్యఝరి

ABN , First Publish Date - 2021-09-30T06:38:28+05:30 IST

ఈనెల 25న మనం ఒక విలువైన రత్నాన్ని కోల్పోయాం. మానవతా మణిస్థగిత ధీశాలి, కార్యదక్షురాలు కమలాభాసిన్ జీవిత ఆవలి తీరానికి వెళ్ళిపోయారు. మహిళా చైతన్యఝరులకు ఆదర్శ మార్గదర్శి....

మన కాలం మహిళా చైతన్యఝరి

ఈనెల 25న మనం ఒక విలువైన రత్నాన్ని కోల్పోయాం. మానవతా మణిస్థగిత ధీశాలి, కార్యదక్షురాలు కమలాభాసిన్ జీవిత ఆవలి తీరానికి వెళ్ళిపోయారు. మహిళా చైతన్యఝరులకు ఆదర్శ మార్గదర్శి, శాంతి ఉద్యమాలకు అసాధారణ స్ఫూర్తి, రైతాంగ పోరాటాలకు అసమాన్యమైన ఉత్తేజం, పర్యావరణ ఉద్యమాలకు ఉత్కృష్టమైన మేధోవనరు, దక్షిణాసియా ఏకీభావానికి ఘనమైన ఆలంబన మా కమలా భాసిన్. కమల ప్రభావం పరిధిని నిర్ధారించడం కష్టసాధ్యమైన పని. ఆమె సంఘీభావం తెలుపని ప్రజాఉద్యమం ఏమైనా ఉన్నదా? నేర్చుకోవడానికి సదా ఆమె సంసిద్ధత అపూర్వమైది. తనకు సైద్ధాంతిక స్పష్టత, విశ్లేషణ నైపుణ్యాలు ఉన్నాయని ఆమె ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు. ఆమె ఒక ప్రభుత్వాధికారి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పుడు తాను ఒక బ్యురోక్రాట్‌నని ఆమె అనేవారు. ఆ తరువాత నెట్‌వర్క్‌ల అభివృద్ధికి ఆమె కృషి చేశారు. అలానే శిక్షణా కార్యక్రమాలను రూపొందించి అమలుపరిచేవారు. భారత ఉపఖండంలోని సకల ప్రాంతాలకు చెందిన అసంఖ్యాక విద్యావతులు, ఒకటి రెండు మినహా అన్ని శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యేవారు. మహిళా హక్కులకు సంబంధించిన ఉద్యమాలు, పోరాటాల్లో తమ అనుభవాలను ప్రతి ఒక్కరూ తమ సహచర శిక్షణార్థులతో పంచుకునేవారు. భావి కార్యాచరణల విషయమై సమష్టిగా ఆలోచించేవారు. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళల మధ్య సమైక్యతకు, ఉద్యమ నిధుల సేకరణకు కమలా భాసిన్ ఇతోధికంగా తోడ్పడేవారు. ఉత్కృష్ట ఆలోచనాపరులను ఆహ్వానించి తమ జ్ఞానవివేకాలను క్షేత్రస్థాయి ప్రజా ఉద్యమకారులు, క్రియాశీలురకు సులభశైలిలో వివరించే సదుపాయాన్ని కమల కల్పించేవారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంకలలో నాకు ఉన్న స్నేహితులందరూ కమలా భాసిన్ ద్వారానే నాకు పరిచయమ్యారు. వారి స్నేహసాంగత్యంలో నేను ఎంతో నేర్చుకున్నాను. నా అవగాహనా పరిధిని విస్తృతపరచుకున్నాను. 


కమలకు ఒక గొప్ప ప్రతిభ ఉంది. స్త్రీవాద భావనలలో ప్రతి ఒక్కదాని సారాంశాన్ని విఫులంగా ఆవిష్కరించి, దానిని ఒక పాటగా మార్చే సామర్థ్యమే ఆ ప్రతిభ. కమల ఒక కవయిత్రి. ఆమె వీనుల విందుగా ఆలాపించేవారు. ఆనంద తాండవం చేసేవారు. గలగలా నవ్వేవారు. కార్య నిర్వహణా నిమగ్నత మాపై మోపిన భారాన్ని ఆమె తగ్గించేవారు. కమల సృజనశీలి. ఆ సృజనాత్మకతే ఆమె ప్రతిభ. దేనినైనాసరే ఒక పాటగా మార్చివేసేవారు. జానపదగీతాలు, సినిమాపాటలు, ఉద్యమగేయాలు ఏవైనాసరే వాటిని స్త్రీవాద గీతాలుగా రూపొందించేవారు. గుమిగూడిన వారందరూ వాటిని ఆలాపించేవారు. సభలు ప్రకంపించేవి. అక్కడికక్కడే అవి అన్ని భాషలలోకి అనువదితమైపోయేవి. ఆమె ఛలోక్తులు విసిరేవారు. వేళాకోళం చేసేవారు. కొంటెకోణంగిలా వ్యవహరించేవారు. ప్రతి కార్యగోష్ఠిని ఒక ఉత్సవంలా చేసేవారు. జెండర్ సంబంధిత అంశాలపై నిర్వహించిన అనేకానేక కార్యగోష్ఠులలో ఆమెతో పాటు నేనూ పాల్గొన్నాను. నేను సైద్ధాంతిక భూమికను సమకూర్చేదాన్ని. సంక్షిష్ట భావనలను ఆమె సుబోధకం చేసేవారు. విదూషకత్వం ప్రదర్శించేందుకు ఆమె వెనుకాడేవారు కాదు. హాస్యోక్తులతో మమ్ములను సేద దీర్చేవారు. ఎక్కడెక్కడి వారిని కలిసికట్టుగా వ్యవహరించేలా చేయడంలోనూ, వారిలో శ్రద్ధాసక్తులను జనింపచేయడంలోనూ ఆమె ప్రజ్ఞ అద్వితీయమైనది. కమల తొలుత తన చిన్నారి కుమార్తె కోసం పాటలు రాయడం ప్రారంభించారు. ఆ తరువాత బాలల కోసం ఎన్నో కథలు, గేయాలు రచించారు. అవన్నీ ముచ్చటైన బొమ్మలతో ప్రచురితమయ్యాయి. చాలా భాషలలోకి అనువాదమయ్యాయి. అనేక భాషలు, మాండలికాలు ఉన్న దేశంలో అనువాదం ప్రాధాన్యం గురించి ఆమెకు బాగా తెలుసు. సృజనాత్మక రచన అనువాదాలు ప్రజల మధ్య అవగాహనను పెంచుతాయని ఆమె విశ్వసించారు. 


కమల నాకు దశాబ్దాలుగా తెలుసు. ఆమె అంటే నాకు ఎంతో ప్రేమ. అంతులేని అభిమానం. అంతకుమించి గౌరవమూ ఉంది. ఆమె జీవితంలో ఎంత దుఃఖం ఉందో నాకు బాగా తెలుసు. ఎంత వేదనకు గురయిందో తెలుసు. తగిలిన ప్రతి గాయాన్నీ ఒక గేయంగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగిపోయిన ధీర కమలా భాసిన్. ఆమెలోని మొండి పట్టుదల అపూర్వమైనది. స్ఫూర్తిదాయకమైనది. అంత బాధనూ ఆమె అధిగమించింది. తుదివరకూ నలుగురికీ ప్రయోజనకరంగా ఉండాలని ఆమె సంకల్పించుకుంది. అలానే దృఢంగా వ్యవహరించింది. ప్రతిభావంతురాలు, రూపసి, విద్యావతి అయిన కుమార్తె చాలా చిన్నవయసులో చనిపోవడం కమలకు ఖేదం కలిగించింది. దక్షిణాసియాలో హక్కులు, న్యాయ పరిరక్షణ కోసం అత్యుత్తమ కృషి చేస్తున్నవారికి ఏటేటా ప్రదానం చేసేందుకై దివంగతురాలైన తన కుమార్తె పేరిట ఆమె ఒక అవార్డును ఏర్పాటు చేశారు. ఆ అవార్డు ప్రదానోత్సవం గ్రహీత దేశంలో జరుగుతుంది. దక్షిణాసియా అఖండ సంస్కృతికి కమల ఒక పరిపూర్ణ ప్రతినిధి. జాతీయ సరిహద్దులకు పరిమితం కాని వ్యక్తిత్వం ఆమెది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలలో, అనేక దేశాలలో ఆమె పర్యటించారు. ఎంతోమంది స్నేహసంబంధాలు నిర్మించుకున్నారు. వారి నుంచి నేర్చుకున్నారు. తన అనుభవాలను వారితో పంచుకున్నారు. సమున్నత లక్ష్యసాధనలో వారిని నిరంతర భాగస్వామలుగా చేయడంలో కమల సఫలమయ్యారు. నా పుస్తకం ‘ఏ గ్రీఫ్ టు బరీ’ (తడి ఆరని గాయాలు) ని కమలకు అంకితం చేశాను.  


కమల ప్రతిభాపాటవాలు, ఆమె చూపే ఆప్యాయతలు ఎంతోమంది యువతీ యువకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆమె పట్ల వారు ఆకర్షితులయ్యారు. వారి మనస్సులో నిండు విశ్వాసాన్ని పాదుకొల్పారు. వయసులో పెరుగుతూ వృద్ధమూర్తిగా భాసిస్తున్న కొద్దీ ఆమె మరెంతోమంది అభిమానులను సాధించుకున్నారు. అమీర్ ఖాన్‌తో కలిసి ఒక టీవీ సిరీస్‌ను నిర్వహించారు. అమీర్ కంటే మా కమల పట్లే వీక్షకులు ఆకర్షితులయ్యారు. అదీ ఆమె సమ్మోహన శక్తి. 


తన భావాలు, విశ్వాసాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళేందుకు కమల చాలా కృషి చేశారు. క్రమేణా ఆమె ఎంతో మందికి ఆరాధనీయురాలుగా పరిణమించారు. యువతీ యువకులు ఆమె చుట్టూ చేరేవారు. ఈ విషయమై మేం ఆమెతో హాస్యమాడినా మందహాసం చేసేది. ఎవరి పట్ల అయినా జనంలో ఇటువంటి అభిమానం విప్పారినప్పుడు అది అనివార్యంగా విమర్శను, అయిష్టతను రెచ్చగొడుతుంది. తనపై వచ్చిన విమర్శలకు ఆమె చాలా హుందాగా ప్రతిస్పందించారు. కొన్ని సందర్భాలలో బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కించిత్ గర్వం కూడాలేని ఉదాత్తురాలు కమల. అభిమానుల భావుకత నుంచి ఆరాధనాభావం పుడుతుంది. అయితే వారి ఆరాధనీయురాలు లోని అసలు వ్యక్తి భిన్నమైన మనిషి. ఆ లోపలి మనిషి నుంచి మనం స్ఫూర్తి పొందాలి. కమలా భాసిన్ నుంచి మన సమాజం స్ఫూర్తి పొందేలా చేయవలసిన బాధ్యత ఆమె వృద్ధ స్నేహితులు, సహ యాత్రికులపై ఎంతైనా ఉంది. సుదీర్ఘ పోరాటం అనంతరం శాశ్వతంగా విశ్రమించిన కమలా భాసిన్ ఆత్మకు శాంతి కలుగుగాక.

వసంత కన్నాబిరాన్

Updated Date - 2021-09-30T06:38:28+05:30 IST