మా ఎంపీ రోగ్‌!

ABN , First Publish Date - 2022-02-15T07:48:00+05:30 IST

మా ఎంపీ రోగ్‌!

మా ఎంపీ రోగ్‌!

  • రఘురామను తిట్టిపోసిన జగన్‌
  • ప్రధానికి రాసిన లేఖలోనే సీఎం దూషణలు
  • ఆయన మాటలు విని అప్పులు ఆపొద్దు
  • కేంద్ర ఆర్థిక శాఖ మాపై కత్తికట్టింది
  • బ్యాంకులు మాకు అప్పులివ్వడం లేదు
  • మాపై సానుకూలత చూపండి
  • గతనెలలో ప్రధానికి జగన్‌ విన్నపం
  • లేఖలో అనేక సత్యదూరమైన వాదనలు
  • విచ్చలవిడి అప్పులకు అడ్డగోలు సమర్థన
  • రాజ్యాంగ నిబంధనలకు వక్ర భాష్యం
  • కేంద్రానికే సీఎం ‘ఆర్థిక - అప్పుల పాఠాలు’



‘మా ఎంపీ ఒక రోగ్‌’... లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజును ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్య ఇది! అందులోనూ... ప్రధాని నరేంద్ర మోదీకి అధికారికంగా రాసిన లేఖలోనే ఎంపీని ఇలా దూషించారు. అంతేకాదు... ఆర్థిక అంశాలకు సంబంధించి తన లేఖలో అనేక సత్యదూరమైన ‘వాదనలు’ తెరపైకి తీసుకొచ్చారు. తాము చేస్తున్న ‘తప్పుడు అప్పుల’కు కేంద్రం యథాశక్తి సహకరిస్తూ... ఎప్పటికప్పుడు కొత్త రుణాలకు అనుమతి ఇస్తున్నప్పటికీ... ‘కేంద్ర ఆర్థిక శాఖ మాపై  కత్తి కట్టింది’ అని ఆక్రోశించారు. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అప్పుల కోసం సీఎం జగన్‌ కేంద్రానికి ప్రత్యేక విన్నపాలు చేసుకున్నారు. ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోవద్దని కోరారు. ఈ ఏడాది జనవరిలో సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని  మోదీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రధానికి ఇచ్చిన వినతిపత్రం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రఘురామ పేరు ప్రస్తావించకుండా... ‘ఆయన ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అప్పులు ఆపొద్దు’’ అని ప్రధానిని కోరారు. ‘‘మా పార్టీకి చెందిన ఒక రోగ్‌ ఎంపీ  టీడీపీతో కలిసి రాసిన ఒక నిరాధార ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని...  కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ)కు  అప్పులు రాకుండా చేస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును దెబ్బతీయాలనే  ఆ లేఖ రాశారు. అలాంటి లేఖపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మమ్మల్ని కోరింది. అంతేకాకుండా... ఏపీ కార్పొరేషన్లకు అప్పులిచ్చేముందు జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులను ఆదేశించింది. దీంతో మాకు అప్పులు పుట్టడం లేదు’’ అని జగన్‌ ఆక్రోశించారు.   ఏపీఎ్‌సడీసీతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎస్‌బీఐ ఇంకా రూ.1800 కోట్ల అప్పు ఇవ్వాల్సి ఉందని, కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలతో ఎస్‌బీఐ ఆ రుణాన్ని ఆపేసిందని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రంపై సానుకూల వైఖరి కనబర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు.


ఔనా... నిజమేనా?

ప్రధానికి సీఎం సమర్పించిన వినతిపత్రంలో ఏపీఎ్‌సడీసీ తరహా కార్పొరేషన్ల గురించి అనేక విషయాలను పొందుపరిచారు. అందులో... అనేక అవాస్తవాలూ ఉండటం గమనార్హం. వాటిని పరిశీలిస్తే...


సీఎం ఉవాచ: ఏపీఎ్‌సడీసీ తరహాలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అదనపు అప్పులు చేయడం చట్టబద్ధం, రాజ్యాంగబద్ధమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 


అసలు విషయం: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చులు, అప్పులు తీర్చగలిగే సామర్థ్యం... వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అప్పులకు ఒక పరిమితిని విధించే అధికారం కేంద్రానికి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) ద్వారా ఇది సంక్రమించింది. దీని మేరకే కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని తీసుకొచ్చింది.  నాబా ర్డు, ఈఏపీ, ఎన్‌సీడీసీ రుణాలు, ఉద్యోగులకు సంబంధించిన భవిష్య నిధి, ఏపీజీఎల్‌ఐ నుంచి ప్రభుత్వం నికరంగా వాడుకున్న నిధులు కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలోనే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగా చేయదగినంటువంటి అప్పులు ఇవి మాత్రమే! అంతే తప్ప... విచ్చలవిడిగా కార్పొరేషన్లు పెట్టుకుని, వాటి ద్వారా అప్పులు తేవడం చట్టబద్ధం కాదు. రాజ్యాంగ బద్ధమూ కాదు. 


సీఎం ఉవాచ: ఏపీఎ్‌సడీసీతోపాటు బేవరేజెస్‌ కార్పొరేషన్‌, ఏపీ రోడ్డు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్పొరేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఇంకా ఇతర కార్పొరేషన్ల అప్పులు ఆర్టికల్‌ 293(3) పరిధిలోకి రావు. వీటికి కేంద్రం అనుమతి అవసరంలేదు. 


అసలు విషయం: కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌... ఇలా ఏ పేరుతో అప్పులు చేసినా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వాటి అసలు వడ్డీ మొత్తాలను చెల్లిస్తూ ఉంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణించాలని ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలోని సెక్షన్‌ (2) చెబుతోంది. నిజానికి... కార్పొరేషన్లు తమ సొంత లావాదేవీల కోసం అప్పులు చేసుకోవచ్చు. తామే వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం వాటికి కౌంటర్‌ గ్యారెంటీ మాత్రమే ఇస్తుంది. కానీ... ఏపీలో జరిగేది వేరు. ప్రభుత్వం దొంగదారిలో కార్పొరేషన్ల పేరిట  అప్పులు తెచ్చుకుని, తాను వాడుకుంటోంది. వాటికి రాష్ట్ర ఖజానా నుంచి వేలకోట్ల రూపాయలను ‘గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌’ రూపంలో బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం మళ్లిస్తోంది. ఆ మొత్తంతోనే ఆయా కార్పొరేషన్లు అప్పులకు అసలు, వడ్డీ చెల్లిస్తున్నాయి.  ఏపీఎ్‌సడీసీ, ఏపీఆర్‌డీసీ, స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ కాకుండా మిగతా ప్రభుత్వ కార్పొరేషన్లకు  రూ.2 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఇందులో రూ.1,70,000 కోట్ల అప్పునకు సంబంధించిన అసలు, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే ఖజానా నుంచి కడుతోంది. అయినా సరే... కార్పొరేషన్‌ పేరిట చేసే అప్పులకు, ఆర్టికల్‌ 293(3), ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి సంబంధం లేదని సీఎం జగన్‌ చెప్పడం గమనార్హం.


సీఎం ఉవాచ: కేంద్రంలో ఎన్‌హెచ్‌ఏఐలాగే రాష్ట్రంలో ఏపీఎ్‌సడీసీని ఏర్పాటు చేసుకున్నాం.


అసలు విషయం: దేశంలో ఏ ప్రాంతంలోనూ రోడ్లు సరిగ్గా లేని సమయంలో 22 ఏళ్ల క్రితం నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ని స్థాపించారు. ఇప్పుడు దేశంలో ఉన్న జాతీయ రహదారులన్నీ ఆ సంస్థ ఆస్తులే.  ఈ 22 ఏళ్లలో మొదటి 11 ఏళ్లలో రోడ్లు నిర్మించడానికి ఆ సంస్థ చేసిన అప్పులు కేవలం రూ.22,000 కోట్లు. కానీ, ఏపీఎ్‌సడీసీ పేరుతో జగన్‌ సర్కారు 2020-21లోనే రూ.25,000 కోట్ల అప్పులు తెచ్చి వాడేసింది. ఎన్‌హెచ్‌ఏఐ దేశానికి ఆస్తులు కూడబెడితే... ఏపీఎ్‌సడీసీ పేరుతో రాష్ట్ర ఆస్తులైన భూములు, ప్రభుత్వ భవనాలను జగన్‌ సర్కారు తాకట్టు పెట్టింది. పేరుకే అది రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌! కానీ... తెచ్చిన అప్పులతో ఎంత అభివృద్ధి చేశారో ఎవరికీ తెలియదు. ఎన్‌హెచ్‌ఏఐ చాలా విజయవంతమైన సంస్థ. గడచిన 11 ఏళ్ల నుంచి ఎక్స్‌టర్నల్‌ గ్రాంట్లు, కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండానే సొంత కాళ్లపై నిలబడి దేశంలో రోడ్లు నిర్మిస్తోంది. ఎన్‌హెచ్‌ఏఐకి టోల్‌ రూపంలో ఆదాయం వస్తుంది. ఏపీఎ్‌సడీసీకి ఆదాయం ఎక్కడుంది? ఖజానాకు వచ్చే మళ్లించి... దాన్నే కార్పొరేషన్‌ ఆదాయంగా చూపిస్తున్నారు. బ్యాంకులను సంతృప్తి పరిచేందుకు ఈ గిమ్మిక్కులు చేస్తున్నారు. ఇలాంటి సంస్థను... ఎన్‌హెచ్‌ఏఐతో పోల్చడమే పెద్ద వింత అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


సీఎం ఉవాచ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఏపీఎ్‌సడీసీ రాజ్యాంగబద్ధమని, చట్టబద్ధమని చెప్పారు.

అసలు విషయం: అప్పుల కోసమే పుట్టించిన కార్పొరేషన్లు రాజ్యాంగ బద్ధం, చట్టబద్ధమైతే ఆర్టికల్‌ 293, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాల అవసరమే ఉండదు. 6 నెలల్లో దేశమే దివాలా తీస్తుంది. 


సీఎం ఉవాచ: ఏపీఎ్‌సడీసీ వంటి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు తిరిగి  చెల్లిస్తాం.

అసలు విషయం: కార్పొరేషన్ల అప్పులను పూర్తిస్థాయిలో కలగాపులగం చేసి, చెల్లింపులను గందరగోళంలో పడేశారు. ఉదాహరణకు... ఏపీఎ్‌సడీసీ ద్వారా  2020-21లో రూ.25,000 కోట్ల అప్పుతీసుకుని... దానిని మద్యం మీద విధించిన అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌(ఏఆర్‌ఈటీ) ఆదాయంతో చెల్లిస్తామన్నారు.  ఏపీఎ్‌సడీసీపై కోర్టులో కేసులు పడడంతో, ప్రభుత్వం 2021-22లో కావాల్సిన అదనపు అప్పుల కోసం బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చట్టానికి సవరణలు చేసింది. దానిని కొత్త అప్పుల కోసం సిద్ధం చేసింది. ఈ కార్పొరేషన్‌ ద్వారా రూ.40,000 కోట్ల అప్పు కావాలంటూ బ్యాంకులతో బేరసారాలు జరుపుతోంది. నిజానికి... ఐదేళ్లలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని జగన్‌ సర్కారు ప్రకటించింది. మరి... మద్యం ఆదాయం ఆధారంగా తీసుకొచ్చిన రూ.25వేల కోట్ల అప్పు ఎలా తీరుస్తారు? మద్యం వ్యాపారం చేసే బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా తేవాలనుకుంటున్న రూ.40వేల కోట్ల సంగతేమిటి? వాటిని ఎలా తీరుస్తారు?

Updated Date - 2022-02-15T07:48:00+05:30 IST