రీషెడ్యూల్‌ తప్పదా..?

ABN , First Publish Date - 2021-12-02T08:24:49+05:30 IST

కొత్త వైరస్‌ ఒమిక్రాన్‌ కలకలం నేపథ్యంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రీషెడ్యూల్‌ తప్పదా..?

న్యూఢిల్లీ:  కొత్త వైరస్‌ ఒమిక్రాన్‌ కలకలం నేపథ్యంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ సుదీర్ఘ సిరీ్‌సను రీషెడ్యూల్‌ చేయాలని ఇరు దేశ క్రికెట్‌ బోర్డులు భావిస్తున్నాయి. మూడు టెస్టులను రెండింటికి పరిమితం చేస్తే అక్కడికి వెళ్లేందుకు మరికాస్త సమయం దొరుకుతుందని బీసీసీఐ భావిస్తోంది. వాస్తవానికి కివీ్‌సతో రెండో టెస్టు ముగియగానే సఫారీ టూర్‌ కోసం భారత క్రికెటర్లంతా ఐదు రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాతే బయో బబుల్‌లో అడుగుపెడతారు. కానీ అంతకన్నా ముందు ఈ టూర్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి.


అటు భారత ఆటగాళ్లకు కూడా కొత్త వైర్‌సపై భయాందోళనలు నెలకొన్నాయి. ముందుగా బోర్డు వారి సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం ఇరుజట్ల మధ్య ఈనెల 17 నుంచి జనవరి 26 వరకు 3 టెస్టులు, 3 వన్డేలు, 4 టీ20లు జరగాలి. మరోవైపు జట్లను కూడా ఇప్పుడప్పుడే ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ షెడ్యూల్‌ ప్రకారం ముందుకెళితే కోహ్లీ వన్డే కెప్టెన్సీపై స్పష్టత కూడా మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌ ఉంటే బాగుంటుందని బోర్డులోని ఓ వర్గం వాదిస్తోంది. దీంతో వన్డేలకు కూడా రోహిత్‌ను కొనసాగించినా ఆశ్చర్యం లేదు.

Updated Date - 2021-12-02T08:24:49+05:30 IST