ఇంటర్‌లో అందరూ పాస్!
ABN , First Publish Date - 2021-06-29T08:24:28+05:30 IST
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థినీ పాస్ చేశారు.
సెకండియర్ ఫలితాలు విడుదల
ఫస్టియర్ మార్కులే ద్వితీయానికీ..
ప్రాక్టికల్స్‌కు 100% మార్కులు
గతంలో ఫెయిలైన సబ్జెక్టులకు 35
విద్యాశాఖ మంత్రి సబిత వెల్లడి
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థినీ పాస్ చేశారు. దీంతో ఇంటర్‌లో వందశాతం ఫలితాలు వచ్చినట్లయింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా పరీక్షలను రద్దు చేసినందున.. ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులకు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలోనూ ఇచ్చారు. ప్రాక్టికల్స్‌లో వంద శాతం మార్కులు కేటాయించారు. గతంలో ఫెయిలైన సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించిన వారికి మాత్రం 35 శాతం పాస్ మార్కులు ఇచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 2,37,441 మంది బాలికలు కాగా, 2,36,409 మంది బాలురు ఉన్నారు.
ఉత్తీర్ణులైన మొత్తం విద్యార్థుల్లో 1,76,723 మంది ‘ఏ’ గ్రేడ్ సాధించారు. 1,04,891 మంది ‘బి’ గ్రేడ్, 61,899 మంది ‘సి’ గ్రేడ్, 1,08,105 మంది విద్యార్థులు ‘డి’ గ్రేడ్ పొందారు. ఈ ఫలితాలతో విద్యార్థులెవరైనా సంతృప్తి చెందకపోతే.. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రథమ సంవత్సరం హాల్‌టికెట్ నంబరును పొందుపరచడం ద్వారా విద్యార్థులు ఫలితాలతోపాటు తమ మార్కులను పొందవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థుల మెమోల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే 040-24600110 ఫోన్ నంబరులో ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చునని ప్రభుత్వం సూచించింది. ఫలితాల కోసం htpps://tsble.cgg.gov.in , http://exam results ts.nic.in , http://results.cgg/gov.in అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చునని తెలిపింది. ఇక ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఫలితాలను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే.