పేలిపోయిన ‘వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్.. కంపెనీ రెస్పాన్స్ ఇలా!

ABN , First Publish Date - 2021-08-03T00:42:53+05:30 IST

నగరానికి చెందిన ఓ మహిళ ఎంతో ఇష్టపడి ఐదు రోజుల క్రితం ‘వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసింది. అయితే,

పేలిపోయిన ‘వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్.. కంపెనీ రెస్పాన్స్ ఇలా!

బెంగళూరు: నగరానికి చెందిన ఓ మహిళ ఎంతో ఇష్టపడి ఐదు రోజుల క్రితం ‘వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఆ ముచ్చట ఆమెకు ఎంతోకాలం నిలవలేదు. నిన్న ఆ ఫోన్ ఒక్కసారి పేలిపోయి మాడి మసైపోయింది. దీంతో షాకైన ఆమె భర్త ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. విషయం ఒక్కసారిగా వైరల్ కావడంతో వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. చైనీస్ కంపెనీ గత నెలలోనే ఈ ఫోన్‌ను విడుదల చేసింది. 


ఉదయం తన భార్య ఫోన్‌ను బ్యాగులో పెట్టుకుని సైక్లింగ్‌కు వెళ్లిందని, ఆ తర్వాత కాసేపటికే ‘వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ’ స్మార్ట్‌ఫోన్ పేలిపోయిందని ట్విట్టర్ యూజర్ అంకిత్ శర్మ ట్వీట్ చేశాడు. ఫోన్ పేలిపోవడంతో తన భార్య భయభ్రాంతులకు గురైందని, ఈ కారణంగా యాక్సిడెంట్ కూడా అయిందని అంకిత్ పేర్కొన్నాడు. ఫోన్ పేలిన సమయంలో బాగా పొగ వచ్చిందని పేర్కొంటూ పేలిన ఫోన్‌కు సంబంధించి మూడు ఫొటోలను కూడా పోస్టు చేశాడు. అయితే, ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించినప్పటికీ అది అప్పటికే వైరల్ అయింది. 


అంకిత్ శర్మ ట్వీట్‌పై వన్‌ప్లస్ సపోర్ట్ అకౌంట్ స్పందించింది. కంపెనీతో నేరుగా మాట్లాడాలని సూచించింది. కంపెనీతో శర్మ నేరుగా మాట్లాడినదీ, లేనిదీ తెలియరాలేదు. ఫోన్ పేలిన ఘటనపై వన్‌ప్లస్ దర్యాప్తు జరుపుతున్నట్టు మాత్రం తెలుస్తోంది. ఈ ఘటనను తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, దర్యాప్తు కోసం తమ సిబ్బంది ఇప్పటికే యూజర్‌ను కలుసుకున్నారని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.  


‘వన్‌ప్లస్ నార్డ్ 2’ ను చైనా కంపెనీ గత నెలలో విడుదల చేయగా, చివరి వారంలో సేల్‌కి అందుబాటులోకి వచ్చింది. ‘వన్‌ప్లస్ నార్డ్’కు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఇందులో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు. మీడియాటెక్ డైమెన్సిటీ ఎస్ఓసీతో కంపెనీ నుంచి వచ్చిన తొలి ఫోన్ ఇదే. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ పేలిపోవడం ఇదే తొలిసారి కాదు. జులై 2019లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో మంటలు చెలరేగి కాలి బూడిదైంది. కాగా, యాపిల్, శాంసంగ్, షియోమీ వంటి బ్రాండ్ల ఫోన్లు కూడా పేలిపోయినట్టు, మంటలు చెలరేగినట్టు గతంలో వార్తలు వచ్చాయి. 

Updated Date - 2021-08-03T00:42:53+05:30 IST