అసోంలో మన కీర్తి

ABN , First Publish Date - 2022-05-30T06:13:09+05:30 IST

‘‘కచార్‌ జిల్లాను వరదలు ముంచెత్తాయి ఇలాంటి వరదలను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఎగువన ఉన్న మణిపూర్‌ కొండల ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసాయి.

అసోంలో మన కీర్తి

బురదలో నడక... మరబోటుపై ఒంటరిగా ప్రయాణం... సిబ్బందికి సూచనలు ఇస్తూ బిజీ బిజీ. ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ ఫొటోలు మీరు చూసే ఉంటారు. ఆమె మన తెలుగమ్మాయే. జనగాం జిల్లా తరిగొప్పులకు చెందిన  కీర్తి జల్లి అసోంలో ఐఏఎస్‌ అధికారిణిగా విఽధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ వరదలు సంభవించినప్పుడు సహాయ చర్యలతో అక్కడి ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఐఏఎస్‌ అయినా సింపుల్‌గా కనిపించే ఆమెను ‘నవ్య’ పలకరించింది.


‘కచార్‌ జిల్లాను వరదలు ముంచెత్తాయి ఇలాంటి వరదలను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఎగువన ఉన్న మణిపూర్‌ కొండల ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసాయి. దాని ప్రభావం కచార్‌ జిల్లాపై పడింది. బాకర్‌ నది కంటే బ్రహ్మపుత్ర నది ప్రభావం కచార్‌ జిల్లాపై ఎక్కువ పడింది. అనేక ప్రాంతాలు దివిసీమలా మారాయి. కచార్‌ జిల్లాకు ప్రధాన రోడ్డు మార్గాలు తెగిపోయాయి. వరద ఉధృతి మొదలవ్వగానే అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశాం. వరదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. అవసరమైన ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ద్వారా కూడా ప్రజలను రక్షించాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీళ్లు, బురద ఇవేవీ చూడలేదు. ఎక్కడికక్కడే క్యాంప్‌లను ఏర్పాటు చేసి వరద బాధితులను తరలించాం. కచార్‌ జిల్లాలో 40లక్షలకు పైగా జనాభా ఉంది. ఈ ప్రాంతానికి అవసరమైన పెద్ద మార్కెట్‌ సిల్చర్‌ ఇక్కడే ఉంది. వరద ముంపు పేరుతో నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారు. వరద ముంపు నుంచి ప్రజలను సురక్షితంగా తీసుకొచ్చామని ఊపిరి పీల్చుకునేలోపే ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. వెంటనే యంత్రాంగాన్ని రంగంలోకి దించి పెంచిన ధరలను పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవిధంగా చర్యలు చేపట్టాం.


 చిన్నప్పటి నుంచే ఇలాగే..

చిన్నప్పటి నుంచి సింపుల్‌గా ఉండటం అలవాటయింది. మంచిబట్టలు వేసుకోవాలి. ఆభరణాలు ధరించాలనే ఆసక్తిలేదు. మా నాన్న పెంపకమే ఇలా అలవాటు చేసింది. మాది జనగామ జిల్లా తరిగొప్పుల. నాన్న జల్లి కనకయ్య, అమ్మ వసంత, చెల్లెలు ఐశ్వర్య. నా విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే జరిగింది. అబిడ్స్‌లోని రోసరీ కాన్వెంట్‌ హైస్కూల్‌లో పది వరకు చదివాను. నల్లకుంటలో ఇంటర్‌ చదివాను. ఐఐటీ చేయాలనుకున్నా. కానీ అనుకున్నంత ర్యాంకు రాకపోవడంతో శ్రీనిధి కాలేజీలో ఇంజనీరింగ్‌లో చేర్పించారు. అయిష్టంగానే చేరాను. బీటెక్‌ పూర్తి చేస్తుందా? లేదా? అనే సందేహం ఇంట్లో వాళ్లకు ఉండేది. నాకు మొదటి నుంచి సివిల్‌ ర్యాంకు సాధించాలన్నదే లక్ష్యం. బీటెక్‌ చేస్తూనే ఆ వైపు దృష్టి సారించాను. కాలేజీ క్యాంపస్‌ సెలక్షన్‌లో ఏదైనా కంపెనీలో చేరడానికి ఆసక్తిచూపలేదు. బీటెక్‌ పూర్తవ్వగానే ఢిల్లీలో శిక్షణ తీసుకున్నా. ఫిలాసఫి అంటే చాలా ఇష్టం. అందుకు సంబంధించి పుస్తకాలు బాగా చదివాను. ఆ క్రమంలోనే పర్యావరణంపై నేను చేసిన ప్రజెంటేషన్‌ను చూసి అప్పటి కేంద్రమంత్రిత్వశాఖ ఉద్యోగాన్ని ఆఫర్‌ చేసింది. కానీ చేరలేదు. సివిల్స్‌ మొదటి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో 89వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాను. 


రిజర్వేషన్‌ వినియోగించుకోలేదు

మాది ఉన్నతమైన కుటుంబమే. మా నాన్న చెబుతుండేవారు అవకాశాలుంటే ప్రజలంతా సమానంగా ఉండేవారని. అవకాశాలు లేకపోవడం వల్లే ఇంకా పేదలు పేదలుగానే మిగిలారని. దాంతో సివిల్స్‌ అప్లికేషన్‌లో రిజర్వేషన్‌ను నమోదు చేయలేదు. ఓపెన్‌ కేటగిరిలోనే సివిల్స్‌ సాధించాను. రిజర్వేషన్‌ వినియోగించుకుంటే సొంత రాష్ట్రం వచ్చేదేమో. కానీ నాకు అవసరం లేదనుకున్నా. నాన్న ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజీలో చదివి వర్సిటీ ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా గెలిచారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అప్పటి పరిస్థితులు, అప్పటి ఉద్యమ ప్రభావం నాన్నపై బాగా ఉందట! చాలా ఐడియాలజికల్‌గా ఉండేవారు. న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2017లో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా గెలిచారు. మాతో ఎప్పుడూ సమాజ స్థితిగతులను వివరిస్తూ జీవితంలో ఎదిగేందుకు అనేక సూచనలు చేశారు. పలు ఐడియాలజికల్‌ పుస్తకాలు చదివించారు. దాంతో పుస్తకాలను చదవడం నా హబీగా మారింది. 


రెండు సార్లు అవార్డులు

అసోంలోని జోర్‌హట్‌ జిల్లాలోని తితబార్‌ ప్రాంతానికి సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న సందర్భంలో ఎన్నికలు వచ్చాయి. అక్కడ వివిధ తెగల ప్రజలున్నారు. పురుషులతో పోల్చితే మహిళల ఓటింగ్‌ శాతం చాలా తక్కువగా ఉండేది. 2016లో ఎన్నికలు వచ్చిన సందర్భంలో మహిళల ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాను. ఓట్లు లేని మహిళలకు నమోదు చేయడంతో పాటు ఓటు వేసేందుకు అవసరమైన అవగాహన చర్యలు చేపట్టాను. ముఖ్యంగా ఎనిమిది కిలోమీటర్లు మహిళలతో ముగ్గులు వేసే కార్యక్రమం చేపట్టాను. ఇది మహిళలను ఎంతగానో ఆకర్షించింది. దాంతో 2016లో బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాను. ’హైలాకండి‘ జిల్లాలో డిప్యూటి కమిషనర్‌గా పనిచేసిన సమయంలో తేయాకు తోటల్లో పని చేసే మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారని గుర్తించాను. పిల్లల్లో పౌష్టికాహారలోపం కూడా విపరీతంగా ఉంది. స్త్రీలకు రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి ’ఉసిరి మురబ్బా‘ (బెల్లంపాకంలో నానబెట్టి, ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి పంచడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలను మరింత పటిష్ట పరిచాం. ఇటీవల అసోం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డు అందజేసింది. గతేడాది కూడా కచార్‌ జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు వివిధ చర్యలు చేపట్టడం వల్ల మరోసారి బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నాను. 


 పెళ్ళి కూడా సింపుల్‌గానే..

కొవిడ్‌ సమయంలో సిల్చర్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో ఐదు పడకల ఐసీయూ రోగులకు సరిపోవడం లేదు. దాంతో 350 పడకలకు పెంచేందుకు కొత్తగా ఐసీయూ యూనిట్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఇందుకోసం అవసరమైన సామగ్రి బెంగళూర్‌, చెన్నై వంటి నగరాలను నుంచి తెప్పించుకోవాలి. అప్పట్లో పరికరాల సరఫరా లేకపోవడం వల్ల ఇబ్బందిగా మారింది. ఆ సమయంలో పెళ్ళికి ప్రత్యేకంగా సెలవు తీసుకోలేదు. 2020 సెప్టెంబర్‌లో ఐఏఎస్‌ అధికారి ఆదిత్యచంద్రకాంత్‌తో నా వివాహమైంది. ఈ పెళ్ళి కూడా చాలా సింపుల్‌గానే జరిగింది. మా అమ్మానాన్నలు కొవిడ్‌ బారిన పడటంతో వారు రాలేదు. చెల్లెలు తోడుంది. మరుసటి రోజు నుంచే ఐసీయూ పడకల పెంపు పనుల్లో నిమగ్నమయ్యాను. ప్రజలకు సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి లభిస్తుంది.’’ 

 బయ్య దామోదర్‌

Updated Date - 2022-05-30T06:13:09+05:30 IST