Abn logo
Oct 25 2021 @ 02:57AM

రక్షణ రంగంలో వెయ్యి కోట్ల పెట్టుబడులు

  • రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు
  • వీఈఎం సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
  • వీఈఎం టెక్నాలజీకి511 ఎకరాలు : కేటీఆర్‌
  • రానున్న కాలంలో తెలంగాణలో లక్ష కోట్ల పెట్టుబడులు: డీఆర్‌డీఓ చైరన్‌ సతీశ్‌ రెడ్డి


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రక్షణ రంగంలోని సంస్థలకు హైదరాబాద్‌ అనువైన ప్రదేశంగా మారిందని, రెండో లాక్‌హిడ్‌ మార్టిన్‌ సంస్థగా పేరుగాంచిన వీఈఎం టెక్నాలజీ సంస్థతో ఒప్పందం ద్వారా హైదరాబాద్‌లో రక్షణ రంగం మరింత విస్తరిస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రక్షణ రంగంలో ఉత్పత్తులకు సంబంధించి ఆదివారం హైదరాబాద్‌లో వీఈఎం టెక్నాలజీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకొంది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వీఈఎం టెక్నాలజీ ఎండీ వెంకటరాజు, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఈ మేరకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ ఈ ఒప్పందంలో భాగంగా వీఈఎం టెక్నాలజీకి జహీరాబాద్‌ పరిసరాల్లో 511 ఎకరాలను కేటాయించామని తెలిపారు. స్థానిక యువతకు అవకాశాలు లభించేలా జహీరాబాద్‌లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని వీఈఎం సంస్థ ప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ ఒప్పందం ద్వారా రానున్న ఐదేళ్ల కాలంలో రక్షణ రంగంలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెడతామని, దీంతో రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.


రక్షణ, మిస్సైల్‌ రంగంలో డీఆర్‌డీఓకు సహకారం అందిస్తున్న వీఈఎం సంస్థ దేశానికే గర్వకారణమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే సారస్వత్‌ మాట్లాడుతూ గడిచిన 20 ఏళ్లలో డీఆర్‌డీఓకు వీఈఎం టెక్నాలజీ సేవలందిస్తోందని చెప్పారు. డీఆర్‌డీఓ ఆర్‌అండ్‌డీ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాలకు అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాలకు హైదరాబాద్‌ హబ్‌గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీఈఎం టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ వి.వెంకటరాజు మాట్లాడుతూ తమ సంస్థకు రక్షణ రంగంలో అపార అనుభవం ఉందన్నారు. యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణులతో పాటు చిన్న ఆయుధాల తయారీని కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.