ఓం తత్ సత్

ABN , First Publish Date - 2020-09-05T09:33:36+05:30 IST

..అని పరమాత్మ ఉపదేశం. ఓం-తత్‌-సత్‌ అనే మూడు పదాలు పరమాత్మను నిర్దేశిస్తున్నాయి.

ఓం తత్ సత్

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః

బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా


..అని పరమాత్మ ఉపదేశం. ఓం-తత్‌-సత్‌ అనే మూడు పదాలు పరమాత్మను నిర్దేశిస్తున్నాయి. ‘తత్‌’ అనే పదం వేదంలోనూ ఉంది. ఏది సత్యమైన వస్తువో అది ‘సత్‌’. కనుక ‘ఓం-తత్‌-సత్‌’ అంటే ఓంకార శబ్దరూపమైన ఆ పరబ్రహ్మమే సత్యమైనదని అర్థం. సత్కర్మల్ని శ్రద్ధతో చేసేటప్పుడు ‘ఓం-తత్‌-సత్‌’ మంత్రాన్ని ఉచ్చరిస్తే వాటిలోని సహజ దోషాలు తొలగిపోతాయి. పరమ పదాన్ని పొందేందుకు అదే తగిన ఉపాయం. ‘ఓం-తత్‌-సత్‌’ అనగా ‘‘అవును. పరమాత్ముడున్నాడన్నది నిజం’ అని అర్థం. అన్ని చర్యలకూ ఆధారంగా ఉన్నది ‘సత్‌’. ‘సత్‌’ను బుద్ధిచేత గ్రహింప వీలుకాదు. ఆధ్యాత్మికంగా అనుభవించాలి. తురీయమైన ఆత్మ ‘సత్‌-చిత్‌-ఆనంద’ స్వరూపంగా ఉంది. ‘సత్‌’ అనగా మూడు కాలల్లోనూ చెడనిదని అర్థము. ‘చిత్‌’ అనగా స్వయం ప్రకాశం. సర్వేంద్రియ విషయాలనూ ప్రకాశింపజేసే ప్రకాశం.


ఆనందమంటే పరమ ప్రేమకు చిహ్నం. అట్టిది ఒక్క ఆత్మయే. అదే సచ్చిదానంద స్వరూపమని భావం. సృష్టి ప్రారంభం నుంచి ‘ఓం-తత్‌-సత్‌’ అనే మూడు పదాలు పరతత్వాన్ని చెప్పడానికి వాడబడ్డాయి. జీవితాన్ని యజ్ఞమయం చేయడానికి దానిని ఈశ్వరార్పణం చేయాలని ‘భగవద్గీత’ ప్రతిపాదిస్తోంది. పరమేశ్వరుని పేర్లు అనంతం. ఈశ్వరుని ప్రతి నామంలోనూ అసత్యం నుంచి సత్యానికి తీసుకుపోగల శక్తి ఉంది. అది పాపము నుండి పుణ్యానికి తీసుకెళ్లగలదు. ఈశ్వర స్మరణ వల్ల చెడు వృత్తులు 


మన ఎదుట నిలువలేవు.

దృశి స్వరూపం గగనోపమం పరం 

సకృద్విభాతం త్వజమేక మక్షరమ్‌

అలేపకం సర్వగతం యదద్వయం

తదేవ చాహం సతతం విముక్తమోం


‘‘సాక్షి స్వరూపమైనది, ఆకాశంతో సమానమైనది, సర్వోత్కృష్టమైనది, శాశ్వతంగా ప్రకాశించేది, పుట్టుక లేనిది, అద్వితీయమైనది, నాశనము లేనిది, దేనికీ అంటనిది, సర్వవ్యాపి, సర్వదాముక్తమైనది.. అదే ‘ఓం’ అని శంకరభగవత్పాదులు ‘ఉపదేశ సాహస్రి’లో చెప్పారు. విశ్వశబ్దం విష్ణువును సూచిస్తుంది.


విశ్వం అంటే ‘ఓం’కారం. విష్ణువు అంతటా వ్యాపించి ఉండేవాడు. పరమాత్మ ‘ఓం’కారము కంటే భిన్నం కాదు. వేదోక్తంగా చేసే యజ్ఞ, దాన, తపః క్రియలన్నిటినీ ‘‘ఓం’’ అనే ఉచ్ఛారణతో ప్రారంభిస్తారు. సింహగర్జన వింటేనే అడవిలోని మృగాలన్నీ పారిపోయినట్లు.. ఆత్మభావ నిష్ఠతో ‘ఓం-తత్‌-సత్‌’ అని ఉచ్చరించే సాధకుని హృదయం నుంచి మనోవృత్తులన్నీ దూరంగా వెళ్లిపోతాయి. అందుకే ఈ తత్వాన్ని సదా స్మరించాలని ‘గీతాశాస్త్ర’ ప్రతిపాదన. ‘‘ఓం -తత్‌-సత్‌’’.

                    

- మేఘశ్యామ (ఈమని), 8332931376

Updated Date - 2020-09-05T09:33:36+05:30 IST