సామాజిక శక్తుల ఐక్యతే ఓంకార్‌కు నివాళి

ABN , First Publish Date - 2021-10-18T06:06:09+05:30 IST

సామాజిక శక్తుల ఐక్యతే ఓంకార్‌కు నివాళి

సామాజిక శక్తుల ఐక్యతే ఓంకార్‌కు నివాళి
వరంగల్‌లో ఓంకార్‌కు నివాళులర్పిస్తున్న ఎంసీపీఐ(యు) నాయకులు

ఎంసీపీఐ(యూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి 


గిర్మాజిపేట, అక్టోబరు 17 : సామాజిక శక్తులను, వామపక్ష భావజాలంతో ఉన్నవారందరినీ ఐక్యం చేసి రాజ్యాధికారం దిశగా ముందుకు సాగడమే వీర తెలంగాణ పోరాట యోధుడు మద్దికాయల ఓంకార్‌కు సరైన నివాళి అని ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి గాదగోని రవి అన్నారు. ఆదివారం వరంగల్‌లోని ఎంసీపైఐ (యూ) జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పనాస ప్రసాద్‌ అధ్యక్షతన మద్దికాయల ఓంకార్‌ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఓంకార్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళిలర్పించారు. ‘ప్రస్తుత రాజకీయాలు-వామపక్ష సామాజిక శక్తుల ఐక్యత’ అనే అంశంపై జరిగిన సదస్సులో గాదగోని రవి మాట్లాడుతూ.. బూర్జువా భూస్వామ్య పెట్టుబడిదారీ పార్టీల దోపిడీ విధానాలను ఎండగట్టి మార్క్సిజాన్ని పుణికిపుచ్చుకుని అనేక ఆటుపొట్లను ఎదుర్కొని శ్రమజీవుల పక్షాన రాజీలేని పోరాటం చేసిన అమరుడు ఓంకార్‌ అని అన్నారు. కార్యక్రమంలో  కార్యదర్శివర్గ సభ్యులు సింగతి సాంబయ్య, రాష్ట్ర నాయకులు మాలి బాబురావు, గోనే కుమారస్వామి, పెద్దారపు రమేష్‌, హంసారెడ్డి, రాగసుధ, చంద్రయ్య, కుసుంబ బాబురావు, జి.నాగార్జున, రాజిరెడ్డి, ప్రతాప్‌ పాల్గొన్నారు.


దుగ్గొండి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు మద్దికాయల ఓంకార్‌ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎంసీపీఐ(యూ) నాయకుడు ఎల్లబోయిన రాజు అన్నారు. బల్వంతాపురంలో ఆదివారం  ఓంకార్‌ 13వ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో పేరబోయిన రాజు, జ్యోతి, భాను, సుజాత, ప్రియాంక పాల్గొన్నారు.


ఓంకార్‌ ఆశయ సాధనకు పాటుపడాలి

నర్సంపేట: ప్రజాసమస్యల పరిష్కారం కోసం తుదిశ్వాస వరకు పోరాడిన కమ్యూనిస్టు యోధుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్‌ ఆశయ సాధనకు కార్యకర్తలు పాడుపడాలని ఏఐకేఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఎంసీపీఐ(యూ) జిల్లా సహాయ కార్యదర్శి పెద్దారపు రమేశ్‌, డివిజన్‌ కార్యదర్శి కన్నం వెంకన్న పిలుపునిచ్చారు. ఓంకార్‌ 13వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలోని ఓంకార్‌ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమ సమాజ నిర్మాణం కోసం, ప్రజాస్వామిక విప్లవం కోసం ఓంకార్‌ అలుపెరగని ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. భూస్వాములు, దొరలకు సింహస్వప్నమై నిలిచి ప్రజల ఆదరాభిమాలను చూరగొన్నారని అన్నారు. ఐదుసార్లు నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచి పేదలకు ఎర్రజెండా అండ అని చాటిన గొప్ప కమ్యూనిస్టు నేత మద్దికాయల ఓంకార్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) నాయకులు కుసుంబ బాబూరావు, కొత్తకొండ రాజమౌళి, కేశెట్టి సదానందం, అనుమాండ్ల రమేశ్‌, జన్ను రమేశ్‌, నాగరాజు, మాదాసి సుజాత, సౌర్ణమి, బిందు, రాకేశ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-18T06:06:09+05:30 IST