Abn logo
Mar 26 2020 @ 04:25AM

అంతా మన మంచికే..

నిన్నటివరకు దేశ అథ్లెట్లది ఒక ఆందోళన..కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తుండడంతో ఒలింపిక్స్‌ జరుగుతాయా, లేదా అని..అయితే, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆ సస్పెన్స్‌కు తెరదించింది.. ఏడాది పాటు విశ్వ క్రీడలను వాయిదా వేసింది..దాంతో ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు..అదే సమయంలో ఇప్పుడు వారికి మరో టెన్షన్‌..దేశమంతా లాక్‌డౌన్‌..ఇంట్లోనుంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేదు..కేవలం వ్యాయామాలకే పరిమితం కావడమేతప్ప మూడు వారాలపాటు ప్రాక్టీస్‌కు అవకాశం లేదు..ఆ తర్వాత పరిస్థితులు కుదుటపడి మళ్లీ వారి సాధన గాడిలో పడేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేం.. ఒలింపిక్స్‌ వాయిదా మనం మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు తోడ్పడుతుందని కోచ్‌లు అంటున్నారు. 


  • ఒలింపిక్స్‌ వాయిదాతో మరింత మెరుగ్గా సన్నద్ధత
  • ప్రాక్టీ్‌సపై అథ్లెట్ల ఆందోళన

 (ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం) : టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా కొందరు అథ్లెట్ల కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అంగీకరించింది. ఇక క్రీడా మంత్రిత్వ శాఖతో చర్చించాక విశ్వ క్రీడల తదుపరి సన్నాహకాలపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత పెరిగిపోవడంతో టోక్యో ఒలింపిక్స్‌ను ఏడాది వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా ఈ క్రీడలు జూలై 24 నుంచి ఆగస్టు తొమ్మిది వరకు జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి అథ్లెట్ల ఆరోగ్యమే తమకు అత్యంత ముఖ్యమని చెబుతున్న ఐఓఏ..లాక్‌డౌన్‌ పూర్తయ్యాక అన్ని క్రీడా సమాఖ్యలతో సమావేశమవుతామని తెలిపింది.  


వాయిదా సబబేకానీ..: దాదాపు 80 మంది భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. క్వాలిఫికేషన్‌ పోటీలు తిరిగి ప్రారంభమైతే మరికొందరికి టోక్యో బెర్త్‌లు లభిస్తాయి. ఒలింపిక్స్‌ వాయిదాతో ప్రపంచ క్రీడారంగానికి పెద్ద ఊరట లభించింది. అదే సమయంలో అథ్లెట్లలో మరో ఆందోళనా లేకపోలేదు. పలువురు ఆటగాళ్లు క్వాలిఫికేషన్‌ టోర్నీలు ఆడాల్సి ఉంది. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి..అర్హత టోర్నమెంట్లను రీషెడ్యూల్‌ చేయడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేం. ఒలిం పిక్స్‌కు అర్హత సాధిస్తామో లేదో అనే ఆందోళనలో అప్పటి వరకు పూర్తిస్థాయిలో సాధన చేయడమంటే క్రీడాకారులపై  ఒత్తిడి తప్పదు.  ఇది మన దేశ ఆటగాళ్లదేకాదు..ప్రపంచంలోని అథ్లెట్లందరి పరిస్థితి కూడా. క్రీడాకారులే కాదు..కోచ్‌లు, సహాయ సిబ్బందిపైనా వాయిదా ప్రభావం పడనుంది. లండన్‌, రియో ఒలింపిక్స్‌లో కలిపి భారత్‌ 8 పతకాలు సాధించడంతో..టోక్యో క్రీడల్లో మన అథ్లెట్లపై ఎన్నో అంచనాలు నిలిచాయి. బ్యాడ్మింటన్‌కు సంబంధించి సింగిల్స్‌లో గత క్రీడల రజత పతక విజేత పీవీ సింధు, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌కు ఒలింపిక్స్‌ బెర్త్‌లు లభించాయి.  సాయిప్రణీత్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫై అయ్యాడు. కానీ వాయిదా నేపథ్యంలో క్వాలిఫికేషన్‌ టోర్నీలు రీషెడ్యూల్‌ అయితే ర్యాంకింగ్‌ పాయింట్ల కోసం అతడు మళ్లీ పోటీపడాల్సి ఉంటుంది.  సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, కశ్యప్‌ ఒలింపిక్‌ బెర్త్‌ రేస్‌లో ఉన్నారు. సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-16లో ఉన్న వారికి ఒలింపిక్స్‌కు అర్హత లభిస్తుంది. ఇక..క్రీడలు వాయిదా పడడంతో వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ను కొద్దికాలం ఫ్రీజ్‌ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ప్రకటించడం..మన షట్లర్లకు మేలు చేసేదే. 


ప్రభావం చూపదు..: ‘ఒలింపిక్స్‌ వాయిదా షట్లర్ల సన్నాహకాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ చూపదు. మేం బాగా పుంజుకొనేందుకు సంవత్సర కాలం ఉపయోగపడుతుంది’ అని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ అన్నాడు. 


షూటర్లు డీలా..: అయితే తొలిసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగనున్న యువ షూటర్లకు మాత్రం క్రీడల వాయిదా దెబ్బగా చెప్పాలి. మూడేళ్లుగా ప్రాక్టీస్‌ చేస్తు న్న షూటర్లు..వాయిదా అనేసరికి డీలా పడిపోయారు. కొద్ది రోజుల తర్వాత వారు మళ్లీ శిక్షణ ప్రారంభించడం మామూలు విషయం కాదు. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా వాయిదాను అంగీకరించాల్సిందేనని జాతీయ షూటింగ్‌ కోచ్‌ జస్పాల్‌ రాణా అన్నాడు. ఎనిమిది మంది పురుషులు, ఏడుగురు మహిళలు సహా టోక్యోలో మొత్తం 15 మంది భారత షూటర్లు తలపడుతున్నారు. వీరంతా పతకాలకు గురి పెట్టారు. ‘జీవితం ఎంతో విలువైనది. అథ్లెట్లే కాదు, ప్రపంచ ప్రజలందరి సంక్షేమం రీత్యా ఒలింపిక్స్‌ వాయిదా నిర్ణయం తీసుకున్నారు’ అని రాణా చెప్పాడు. 


తదుపరి తేదీలు వచ్చాక..: ఒలింపిక్స్‌ తదుపరి షెడ్యూల్‌ వచ్చాక తమ ప్రణాళికలను మళ్లీ తయారు చేసుకుంటామని బాక్సింగ్‌ హై పెర్‌ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ శాంటియాగో నీవియా చెప్పా డు.  మరో ఏడాదికి తగ్గట్టు క్రీడాకారులంతా తమ ప్రణాళికలను  తిరిగి రూపొందించుకోవాల్సిందేనని ఒలింపిక్‌ గోల్డ్‌క్వెస్ట్‌ సీఈఓ, హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ వీరేన్‌ రస్కినా అన్నాడు.  మొత్తంగా..ఏడాది వాయిదా మనం మరింత అత్యుత్తమంగా సన్నద్ధమయ్యేందుకు తోడ్పడుతుందని రెజ్లింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, టీటీ కోచ్‌లు అభిప్రాయపడుతున్నారు. 


Advertisement