Abn logo
Aug 24 2021 @ 10:37AM

భారతీయుల ఎంట్రీకి ఒమన్ గ్రీన్‌ సిగ్నల్ !

మస్కట్: గల్ఫ్ దేశం ఒమన్ భారతీయ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న భారతీయులు తమ దేశానికి రావొచ్చని సోమవారం ఒమన్ ప్రకటించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రయాణికులకు కూడా అనుమతి ఇచ్చింది. తాజాగా ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ మూడు దేశాల నుంచి ఒమన్ వచ్చే ప్రయాణికులు క్యూఆర్ కోడ్‌తో కూడిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి అని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వెల్లడించారు. సుల్తానేట్‌కు వెళ్లే 14 రోజుల ముందు కరోనా టీకా సెకండ్ డోస్ తీసుకున్న వారికి కూడా ఎంట్రీకి అనుమతి ఉంటుంది. అలాగే ఒమన్ పౌరులు, నివాసితులు, ఒమన్ వీసాదారులు, వీసా ఆన్ అరైవల్‌కు అర్హత ఉన్న వారికి దేశంలో ప్రవేశానికి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. 


కాగా, కోవిడ్-19 పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉన్న ప్రయాణికులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. సుల్తానేట్‌కు చేరడానికి 96 గంటల ముందు టెస్టు చేయించుకున్న సర్టిఫికేట్‌ మాత్రమే పరిగణలోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. 8 గంటల కంటే ఎక్కువ సమయం విమానంలో ప్రయాణించిన వారితో పాటు ట్రాన్సిట్ విమానాల్లో వచ్చిన వారికి మాత్రమే ఈ 96 గంటల నిబంధన వర్తిస్తుంది. ఇక కోవిడ్-19 పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా వచ్చే ప్రయాణికులు ఒమన్ వెళ్లగానే పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్రాకింగ్ బ్రాస్లెట్ ధరించి తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి. ఒకవేళ పీసీఆర్ టెస్టులో పాజిటివ్ వస్తే మాత్రం 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండడం తప్పనిసరి.      

తాజా వార్తలుమరిన్ని...