స్వర్ణ నీరాజనం

ABN , First Publish Date - 2021-08-08T09:42:37+05:30 IST

నీరజ్‌ చోప్రాది హరియాణాలోని పానిపట్‌ జిల్లా ఖందేరా స్వగ్రామం. తండ్రి సతీ్‌షకుమార్‌ రైతు. 17మందితో కూడిన ఉమ్మడి కుటుంబం వారిది. చిన్నతనంలో నీరజ్‌ స్నేహితులతో కలిసి గ్రామంలోని చెట్లపై తేనెపట్టులను...

స్వర్ణ నీరాజనం

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

నీరజ్‌ చోప్రాది హరియాణాలోని పానిపట్‌ జిల్లా ఖందేరా స్వగ్రామం. తండ్రి సతీ్‌షకుమార్‌ రైతు. 17మందితో కూడిన ఉమ్మడి కుటుంబం వారిది. చిన్నతనంలో నీరజ్‌ స్నేహితులతో కలిసి గ్రామంలోని చెట్లపై తేనెపట్టులను సేకరించేవాడు. ఈక్రమంలో తేనెటీగలు కుట్టినా భయపడేవాడు కాదు. వద్దని తల్లిదండ్రులు చెప్పినా ఖాతరు చేసేవాడుకాదు. పశువుల తోకలు పట్టుకొని ఆడడం చోప్రా మరో సరదా. అలా ఆడుతూ, పాడుతూ, తింటూ తిరుగుతూ 12 సంవత్సరాలు వచ్చే సరికి ఊబకాయుడిగా మారాడు. అంత బరువు ఆరోగ్యానికి మంచిదికాదని, తగ్గాలని తల్లిదండ్రులునీరజ్‌పై పదేపదే ఒత్తిడి చేశారు. అంతేకాదు అల్లరిచిల్లరి పనులుమాని క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెబుతుండేవారు. అయినా వినని అతడు తన ధోరణిలోనే సాగుతుండేవాడు. చివరకు తండ్రి ఒత్తిడితో రన్నింగ్‌ చేసేందుకు నీరజ్‌ అంగీకరించాడు. 


జావెలిన్‌పట్ల అలా..: 2011లో బంధువుతో కలిసి గ్రామానికి 15 కి.మీ., దూరంలోని సోనిపట్‌ శివాజీ స్టేడియంలో రన్నింగ్‌కోసం నీరజ్‌ వెళ్లాడు. ఈక్రమంలో అక్కడ కొందరు జావెలిన్‌ త్రో ప్రాక్టీస్‌ చేస్తుండడం చూసి ఆ క్రీడపై చోప్రా మక్కువ పెంచుకున్నాడు. అక్కడ సాధన చేస్తున్న జావెలిన్‌ త్రోయర్‌ జేవియర్‌ చౌధురితో నీరజ్‌కు పరిచయం ఏర్పడింది. జావెలిన్‌పట్ల నీరజ్‌ ఆసక్తిని గమనించిన చౌధురి అతడిని ప్రోత్సహించాడు. అంత బరువుతోనూ ఆరంభంలోనే 40 మీ. దూరం విసరడంతో జేవియర్‌ ఆశ్చర్యపోయాడు.  జావెలిన్‌లో రాణించేందుకు చౌధురిసూచన మేరకు బరువు కూడా తగ్గాడు. మెరుగైన శిక్షణ కోసం 2012లో పంచకులలోని దేవీలాల్‌ స్టేడియానికి మారిన నీరజ్‌ ఆ ఏడాది ఆఖరికి జాతీయ అండర్‌-16 చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించాడు. ఉమ్మడి కుటుంబం, 10 ఎకరాల పొలం..దానిమీద వచ్చే ఆదాయంతో అంతా జీవించాల్సి రావడంతో ఇంకా మెరుగైన ట్రెయినింగ్‌ తీసుకొనే విషయంలో నీరజ్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వెరవని తండ్రి..చోప్రా కెరీర్‌ కన్నా ఏదీ ఎక్కువ కాదని అతడి శిక్షణకోసం ఎంత డబ్బు ఖర్చు చేసేందుకైనా వెనకాడలేదు. ఆస్ట్రేలియాకు చెందిన దివంగత కోచ్‌ గ్యారీ కాల్వెర్ట్‌ ఆధ్వర్యంలో రాటుదేలిన చోప్రా..ఫిన్లాండ్‌లో జరిగిన అండర్‌-20 ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సలో రికార్డు స్వర్ణంతో సంచలనం సృష్టించాడు. దాంతో ప్రపంచ జావెలిన్‌లో ఓ స్టార్‌ ఆవిర్భవించాడని విశ్లేషకులు అంచనా వేశారు. జర్మనీకి చెందిన రిటైర్డ్‌ ట్రాక్‌, ఫీల్డ్‌ అథ్లెట్‌ యూ హోన్‌ శిక్షణలో ఒలింపిక్స్‌ స్వర్ణం అందుకున్న నీరజ్‌ చోప్రా భవిష్యత్‌లో మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్మీలో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నీరజ్‌..విశిష్ట సేవా మెడల్‌ అందుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం అతడిని అర్జున అవార్డుతో సత్కరించింది. 


Updated Date - 2021-08-08T09:42:37+05:30 IST